‘‘గత కొన్ని నెలలుగా నా జీవితం ‘జంజీర్’తో మమేకపోయింది. నేను అనుకున్న విధంగానే ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. అందుకే హాలిడే మూడ్‌లోకి వెళ్లిపోయా’’ అంటున్నారు అపూర్వలఖియా. ఆయన దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా రూపొందిన ‘జంజీర్’ ఈ నెల 6న విడుదల కానుంది. ‘బిగ్ బి’ అమితాబ్‌బచ్చన్ హీరోగా నటించిన ఒకప్పటి సంచలనాత్మక చిత్రం ‘జంజీర్’కి ఇది రీమేక్. తెలుగులో ‘తుఫాన్’ పేరుతో విడుదల కానుంది. ఈ సందర్భంగా అపూర్వ లఖియాతో ‘సాక్షి’ ఫోన్‌లో సంభాషించింది.
= బాలీవుడ్‌లో ఎంతోమంది హీరోలుండగా, రామ్‌చరణ్‌నే ఎందుకు ఎంచుకున్నట్టు?
మీరన్నట్లు బాలీవుడ్‌లో చాలామంది హీరోలున్నారు. కానీ యాంగ్రీ యంగ్‌మాన్ పాత్ర చేయదగ్గ హీరోలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. రచయితలు సురేష్‌నాయర్, చేతన్ గాంధీ ఒరిజినల్ ‘జంజీర్’లో మార్పులూ చేర్పులూ చేసి అద్భుతమైన స్క్రిప్ట్ చేసిచ్చారు. దీనికి హీరోగా ఎవరు పనికొస్తారనుకుంటున్న సమయంలో యాదృచ్ఛికంగా ‘మగధీర’ చూశాను. అందులో రామ్‌చరణ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ చూసి ఆశ్చర్యపోయాను. ‘జంజీర్’కి అతనే కరెక్ట్ అని ఆ క్షణంలోనే ఫిక్సయిపోయాను.
= కానీ, చరణ్ ఈ కథ ఓకే చేయడానికి దాదాపు ఏడెనిమిది నెలల సమయం తీసుకున్నారట. ఆ గ్యాప్‌లో మీరు వేరే హీరోని తీసుకోవాలనుకోలేదా?
అసలా ఆలోచనే రాలేదు. చరణ్ చేస్తేనే బాగుంటుందని బలంగా ఫిక్స్ అయ్యాను. అందుకని తన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేవరకు వెయిట్ చేశాం.
= ఈ చిత్రానికి చరణ్‌ని తీసుకున్నప్పుడు తెలుగులో తనకు నాలుగు సినిమాల అనుభవం మాత్రమే ఉంది. మరి... యాంగ్రీ యంగ్‌మాన్ విజయ్ పాత్రలో తను ఒదిగిపోగలరని ఎలా నమ్మారు?
‘మగధీర’ ఫైట్ సీన్స్‌లో తనలో ఫైర్ చూశాను. దాంతో నమ్మకం కుదిరింది. నా నమ్మకాన్ని చరణ్ నిజం చేశాడు. విజయ్ పాత్రను తను బాగా చేశాడు. ఈరోజు నేను చెప్పిన మాటతో రేపు ప్రేక్షకులూ ఏకీభవిస్తారు.
= అప్పట్లో అమితాబ్‌కి ‘యాంగ్రీ యంగ్‌మాన్’ ఇమేజ్ తెచ్చిన ఈ చిత్రం, ఇప్పుడు చరణ్‌కి కూడా బాలీవుడ్‌లో ఆ ఇమేజ్ తెచ్చిపెడుతుందంటారా?
తప్పకుండా అది జరుగుతుంది. ఇప్పుడు రామ్‌చరణ్ ఎవరో? ఎలా నటిస్తాడో బాలీవుడ్ ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. అందుకని ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్‌కి వస్తారు. సినిమా చూసిన తర్వాత ‘కొత్త అబ్బాయి బాగా చేశాడే’ అనుకుంటారు. ఇక తెలుగులో తన ప్రతిభ గురించి అందరికీ తెలిసిందే. అందుకని తెలుగు ప్రేక్షకులు అంచనాలతో వస్తారు. అవి నిజమవుతాయి.
= ‘జంజీర్’ ఒరిజినల్ స్టోరీ రైటర్స్ సలీమ్-జావేద్ రాయల్టీ విషయంలో వివాదం చేశారు కదా, ఏమనిపించింది?
వాస్తవానికి ఈ వివాదంతో నాకు సంబంధం లేదు. అది సదరు రచయితలు, నిర్మాతలకు సంబంధించినది. ఈ వివాదం వచ్చినప్పుడు నేను భయపడలేదు. సినిమాపైనే దృష్టి పెట్టాను. సలీమ్-జావెద్ అంటే నాకు గౌరవం ఉంది. వాళ్లు అద్భుతమైన కథ సృష్టించారు. ఇంతకు మించి ఈ వివాదం గురించి నేనేం మాట్లాడలేను.
= చిరంజీవికి ఈ సినిమా చూపించారా?
ఈ మధ్యే రషెస్ చూపించాను. సినిమా చూసిన తర్వాత ఆయన నన్ను ఆత్మీయంగా హత్తుకున్నారు. రామ్‌చరణ్ మదర్ కూడా సినిమా బాగుందని ప్రశంసించారు. మంచి ఎంటర్‌టైనర్ అని కితాబులిచ్చారు.
= ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల గురించి మీకు తెలిసే ఉంటుంది. సీమాంధ్రలో ‘తుఫాన్’ని అడ్డుకుంటామంటున్నారు. మీ తొలి తెలుగు సినిమాకి ఇలాంటి వివాదం రావడం నిరుత్సాహంగా ఉందా?
సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడమే సినిమా ముఖ్యోద్దేశం. అది రాజకీయం కావడం బాధాకరమే. రాజకీయాలతో సంబంధం లేకుండా ఇంటిల్లిపాదీ టీవీ చూస్తున్నారు. అలాగే సినిమాని కూడా చూడాలని విన్నవించుకుంటున్నాను. ప్రేక్షకుల కోసమే మేం సినిమాలు తీస్తున్నాం. వాళ్లే చూడకపోతే ఇంకేం చేయగలం?
= భవిష్యత్తులో తెలుగు సినిమాలు డెరైక్ట్ చేస్తారా?
కళకు భాషతో సంబంధం లేదు. ఇప్పటివరకూ నన్నెవరూ తెలుగు సినిమా చేయమని అడగలేదు. ఒకవేళ అడిగితే చేస్తా.