Apoorva Lakhia
-
‘జంజీర్’రీమేక్‌పై విమర్శల తుఫాన్!
‘జంజీర్’ చిత్రంపై బాలీవుడ్లో విమర్శల తుఫాన్ జోరందుకుంది. షోలే చిత్రాన్ని ‘ఆగ్’ రీమేక్‌గా మలిచిన దర్శకుడు రాంగోపాల్ వర్మకు బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవం ఎదురైంది. అమితాబ్ చిత్రాల రీమేక్‌లో అత్యంత నాసిరకమైన చిత్రం ‘జంజీర్’ అని మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ నటించిన క్లాసిక్స్ చిత్రాలు ‘డాన్’, ‘అగ్నిపథ్’ రీమేక్‌లకు బాలీవుడ్లో ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. తాజాగా రాంచర ణ్ తేజ బాలీవుడ్‌కు పరిచయం అవుతూ అపూర్వ లఖియా దర్శకత్వం వహించిన ‘జంజీర్’ రీమేక్‌కు బాలీవుడ్లో దారుణమైన ఒపెనింగ్స్ రావడం మింగుడుపడని విషయంగా మారింది. భారీ అంచనాలతో 2086 ధియేటర్లలో విడుదలైన ’జంజీర్’ చిత్రం తొలి రెండు రోజుల్లో 3.58 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. జంజీర్ రీమేక్ బాలీవుడ్ ప్రేక్షకులకు భారీ నిరాశనే మిగిల్చింది. ‘జంజీర్ ఓ క్లాసిక్ చిత్రం. జంజీర్ రీమేక్ చాలా పేలవంగా ఉంది. జంజీర్‌ను అపవిత్రం చేశారు’ అని బాలీవుడ్ సినీ విమర్శకులు అంటున్నారు. -
తీరం దాటిన తుఫాన్
హైలైట్స్: డైలాగ్స్ డ్రాబ్యాక్స్:కథనం, పాటలు క్యారక్టరైజేషన్స్ 1973 సంవత్సరంలో విడుదలైన ‘జంజీర్’ హిందీ చలన చిత్రసీమలో ఓ ట్రెండ్ సెట్టర్. అమితాబ్‌ను ఎదురులేని సూపర్‌స్టార్‌గా, యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా తెరపై ఆవిష్కరింప చేసిన సినిమా అది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అమితాబ్‌కు బాలీవుడ్లో ఎదురేలేదన్నది వాస్తవం. ‘జంజీర్’ చిత్రం ఒక్క అమితాబ్కే కాకుండా ఆ చిత్ర రచయితలు సలీం-జావేద్, దర్శకుడు ప్రకాశ్ మెహ్రాలకూ ఎనలేని గుర్తింపు తెచ్చింది. జయబాధురి, ప్రాణ్, అజిత్, బిందు వంటి నటీనటులకు మేలి మలుపుగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన, ఇప్పుడు వస్తున్న ఎన్నో పోలీస్ పాత్రలకు ‘జంజీర్’లో అమితాబ్ పోషించిన విజయ్ పాత్రే స్ఫూర్తి, ప్రేరణ. అలాంటి క్లాసిక్ రీమేక్‌తో మన రామ్‌చరణ్ బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. దర్శకుడు అపూర్వ లాఖియా చేసిన ఈ ప్రయత్నం తెలుగులో ‘తుఫాన్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే విడుదలకు ముందే మెరుపులు, ఉరుములతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచిన తుఫాన్.. రిలీజ్ తర్వాత ఆ వేగాన్ని కొనసాగించిందో లేదో తెలుసుకోవాలంటే... ముందు కథలోకెళ్దాం. ఆటంకాలను అధిగమిస్తూ... అన్యాయాన్ని అణచివేస్తూ... నిజాయితీకి ప్రతిరూపంగా నిలిచిన పోలీస్ అధికారి విజయ్ ఖన్నా. ఉద్యోగంలో చేరిన కొంత కాలానికే పలు ప్రాంతాలకు బదిలీ అయి.. చివరకు ముంబైకి చేరిన విజయ్... అక్కడి ఆయిల్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతాడు. ఈ క్రమంలో విజయ్ ఖన్నాకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అన్నింటిని అధిగమించి ఆయిల్ మాఫియాను ఎలా అణిచేశాడు అనేది ‘తుఫాన్’ చిత్ర కథ. ‘జంజీర్’ రీమేక్ అనగానే మాతృకతో పోల్చి చూడటం సహజం. నటన పరంగా కూడా రామ్‌చరణ్‌ని అమితాబ్‌తో కంపేర్ చేసి చూస్తారు. అసలు ‘జంజీర్’ పేరు చెప్పకుండా ఇదే పాత్రను చరణ్ పోషిస్తే... ఇంత అంచనాలు ఉండేవి కావు. సో... ఆ అంచనాలే అటు సినిమాకు ఇటు చరణ్‌కు ప్రతికూలంగా నిలిచాయి. నిజానికి పాత ‘జంజీర్’లో అమితాబ్ యాక్షన్, ఎమోషన్స్ నభూతో నభవిష్యతి. రామ్‌చరణ్ నుంచి ఆ స్థాయి పెర్ఫార్మెన్స్ని ఆశించడం సబబే కాదు. ఎందుకంటే, హీరోగా అతని వయసు కేవలం ఐదు సినిమాలు మాత్రమే. అతని స్థాయికి అతను ‘ఓకే’ అనిపించాడనే చెప్పాలి. చరణ్ తెలుగు ఇమేజ్ను దృష్టిలో పెట్టుకోకుండా బాలీవుడ్ ఫ్లేవర్‌లో సినిమా ఉండటం ఓ మైనస్ అయ్యింది. మాలా, విజయ్ పాత్రల మధ్య కెమిస్ట్రీ కుదరలేదనడంలో సందేహం అక్కర్లేదు. మాలా పాత్రకు ప్రియాంక చోప్రా రాంగ్ ఛాయిస్. వీటన్నింటికి తోడూ పాత్రల మధ్య పొంతన లేకపోవడం.. క్లారిటీ లోపించడం చిత్రం జనరంజకంగా లేకపోవడానికి ప్రధాన కారణమైంది. షేర్ ఖాన్ (శ్రీహరి), తేజ (ప్రకాశ్ రాజ్), జయదేవ్ (తనికెళ్ల భరణి), మోనా(మహీ గిల్) వంటి ఇతర పాత్రలు కూడా జీవం లేకుండా తెరపై కదలాడాయి. అపూర్వ లాఖియా స్క్రీన్‌ప్లే, దర్శకత్వం పేలవంగా ఉన్నాయి. అభిమానులను ఆకట్టుకునేందుకు ఆయన ఎక్కడా ఓ చిన్న ప్రయత్నం కూడా చేసినట్టు కనిపించదు. దర్శకుడిగా అన్ని విభాగాల్లోనూ ఆయన వైఫల్యం కొట్టొచ్చిన ట్టు అనిపించింది. సాంకేతికంగా కూడా పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఈ చిత్రంలో ఏమైనా చెప్పుకోవాలంటే డైలాగ్స్ గురించి చెప్పుకోవచ్చు. అయితే అన్ని విభాగాల వైఫల్యం కారణంగా సంభాషణలు కూడా మరుగునపడిపోయాయి. 1973లో విడుదలైన ‘జంజీర్’ జ్ఞాపకాలు ప్రేక్షకుల మదిలో పదికాలాలు పదిలంగా ఉండటం ఖాయం. అలాగే... అమితాబ్ నటించిన చిత్రాలను రీమేక్ చేసి చేతులు కాల్చుకున్న జాబితాలో షోలే, డాన్ (ఫర్వాలేదు) జాబితాలో ‘జంజీర్’ కూడా చేరడం ఖాయం. విడుదలకు ముందు సంచలనాలకు వేదికగా మారుతుందనుకున్న ‘తుఫాన్’ ఎలాంటి ప్రభావం చూపకుండానే తీరం దాటే పరిస్థితి నెలకొని ఉందని సినీ విమర్శకుల అభిప్రాయం. - రాజాబాబు అనుముల -
అందుకే ‘జంజీర్’లో రామ్‌చరణ్‌ను తీసుకున్నాం - అపూర్వ లఖియా
‘‘గత కొన్ని నెలలుగా నా జీవితం ‘జంజీర్’తో మమేకపోయింది. నేను అనుకున్న విధంగానే ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. అందుకే హాలిడే మూడ్‌లోకి వెళ్లిపోయా’’ అంటున్నారు అపూర్వలఖియా. ఆయన దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా రూపొందిన ‘జంజీర్’ ఈ నెల 6న విడుదల కానుంది. ‘బిగ్ బి’ అమితాబ్‌బచ్చన్ హీరోగా నటించిన ఒకప్పటి సంచలనాత్మక చిత్రం ‘జంజీర్’కి ఇది రీమేక్. తెలుగులో ‘తుఫాన్’ పేరుతో విడుదల కానుంది. ఈ సందర్భంగా అపూర్వ లఖియాతో ‘సాక్షి’ ఫోన్లో సంభాషించింది. = బాలీవుడ్లో ఎంతోమంది హీరోలుండగా, రామ్‌చరణ్‌నే ఎందుకు ఎంచుకున్నట్టు? మీరన్నట్లు బాలీవుడ్లో చాలామంది హీరోలున్నారు. కానీ యాంగ్రీ యంగ్‌మాన్ పాత్ర చేయదగ్గ హీరోలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. రచయితలు సురేష్నాయర్, చేతన్ గాంధీ ఒరిజినల్ ‘జంజీర్’లో మార్పులూ చేర్పులూ చేసి అద్భుతమైన స్క్రిప్ట్ చేసిచ్చారు. దీనికి హీరోగా ఎవరు పనికొస్తారనుకుంటున్న సమయంలో యాదృచ్ఛికంగా ‘మగధీర’ చూశాను. అందులో రామ్‌చరణ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ చూసి ఆశ్చర్యపోయాను. ‘జంజీర్’కి అతనే కరెక్ట్ అని ఆ క్షణంలోనే ఫిక్సయిపోయాను. = కానీ, చరణ్ ఈ కథ ఓకే చేయడానికి దాదాపు ఏడెనిమిది నెలల సమయం తీసుకున్నారట. ఆ గ్యాప్‌లో మీరు వేరే హీరోని తీసుకోవాలనుకోలేదా? అసలా ఆలోచనే రాలేదు. చరణ్ చేస్తేనే బాగుంటుందని బలంగా ఫిక్స్ అయ్యాను. అందుకని తన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేవరకు వెయిట్ చేశాం. = ఈ చిత్రానికి చరణ్‌ని తీసుకున్నప్పుడు తెలుగులో తనకు నాలుగు సినిమాల అనుభవం మాత్రమే ఉంది. మరి... యాంగ్రీ యంగ్‌మాన్ విజయ్ పాత్రలో తను ఒదిగిపోగలరని ఎలా నమ్మారు? ‘మగధీర’ ఫైట్ సీన్స్‌లో తనలో ఫైర్ చూశాను. దాంతో నమ్మకం కుదిరింది. నా నమ్మకాన్ని చరణ్ నిజం చేశాడు. విజయ్ పాత్రను తను బాగా చేశాడు. ఈరోజు నేను చెప్పిన మాటతో రేపు ప్రేక్షకులూ ఏకీభవిస్తారు. = అప్పట్లో అమితాబ్‌కి ‘యాంగ్రీ యంగ్‌మాన్’ ఇమేజ్ తెచ్చిన ఈ చిత్రం, ఇప్పుడు చరణ్‌కి కూడా బాలీవుడ్లో ఆ ఇమేజ్ తెచ్చిపెడుతుందంటారా? తప్పకుండా అది జరుగుతుంది. ఇప్పుడు రామ్‌చరణ్ ఎవరో? ఎలా నటిస్తాడో బాలీవుడ్ ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. అందుకని ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్‌కి వస్తారు. సినిమా చూసిన తర్వాత ‘కొత్త అబ్బాయి బాగా చేశాడే’ అనుకుంటారు. ఇక తెలుగులో తన ప్రతిభ గురించి అందరికీ తెలిసిందే. అందుకని తెలుగు ప్రేక్షకులు అంచనాలతో వస్తారు. అవి నిజమవుతాయి. = ‘జంజీర్’ ఒరిజినల్ స్టోరీ రైటర్స్ సలీమ్-జావేద్ రాయల్టీ విషయంలో వివాదం చేశారు కదా, ఏమనిపించింది? వాస్తవానికి ఈ వివాదంతో నాకు సంబంధం లేదు. అది సదరు రచయితలు, నిర్మాతలకు సంబంధించినది. ఈ వివాదం వచ్చినప్పుడు నేను భయపడలేదు. సినిమాపైనే దృష్టి పెట్టాను. సలీమ్-జావెద్ అంటే నాకు గౌరవం ఉంది. వాళ్లు అద్భుతమైన కథ సృష్టించారు. ఇంతకు మించి ఈ వివాదం గురించి నేనేం మాట్లాడలేను. = చిరంజీవికి ఈ సినిమా చూపించారా? ఈ మధ్యే రషెస్ చూపించాను. సినిమా చూసిన తర్వాత ఆయన నన్ను ఆత్మీయంగా హత్తుకున్నారు. రామ్‌చరణ్ మదర్ కూడా సినిమా బాగుందని ప్రశంసించారు. మంచి ఎంటర్టైనర్ అని కితాబులిచ్చారు. = ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల గురించి మీకు తెలిసే ఉంటుంది. సీమాంధ్రలో ‘తుఫాన్’ని అడ్డుకుంటామంటున్నారు. మీ తొలి తెలుగు సినిమాకి ఇలాంటి వివాదం రావడం నిరుత్సాహంగా ఉందా? సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే సినిమా ముఖ్యోద్దేశం. అది రాజకీయం కావడం బాధాకరమే. రాజకీయాలతో సంబంధం లేకుండా ఇంటిల్లిపాదీ టీవీ చూస్తున్నారు. అలాగే సినిమాని కూడా చూడాలని విన్నవించుకుంటున్నాను. ప్రేక్షకుల కోసమే మేం సినిమాలు తీస్తున్నాం. వాళ్లే చూడకపోతే ఇంకేం చేయగలం? = భవిష్యత్తులో తెలుగు సినిమాలు డెరైక్ట్ చేస్తారా? కళకు భాషతో సంబంధం లేదు. ఇప్పటివరకూ నన్నెవరూ తెలుగు సినిమా చేయమని అడగలేదు. ఒకవేళ అడిగితే చేస్తా. -
‘జంజీర్లో నటించినందుకు ఆనందంగా ఉంది’
న్యూఢిల్లీ: జంజీర్ సినిమాలో చేసినందుకు చాలా ఆనందంగా ఉందని నూతన నటుడు అంకుర్ భాటియా తెలిపాడు. అమితాబ్ బచ్చన్ హీరోగా 1973 సంవత్సరంలో రూపొందిన సినిమా రీమేక్‌లో నటించే అవకాశం రావడం అదృష్టమేనన్నాడు. ఈ సినిమాలో అంకుర్‌కు పెద్దగా డైలాగ్‌లు లేకపోయినా సినిమాలో నటించడం నిజంగానే అదృష్టమని పేర్కొన్నాడు. తాను బాలీవుడ్లో ప్రవేశించడానికి జంజీర్ చక్కటి వేదికవుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇందులో విలన్‌గా నటించిన ప్రకాశ్‌రాజ్‌కు అంకుర్ కుడిభజంగా ఉంటాడు. అపూర్వ లాఖియా తీసిన ఈ సినిమాలో రామ్ అమితాబ్ పాత్రలో కనిపిస్తాడు. ప్రియాంకచోప్రా ఇతనికి జోడీగా కనువిందు చేయనుంది. గత రెండు- మూడు ఏళ్ల నుంచి న్యూయార్క్‌లోనే ఉంటూ సినిమాలు చేస్తున్నానని తెలిపాడు. భారతీయులకు హాలీవుడ్లో పెద్ద పాత్రలు రావడం చాలా కష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. త్వరలో భారత్‌కు వచ్చి ఇక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటానని భాటియా తెలిపాడు. గతంలో తాను ముంబైకు వచ్చి చాలాసార్లు అవకాశాలకోసం ప్రయత్నించానని, జంజీర్ దర్శకుడు అపూర్వ లాకియా ఈ సినిమాలో తనకు మంచి పాత్రను ఇచ్చి ప్రోత్సహించాడని తెలిపాడు. ప్రముఖలతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉందన్నాడు. -
తెలుగు చిత్రానికి అపూర్వ లకియా దర్శకత్వం!
టాలీవుడ్ లో మరో చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చిందని బాలీవుడ్ దర్శకుడు అపూర్వ లకియా వెల్లడించారు. అయితే ఆ చిత్ర వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు. తాను ఇంకా ఆ చిత్రానికి దర్శకత్వం వహించడానికి ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం జంజీర్ మీదే నా దృష్టి ఉంది అని అపూర్వ అన్నాడు. కాని తనకు ఓ మంచి ఆఫర్ లభించిందని తెలిపాడు. ప్రస్తుతం జంజీర్ చిత్రాన్ని బాలీవుడ్ లోనూ, తూఫాన్ గా టాలీవుడ్ లోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ప్రియాంక చోప్రా, సంజయ్ దత్, ప్రకాశ్ రాజ్ మహీ గిల్, అతుల్ కులకర్ణిలు నటించిన చిత్రం సెప్టెంబర్ 6 తేదిన విడుదలకు సిద్ధమవుతోంది. గతంలో మిషన్ ఇస్తాంబుల్, షూట్ అవుట్ ఎట్ లోకండ్ వాలా చిత్రానికి దర్శకత్వం వహించారు.