అయోమయం
ఆదిలాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా 174 ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రమాణాలు లేవంటూ ఆయా కళాశాలలకు అఫిలియేషన్ నిలిచిపోగా, ఇందులో జిల్లాలోని రెండు ఇంజినీరింగ్ కళాశాలలు ఉండడం గమనార్హం. ఇప్పటికే ఈ ఏడాది ఇంజినీరింగ్ ప్రవేశాలు మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తికావడం, రెండో విడత కౌన్సెలింగ్ తే దీలు త్వరలో ప్రకటించనున్న నేపథ్యంలో ఆ జాబితా లో తమ కళాశాలల పేర్లు ఉంటాయో.. లేదోనన్న ఆం దోళన జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో కన్పిస్తోం ది. ఆదిలాబాద్‌లోని ఏఎమ్మార్, మంచిర్యాలలోని ఐజా ఇంజినీరింగ్ కళాశాలల్లో 720 సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది అడ్మిషన్లపై సందిగ్ధత నేపథ్యంలో ఆయా క ళాశాలల్లో ప్రవేశాలపై అనుమానాలు నెలకొన్నాయి.
అఫిలియేషన్ నిలిపివేత
ఆదిలాబాద్‌లోని ఏఎమ్మార్‌లో ఈఎస్ఈ 120, సీఎస్ ఈ 120, మెకానికల్ 60, సివిల్ 60 మొత్తంగా 360 సీట్లు ఉన్నాయి. మంచిర్యాలలోని ఐజాలో సివిల్ 60, ఈఎస్ఈ 60, సీఎస్ఈ 60, కంప్యూటర్ సైన్స్ 60, మైనింగ్ 120, ఎలక్ట్రికల్ 60 సీట్లు కలిపి మొత్తం 360 సీట్లు ఉన్నాయి.
తగిన ప్రమాణాలు పాటించని కళాశాలలకు అడ్డుకట్ట వేయడం ద్వారా విద్యార్థులకు నా ణ్యమైన విద్యను అందించవచ్చని టీఆర్ఎస్ సర్కారు యోచించింది. ఈఏడాది ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టేందుకు జేఎన్టీయూ నేతృత్వంలో ఏర్పాటైన అఫిలియేషన్ల కమిటీ ఆగస్టులో ఇంజినీరింగ్ కళాశాలల్లో తనిఖీ నిర్వహించింది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యూకేషన్(ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం కళాశాలల్లో ప్రమాణాలు ఉన్నాయా.. లేవా అన్నది పరిశీలించారు.
జిల్లాలోని రెండు కళాశాలలకు సొంత భూమిలో కళాశాల భవనాలు, తరగతి గదులు, సదుపాయాలు ఉన్నప్పటికీ ఏఎమ్మార్ కళాశాలలో లేబోరేటరీ సరిగా లేదని, ఐజా కళాశాలలో లై బ్రరీ, ల్యాబ్ సరిగా లేదని అనుమతి నిరాకరించారు. ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక ఫ్యాకల్టీ ఉండాల్సిఉన్నప్పటికీ ఆయా కళాశాలల్లో ఈ పరిస్థితి లేదు. బీటెక్ విద్యార్థులకు బోధించే వారికి కనీసం ఎంటెక్ అర్హత ఉండాలనే నిబంధనను పాటించలేదు. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీకి బీఆర్సీ వేతనాలు చెల్లించాల్సి ఉన్న దానిని అమలు చేయడం లేదని అఫియేషన్ల కమిటీ దృష్టికి వచ్చింది. ల్యాబ్‌లలో ఉండాల్సిన పరికరాలు లేకపోవడం, లైబ్రరీల్లో పుస్తకాలు ఉండకపోవడం వంటివి తనిఖీల్లో బయట పడ్డాయి.
దీంతో అఫిలియేషన్‌ను నిలిపివేశారు. ఈ ఏడాది అనుమతి లభిస్తుందో లేదోనన్న సంశయనం నెలకొంది. కౌన్సెలింగ్‌పై అనుమానాలు ఉండడంతో ఈ రెండు కళాశాలల్లో ప్రవేశాలు జరుగుతాయో.. లేదో వేచిచూడాలి. జిల్లాలో గ్రామీణ విద్యార్థులు సాంకేతిక విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉంది.
పెండింగ్‌లో ఫీజు రీయింబర్స్మెంట్
జిల్లాలోని రెండు ఇంజినీరింగ్ కళాశాలలకు గతేడాది, అంతకు ముందుకు సంబంధించిన సుమారు రూ.60 లక్షల వరకు ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది అఫిలియేషన్‌పై సందిగ్ధం నెలకొనగా ప్రస్తుతం నడుస్తున్న రెండు, మూడు, నాలుగో సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంవత్సరం ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కొత్త దరఖాస్తులు, రెన్యూవల్ ఇంకా ప్రారంభం కాలేదు. 1956 స్థానికత ప్రమాణికంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్(ఫాస్ట్) పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఆ నిబంధనల మేరకు ఫీజులు చెల్లించే అవకాశాలున్నాయి. అప్పటి వరకు పెండింగ్, కొత్త దరఖాస్తులు, రెన్యూవల్స్‌కు మోక్షం లభించే పరిస్థితి ఉంది.
భారంగా ఉంది.. - శ్యాంసుందర్, హెచ్‌వోడీ ఏఎమ్మార్ కళాశాల
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాల నిర్వహణ మేనేజ్మెంట్కు భారంగా మారింది. ఫ్యాకల్టీకి వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. కరెంట్, వాటర్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఇంజినీరింగ్ చదువుతున్న పేద విద్యార్థుల ఫీజులను ప్రభుత్వం చెల్లించని పక్షంలో ఆయా విద్యార్థులను కట్టాలని అడిగే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం కళాశాలల దుస్థితిని గమనించి డబ్బులు విడుదల చేయాలి.