లక్ష్మణ్ (ఫైల్)
సాక్షి, ఆరిలోవ (విశాఖ తూర్పు): వయసుతో సంబంధం లేకుండా ఓ పెద్దాయనతో యువకుడికి యాదృచ్ఛికంగా పరిచయం... ఆ పరిచయం స్నేహంగా మారిన తర్వాత యువకుడు దారి తప్పడం... నైతిక విలువలకు తిలోదకాలిచ్చి పెద్దాయన భార్యతో వివాహేతర బంధం... ఆ బంధానికి అడ్డుగా ఉన్న ఆమె భర్తను హతమార్చడం... అనంతరం ఆ మహిళతో కలిసి పరార్... మొత్తం ఓ సినీ స్టోరీని తలపించే కథలో ఇంకా ఏం కాదులే అని ధీమాగా ఉన్న సమయంలో ఆ నయవంచకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానాస్పద మృతి కేసును ఛేదించి హంతకుడిని రిమాండ్‌కు తరలించారు.
ఆరిలోవ సీఐ ఇమాన్యుయేల్‌రాజు తెలిపిన వివరాల ప్రకారం... ఓ ఫర్నిచర్ షాపులో వాచ్‌మెన్‌గా పనిచేసే ముత్యు శ్రీనివాసరావు (43) భార్య, ఇద్దరు కుమారులతో కలిసి ఎండాడలో నివసించేవాడు. పెద్ద కుమారుడికి వివాహం జరిగింది. ఈ క్రమంలో 2019లో శ్రీనివాసరావుకు ఓ కళ్లు పాక వద్ద ఒన్‌టౌన్ ప్రాంతం చాకలిపేటకు చెందిన సూరాడ లక్ష్మణ్ (26)తో పరిచయమయింది. కొన్నాళ్లకు ఆ పరిచయం స్నేహంగా మారింది. దీంతో ఓ రోజు రుషికొండ ప్రాంతంలో వారిద్దరూ కళ్లు తాగిన తర్వాత లక్ష్మణ్‌ను భోజనం కోసం ఎండాడలోని తన ఇంటికి శ్రీనివాసరావు తీసుకెళ్లాడు.
చదవండి: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. లగ్జరీ గెస్ట్ హౌస్‌లో యజమానికి తెలియకుండా..
అప్పటి నుంచి తరచూ ఆ ఇంటికి వెళ్లిన లక్ష్మణ్... శ్రీనివాసరావు భార్యతో పరిచయం పెంచుకొన్నాడు. కొన్నాళ్లకు ఆ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం తెలుసుకొన్న శ్రీనివాసరావు లక్ష్మణ్‌తో గొడవపడి తన భార్య చిన్నీని మందలించాడు. అయినప్పటికీ వారిద్దరి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల తర్వాత శ్రీనివాసరావు భార్యను తీసుకెళ్లిపోయిన లక్ష్మణ్ ఆమెతో కలిసి నగరంలోని రైల్వే న్యూ కాలనీ వద్ద ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు. ఓ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలో లక్ష్మణ్ పనిచేస్తూ ఆమెతో గడుపుతున్నాడు.
నమ్మించి బీచ్‌కు తీసుకెళ్లి...
ఈ క్రమంలో వీరిద్దరూ రైల్వే న్యూకాలనీలో ఉన్నట్లు తెలుసుకొన్న శ్రీనివాసరావు 2021 ఏప్రిల్ 11న వారిని కలిశాడు. మద్యం మత్తులో అక్కడ అల్లరి చేశాడు. దీంతో మంచి మాటలతో శ్రీనివాసరావును లక్ష్మణ్ తన బైక్‌పై ఎక్కించుకుని ఎండాడ తీసుకెళ్లాడు. అక్కడి నుంచి సాగర్‌నగర్ మీదుగా గుడ్లవానిపాలెం అమ్మవారి గుడి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ బైక్ ఆపి బీచ్‌లోకి తీసుకెళ్లి అందుబాటులో ఉన్న ఇటుకతో శ్రీనివాసరావు తలపై లక్ష్మణ్ బలంగా బాదాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. కొన ఊపిరితో పడి ఉన్న శ్రీనివాసరావును స్థానికులు 108లో కేజీహెచ్‌కు తరలించారు. అక్కడకు చేరేసరికే మృతి చెందాడు. దీంతో శరీరంపై గాయాలుండడంతో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి అని ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చదవండి: ‘రైస్‌మిల్ వద్దకు కాపలాకు వెళ్తున్న.. పొద్దున్నే వస్తా’ అని ఇంట్లో చెప్పి..
9 నెలల తర్వాత చిక్కిన హంతకుడు
కేసు నమోదు చేసిన ఆరిలోవ పోలీసులు కొద్ది రోజులకు మృతుడు శ్రీనివాసరావు అని, ఎండాడ నివాసి అని గుర్తించారు. విచారణలో మృతుని భార్యతో లక్ష్మణ్‌కు ఉన్న వివాహేతర బంధం వెలుగులోకి రావడంతో వారి కోసం వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. శ్రీనివాసరావును హతమార్చిన రోజునే లక్ష్మణ్, చిన్నీ విజయవాడ వెళ్లిపోయారని పోలీసులు గుర్తించారు. ఏదో ఒక రోజు వస్తారని నిఘా పెట్టారు. ఈ క్రమంలో విజయవాడలో చిన్నీతో కలిసి అద్దె ఇంటిలో ఉంటున్న లక్ష్మణ్... సుమారు 9 నెలలు గడిచిపోవడంతో ఎలాంటి కేసూ ఉండదని భావించి ఆమెను తీసుకొని నగరంలోని రైల్వే న్యూకాలనీలోని అద్దె ఇంటిలో సామగ్రి కోసం శుక్రవారం వచ్చాడు.
ఈ విషయం తెలుసుకొన్న ఆరిలోవ పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లు హుస్సేన్, ప్రకాష్ వెళ్లి వారిద్దరినీ అదుపులోకి తీసుకొన్నారు. విచారణలో శ్రీనివాసరావును హత్య చేసినట్లు లక్ష్మణ్ అంగీకరించాడు. దీంతో అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చిన పోలీసులు లక్ష్మణ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన కానిస్టేబుళ్లు హుస్సేన్, ప్రకాష్‌లను సీఐ ఇమాన్యుయేల్‌రాజు అభినందించారు. నిందితుడు లక్ష్మణ్‌కు కూడా గతంలో వివాహం జరిగిందని, భార్యకు దూరంగా ఉంటున్నాడని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment