కు. ని.కి పాట్లు
నేలపైనే పడుకోబెట్టిన వైద్యసిబ్బంది
ఏరియా ఆస్పత్రిలో బాధితుల ఆవేదన
సిరిసిల్ల టౌన్ : కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌పై ప్రభుత్వ ప్రచారానికి.. సిబ్బంది నిర్వాకానికి పొంతనలేకుండా పోతుంది. ఆపరేషన్ చేయించుకునే వారికి మౌలిక వసతులు ఏర్పాటుచేయడంలేదు. సిరిసిల్ల ఏరియాస్పత్రిలో శుక్రవారం జరిగిన కుటుంబ నియంత్రణ శిబిరం ఇందుకు నిదర్శనంగా నిలిచింది. డివిజన్ స్థాయిలోని 9మండలాలనుంచి వచ్చిన 62 మందికి కుటుంబనియంత్రణ ఆపరేషన్లు జరిగాయి. వీరికి అనస్థీషియా ఇచ్చి ఆపరేషన్లు నిర్వహించిన వైద్యాధికారులు కనీసం మంచాలు ఏర్పాటుచేయలేదు. ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్ ముందు వరండాలో నేలపై పడుకోబెట్టారు. ఫ్యాన్లులేక, ఆస్పత్రిలో నెలకొన్న దుర్గంధం, దోమల బెడద, నేలపై పడుకోలేక అవస్థలు పడ్డారు. శిబిరం నిర్వాహకుడు శ్రీనివాస్‌ను వివరణ కోరగా..ఆస్పత్రిలో మంచాలు లేక కింద పడుకోబెట్టక తప్పలేదన్నారు. సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ ఆర్.రమేష్, వైద్యులు సుహాసిని, తిరుపతి పాల్గొన్నారు.