Arilova
-
పెద్దాయన భార్యతో వివాహేతర బంధం. ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం.. 9 నెలలకు
సాక్షి, ఆరిలోవ (విశాఖ తూర్పు): వయసుతో సంబంధం లేకుండా ఓ పెద్దాయనతో యువకుడికి యాదృచ్ఛికంగా పరిచయం... ఆ పరిచయం స్నేహంగా మారిన తర్వాత యువకుడు దారి తప్పడం... నైతిక విలువలకు తిలోదకాలిచ్చి పెద్దాయన భార్యతో వివాహేతర బంధం... ఆ బంధానికి అడ్డుగా ఉన్న ఆమె భర్తను హతమార్చడం... అనంతరం ఆ మహిళతో కలిసి పరార్... మొత్తం ఓ సినీ స్టోరీని తలపించే కథలో ఇంకా ఏం కాదులే అని ధీమాగా ఉన్న సమయంలో ఆ నయవంచకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానాస్పద మృతి కేసును ఛేదించి హంతకుడిని రిమాండ్‌కు తరలించారు. ఆరిలోవ సీఐ ఇమాన్యుయేల్‌రాజు తెలిపిన వివరాల ప్రకారం... ఓ ఫర్నిచర్ షాపులో వాచ్‌మెన్‌గా పనిచేసే ముత్యు శ్రీనివాసరావు (43) భార్య, ఇద్దరు కుమారులతో కలిసి ఎండాడలో నివసించేవాడు. పెద్ద కుమారుడికి వివాహం జరిగింది. ఈ క్రమంలో 2019లో శ్రీనివాసరావుకు ఓ కళ్లు పాక వద్ద ఒన్‌టౌన్ ప్రాంతం చాకలిపేటకు చెందిన సూరాడ లక్ష్మణ్ (26)తో పరిచయమయింది. కొన్నాళ్లకు ఆ పరిచయం స్నేహంగా మారింది. దీంతో ఓ రోజు రుషికొండ ప్రాంతంలో వారిద్దరూ కళ్లు తాగిన తర్వాత లక్ష్మణ్‌ను భోజనం కోసం ఎండాడలోని తన ఇంటికి శ్రీనివాసరావు తీసుకెళ్లాడు. చదవండి: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. లగ్జరీ గెస్ట్ హౌస్‌లో యజమానికి తెలియకుండా.. అప్పటి నుంచి తరచూ ఆ ఇంటికి వెళ్లిన లక్ష్మణ్... శ్రీనివాసరావు భార్యతో పరిచయం పెంచుకొన్నాడు. కొన్నాళ్లకు ఆ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం తెలుసుకొన్న శ్రీనివాసరావు లక్ష్మణ్‌తో గొడవపడి తన భార్య చిన్నీని మందలించాడు. అయినప్పటికీ వారిద్దరి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల తర్వాత శ్రీనివాసరావు భార్యను తీసుకెళ్లిపోయిన లక్ష్మణ్ ఆమెతో కలిసి నగరంలోని రైల్వే న్యూ కాలనీ వద్ద ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు. ఓ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలో లక్ష్మణ్ పనిచేస్తూ ఆమెతో గడుపుతున్నాడు. నమ్మించి బీచ్‌కు తీసుకెళ్లి... ఈ క్రమంలో వీరిద్దరూ రైల్వే న్యూకాలనీలో ఉన్నట్లు తెలుసుకొన్న శ్రీనివాసరావు 2021 ఏప్రిల్ 11న వారిని కలిశాడు. మద్యం మత్తులో అక్కడ అల్లరి చేశాడు. దీంతో మంచి మాటలతో శ్రీనివాసరావును లక్ష్మణ్ తన బైక్‌పై ఎక్కించుకుని ఎండాడ తీసుకెళ్లాడు. అక్కడి నుంచి సాగర్‌నగర్ మీదుగా గుడ్లవానిపాలెం అమ్మవారి గుడి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ బైక్ ఆపి బీచ్‌లోకి తీసుకెళ్లి అందుబాటులో ఉన్న ఇటుకతో శ్రీనివాసరావు తలపై లక్ష్మణ్ బలంగా బాదాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. కొన