టెక్ మహింద్రా ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్
బెంగళూరు :
పెరుగుతున్న వీసా వ్యయాలు, క్లయింట్ల నుంచి వస్తున్న సర్వీసు ధరల తగ్గింపు డిమాండ్లు టెక్ కంపెనీల ఉద్యోగులకు గండికొడుతోంది. వేతనాల పెంపు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల ఆశలను అడియాసలు చేస్తూ టెక్ మహింద్రా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరేళ్ల కంటే ఎక్కువ అనుభవమున్న ఉద్యోగుల అప్రైజల్ సైకిల్‌ను నిలిపివేస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. కంపెనీ మేనేజ్మెంట్ సమీక్ష సందర్భంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎల్ రవిచంద్రన్ నేతృత్వంలో మరో ముగ్గురు టెక్ ఉద్యోగులు పాల్గొన్న వెబీనార్‌లో ఈ విషయాన్ని తెలిపారు. టీమ్ లీడర్లు, ఆపై స్థాయి వారు దీనికి ప్రభావితవంతులవుతారని వారు పేర్కొన్నారు.
వేతన పెంపును ఆశిస్తున్న వారు కనీసం మరో రెండు త్రైమాసికాలైనా వేచిచూడాలని పేర్కొన్నారు. దీన్ని ధృవీకరించిన టెక్ మహిద్రా, అప్రైజల్స్‌ను నిరవధికంగా వాయిదా వేయడం లేదని తెలిపింది. మేనేజ్మెంట్ సమీక్ష అనంతరం పెంపు గురించి ప్రభావిత ఉద్యోగులకు తాము తెలిపామని చెప్పింది. మూడో క్వార్టర్లో తమ ప్రదర్శనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోలేదని, మేనేజ్మెంట్ సమీక్షలో భాగంగా ఇది చర్చకు వచ్చినట్టు టెక్ మహింద్రా అధికార ప్రతినిధి తెలిపారు. టెక్ మహింద్రకు మూడో క్వార్టర్లో రెవెన్యూ 4 శాతం మేర పెరిగింది.
ఇతర ఉద్యోగుల పరిహారాలను మార్చిలో జరుగబోయే సమీక్షలో నిర్ణయిస్తామని, కానీ జూలై నుంచి కొత్త వేతనాలు అమల్లోకి వస్తాయన్నారు. టెక్ కంపెనీలకు ఆందోళనకరంగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, క్లయింట్ల నుంచి వస్తున్న ధరల తగ్గింపు డిమాండ్లు ఉద్యోగుల వేతనాలకు గండికొడుతున్నట్టు తెలుస్తోంది. అనుభవమున్న వారికి ఎక్కువ వేతనాలు ఇవ్వడం కంటే, కొత్తగా వస్తున్న ప్రతిభావంతులైన వారికి వెచ్చించాలని కంపెనీ యోచిస్తున్నట్టు సమాచారం.