ఉద్యమంపై ఉక్కుపాదం
రెండిళ్లకు ఒక పోలీస్ చొప్పున పహారా. రైతు పొలానికి వెళ్లాలన్నా.. మహిళలు పచారీ సామగ్రి తెచ్చుకోవాలన్నా.. పోలీసుల అనుమతి తప్పనిసరి. భీమవరం మండలం తుందుర్రు, జొన్నలగరువు, నరసాపురం మండలం కె.బేతపూడి గ్రామాల్లో అప్రకటిత కర్ఫూ్య నెలకొంది. అక్కడి పరిస్థితులు యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నాయి. పోలీస్ పహారా నడుమ ఆ మూడు గ్రామాల మధ్య గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్ నిర్మాణ పనులను చకచకా సాగిస్తున్నారు. 30 గ్రామాలను కాలుష్య కాసారంగా మార్చే ఫుడ్‌పార్క్ నిర్మాణాన్ని అన్నివర్గాల ప్రజలు, రైతులు, మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోంది. ప్రజా ఉద్యమాన్ని అణచివేసేందుకు 600 మంది పోలీసులను వారిపై ప్రయోగించింది.
ఫుడ్ పార్క్‌కు యంత్రసామగ్రి తరలింపు
భీమవరం అర్బన్/నరసాపురం రూరల్ : పర్యావరణానికి తీవ్ర హాని కలిగించే గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణాన్ని ఆపాలంటూ 40 గ్రామాల ప్రజలు ఉద్యమిస్తున్నా ఆ ఫ్యాక్టరీ నిర్మాణం మాత్రం చకచకగా పూర్తి చేసుకుంటోంది. నిర్మాణంలో భాగంగా భారీ భద్రత నడుమ సోమవారం యంత్రాలను ఫ్యాక్టరీకి తరలించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భీమవరం మండలం తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల మధ్య రొయ్యల ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఫ్యాక్టరీ యాజమాన్యం ఫిర్యాదుతో ఆందోళనకారుల అరెస్ట్ చేశారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు, మత్స్యకారులు నరసాపురం రూరల్ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు.
ఈ నేపథ్యంలో సోమవారం ఫ్యాక్టరీకి దాదాపు 100 లారీల్లో యంత్ర, నిర్మాణ సామగ్రి వచ్చింది. ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకుని మంగళవారం ఉదయమే ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. ఒక ఏఎస్పీ, నలుగులు డీఎస్పీలు, 22 మంది సీఐల సహా దాదాపు 600 మంది పోలీస్ బలగాలను మోహరించారు. ఆయా గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. ఇతర ప్రాంతాలను ఆయా గ్రామాల్లోకి ఎవరూ రాకుండా భారీ బందోబస్తు మధ్య ముడిసరుకును తరలిస్తున్న లారీలను ఎస్కార్ట్‌తో ఫ్యాక్టరీ లోపలికి పంపించారు.
సర్వత్రా నిరసనలు
కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో నిర్మించే గోదావరి మెగా ఫుడ్ పార్కు నిర్మించవద్దని రెండేళ్లుగా ఈ ప్రాంత వాసులు వ్యతిరేకిస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకోకుండా ఫుడ్ పార్కు నిర్మాణ యజమానులకు అధికారులు, ప్రజాప్రతినిధులు కొమ్ముకాయడంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తున్నాయి. చిన్న చిన్న కేసులకు పోలీసులు బాధితులను కాళ్లరిగేలా తిప్పించుకుంటారు. సమస్యలను కూడా వినరు. కానీ బడాబాబులకు చెందిన ఫ్యాక్టరీ నిర్మాణానికి యంత్రాలను పంపించేందుకు 600 మంది పోలీసులను మోహరించడంపై స్థానికులు నివ్వెరపోయారు. నిర్మాణ, యంత్ర సామగ్రిని తరలించేందుకు ముందుగానే పోరాట కమిటీ నాయకులను, ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫుడ్పార్కుపై సీపీఎం, సీపీఐ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తదితరులు ఫుడ్ పార్కును నిలుపుదలకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు సమాచారం.