ఊపిరితో పడి ఉన్న శ్రీనివాసరావును స్థానికులు 108లో కేజీహెచ్‌కు తరలించారు. అక్కడకు చేరేసరికే మృతి చెందాడు. దీంతో శరీరంపై గాయాలుండడంతో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి అని ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: ‘రైస్‌మిల్ వద్దకు కాపలాకు వెళ్తున్న.. పొద్దున్నే వస్తా’ అని ఇంట్లో చెప్పి.. 9 నెలల తర్వాత చిక్కిన హంతకుడు కేసు నమోదు చేసిన ఆరిలోవ పోలీసులు కొద్ది రోజులకు మృతుడు శ్రీనివాసరావు అని, ఎండాడ నివాసి అని గుర్తించారు. విచారణలో మృతుని భార్యతో లక్ష్మణ్‌కు ఉన్న వివాహేతర బంధం వెలుగులోకి రావడంతో వారి కోసం వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. శ్రీనివాసరావును హతమార్చిన రోజునే లక్ష్మణ్, చిన్నీ విజయవాడ వెళ్లిపోయారని పోలీసులు గుర్తించారు. ఏదో ఒక రోజు వస్తారని నిఘా పెట్టారు. ఈ క్రమంలో విజయవాడలో చిన్నీతో కలిసి అద్దె ఇంటిలో ఉంటున్న లక్ష్మణ్... సుమారు 9 నెలలు గడిచిపోవడంతో ఎలాంటి కేసూ ఉండదని భావించి ఆమెను తీసుకొని నగరంలోని రైల్వే న్యూకాలనీలోని అద్దె ఇంటిలో సామగ్రి కోసం శుక్రవారం వచ్చాడు. ఈ విషయం తెలుసుకొన్న ఆరిలోవ పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లు హుస్సేన్, ప్రకాష్ వెళ్లి వారిద్దరినీ అదుపులోకి తీసుకొన్నారు. విచారణలో శ్రీనివాసరావును హత్య చేసినట్లు లక్ష్మణ్ అంగీకరించాడు. దీంతో అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చిన పోలీసులు లక్ష్మణ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన కానిస్టేబుళ్లు హుస్సేన్, ప్రకాష్‌లను సీఐ ఇమాన్యుయేల్‌రాజు అభినందించారు. నిందితుడు లక్ష్మణ్‌కు కూడా గతంలో వివాహం జరిగిందని, భార్యకు దూరంగా ఉంటున్నాడని సీఐ తెలిపారు. -
దివ్యాంగ బాలికపై అత్యాచారం
ఆరిలోవ(విశాఖ తూర్పు): ఆరిలోవ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ బాలికపై అత్యాచారం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. సీఐ ఇమాన్యుయేల్ రాజు తెలిపిన వివరాలివీ.. పాత ఆరిలోవకు చెందిన ఓ దివ్యాంగురాలిపై ఓ వ్యక్తి నాలుగు రోజుల కిందట అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. చదవండి: (బెదిరించి లొంగదీసుకుని.. గిరిజన బాలికలపై లైంగిక దాడి..) ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు అనంతరం కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. కాగా.. ఆరిలోవ పోలీసులు బాధితురాలి ఇంటికి చేరుకుని.. చుట్టుపక్కల వారి నుంచి వివరాలు సేకరించినట్లు సమాచారం. దీనిపై బుధవారం కేసు నమోదు చేస్తారని తెలిసింది. చదవండి: ('వివాహేతర సంబంధం అంటగడుతూ వేధిస్తున్నాడు') -
తప్పతాగి యువకుడు రౌడీయిజం.. మహిళ ఏం చేసిందో చూడండి?
సాక్షి, విశాఖపట్నం: పరిస్థితి చేజారి పోతే మనిషిలో కొత్త శక్తి బయటకు వస్తుంది అది ఆడ కావచ్చు మగ కావచ్చు... నిస్సహాయులు కావచ్చు. ఈ క్రమంలోనే తప్పతాగి తిక్క వేషాలు వేసిన ఓ అకతాయికి తిక్క కుదిర్చిందో ఓ మహిళ. విశాఖ నగరంలోని ఆరిలోవ ప్రాంతంలో రౌడీల ఆగడాలు నిత్యం కనిపిస్తుంటాయి. పేదరికం తో పాటు నగర శివారు ప్రాంతం కావడంతో ఆకతాయిలు రౌడీ మూకలు అమాయకులను బెదిరిస్తున్నారు. అలా ఆరిలోవ లో క్రాంతి నగర్ లో ఓ మహిళ దుకాణం వద్దకు రామకృష్ణ అనే యువకుడు వెళ్లాడు. అక్కడకి వెళ్లి ఆమెపై దుర్భాష లాడి రౌడీయిజం చెలాయించాడు. ఆ మహిళపై పై చేయు చేసుకున్నాడు. దీంతో సహనం కోల్పోయిన ఆ మహిళ యువకుడిపై తిరగబడింది.. చేతికి చిక్కిన రౌడిని నాలుగు దెబ్బలు తగిలించింది. ఈ సీన్ మొత్తం అక్కడే ఉన్నవాళ్లు మొబైల్లో రికార్డ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు విశాఖలో వైరల్అవుతోంది. పోలీసులు మాత్రం ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెబుతున్నారు. కాగా ఇటీవల విశాఖ నగర శివారులో ఇలాంటి అల్లరిమూకల బెడద ఎక్కువగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే క్రమంలో రౌడీ బుద్ధి చెప్పిన మహిళ తెగువను ప్రశంసిస్తున్నారు. -
ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని మందలించినందుకు..
సాక్షి, విశాఖపట్నం : మొబైల్లో ఆన్లైన్ గేమ్స్ ఆడవద్దని మందలించారని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. ఆరిలోవలో అక్క ఇంట్లో ఉంటున్న వంశీకృష్ణ అనే 13 సంవత్సరాల యువకుడు మొబైల్లో ఆన్లైన్ గేమ్‌లకు బానిసయ్యాడు. గత రాత్రి అక్క తీవ్రంగా మందలించడంతో మొబైల్ విసిరేసిన వంశీ ఇంటి నుంచి పారిపోయి బయటకు వచ్చేసాడు. ఈ క్రమంలో ఈ రోజు(బుధవారం) ఉదయం ముడ సర్లోవ పార్క్ ఎదురుగా మామిడి చెట్టుకు వంశీకృష్ణ ఉరిపవేసుకుని విగతా జీవిగా కనిపించాడు. (రాష్ట్రంలో పలుచోట్ల ఏసీబీ సోదాలు) మొబైల్ ఆటలకు అలవాటు పడ్డ వంశీకృష్ణ కుటుంబ సభ్యులు వద్దనే మందలించడంతో ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అమ్మ నాన్న చనిపోవడంతో తన వద్ద ఉంటున్న తమ్ముడు వంశీకృష్ణ ఈ రకంగా అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇలాంటి ఆన్లైన్ గేమ్‌లకు బానిసలైన యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఓ ప్రత్యేక సెల్‌ను కూడా ఏర్పాటు చేశారు. -
గంటపాటు లిఫ్టులో నరకం
సాక్షి, ఆరిలోవ(విశాఖపట్నం) : హెల్త్‌సిటీ ఈఎస్ఐ ఆస్పత్రిలో బుధవారం లిఫ్ట్ మొరాయించింది. కింద నుంచి పైఅంతస్తుకు రోగులు, వారి బంధువులు వెళుతుండగా మధ్యలో నిలిచిపోయింది. దీంతో లిఫ్టులో ఉన్నవారు హాహాకారులు చేశారు. సుమారు గంటపాటు నరకం చూశారు. ఈఎస్ఐ ఆస్పత్రిలో రెండు లిఫ్ట్‌లున్నాయి. వాటిలో ఇప్పటికే ఒకటి మొరాయించి మూలకు చేరింది. ఉన్నది కూడా ఇప్పుడు మొరాయించింది. ఉదయం 10 గంటల సమయంలో ఆస్పత్రి గ్రౌండ్ ఫ్లోర్లో ఓపీ నమోదు చేసుకొని మూడో ఫ్లోర్లో ఉన్న వైద్యులను కలవడానికి కొందరు రోగులు, వారికి తోడుగా వచ్చిన బంధువులు లిఫ్ట్‌లో వెళ్లదలచారు. చిన్న లిఫ్ట్ కావడంతో దానిలో నలుగురు మాత్రమే పట్టే సామర్థ్యం ఉంది. కానీ ముగ్గురు రోగులతో పాటు మరో నలుగురు వారి సహాయకులు (మొత్తం ఏడుగురు) లిఫ్ట్‌లో ఎక్కేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో వారు ఎక్కిని వెంటనే లిఫ్ట్ తలుపులు మూసుకొన్నాయి. ఒక్క అడుగు పైకి లేచి లిఫ్టు అక్కడే నిలిచిపోయింది. ఆ తలుపులు తెరుచుకోలేదు. దీంతో లోపల ఉన్నవారంతా పెద్ద కేకలు పెడుతూ రక్షించడంటూ బయట ఉన్నవారిని వేడుకున్నారు. దీంతో ఆస్పత్రిలో ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఆస్పత్రి సిబ్బంది, రోగులు, వారి బంధువలు లిఫ్ట్ వద్దకు పారొచ్చారు. లిఫ్ట్ తలుపులు తెరవడానికి నానా హైరాన పడ్డారు. బోల్టులు విప్పినా తలుపులు తెరుచుకోలేదు. ఇనుప రాడ్లు తీసుకొచ్చి సిబ్బంది తలుపులు బద్దలుగొట్టడానికి ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. లిఫ్ట్ లోపలకు ఆక్సిజన్ మరో పక్క లోపల ఉన్నవారికి గాలి ఆడక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. అసలే చిన్న లిఫ్ట్‌లో ఏడుగురు ఉన్నారు. అప్పటికే సుమారు గంట నుంచి లోపల ఉండిపోయారు. లోపల ఉక్కపోతతో పాటు ఊపిరి ఆడని పరిస్థితి నెలకొంది. వైద్యుల సలహాతో సిబ్బంది ఆక్సిజన్ సిలిండరు తీసుకొచ్చి లిఫ్ట్ లోపలకు పైపు ద్వారా పంపించారు. దీంతో లోపల ఉన్నవారికి ఊరట కలిగింది. అయినా బయటపడతామోలేదోనని కేకలు వేస్తున్నారు. కొంతసేపటికి మొదటి ఫ్లోర్‌లోకి కొందరు వెళ్లిరాడ్లు, రెంచీలు సహాయంతో పైనుంచి లిఫ్ట్ బోల్టులు విప్పి తలుపులు పక్కకు నెట్టారు. అప్పుడు గాని లోపల ఉన్నవారు బయటకు రావడానికి వీలుపడలేదు. ఈతతంగమంతా సుమారు గంటకు పైగా పట్టింది. లిఫ్ట్‌లో ఉన్నవారంతా క్షేమంగా బయటకు రాగలగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నానా హైరానాతో సిబ్బంది ప్రత్యామ్నాయ చర్యలతో వారిని క్షేమంగా బయటకు తీసుకురావడంతో అంతా అభినందించారు. అనంతరం పాడయిన ఆ లిఫ్ట్ ఎవరూ ఎక్కకుండా మూసేశారు. -
డ్రైవింగ్ నేర్చుకొంటూ యువతి దుర్మరణం
ఆరిలోవ(విశాఖ తూర్పు): డ్రైవింగ్ నేర్చుకొంటూ డివైడర్ని ఢీకొని ఓ యువతి మృతి చెందిన సంఘటన ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చినవాల్తేరు ప్రాంతానికి చెందిన పావని(16) నగరంలోని రామాటాకీస్ దరి మహవీర్ బుక్ షాపులో పనిచేస్తుండేది. ఆమెకు ఆరిలోవ ప్రాంతం జైభీమ్ నగర్‌కు చెందిన కిరణ్‌తో పరిచయమైంది. కిరణ్ ఆమెకు బైక్ డ్రైవింగ్ నేర్పడానికి ఆదివారం ఉదయం బీచ్‌రోడ్డులో రుషికొండ తీసుకెళ్లాడు. బీచ్ రోడ్డులో డ్రైవింగ్ నేర్చుకొనే క్రమంలో బేపార్కు వద్ద మలుపులో ఆమె నడుపుతున్న బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆమెకు పొట్టలో బలమైన గాయమైంది. అదే సమయంలో నడకకోసం వెళ్లిన వారు 108కి సమాచారం అందించి కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ యువతి మృతి చెందింది. పావని పెదనాన్న పీలా రమణ ఫిర్యాదు మేరకు ఆరిలోవ ఏఎస్ఐ బ్రహ్మాజీ కేసు నమోదు చేశారు.