పీఎంపాలెం(భీమిలి): పోలీసులు తమ ఫిర్యాదును తీసుకోకుండా ప్రత్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న అపోహతో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి. జీవీఎంఎసీ 7వ వార్డు వాంబే కాలనీలో నివసిస్తున్న శ్రీహరి అనే వ్యక్తి స్థానికంగా మీసేవ కేంద్రం నిర్వహిస్తున్నాడు. అతను ఓ పత్రికకు విలేకరి కూడా. స్థానికంగా ఓ బాలిక నిశ్చితార్థం ఈ నెల 22న జరుగుతుండగా.. అది వివాహం అనుకుని పోలీసులకు ఎవరో సమాచారం అందించారు. దీంతో పోలీసులు వచ్చి చర్యలు తీసుకున్నారు.
ఇదిలా ఉండగా శ్రీహరి, మరో వ్యక్తే ఈ నిశ్చితార్థం ఆగిపోవడానికి కారణమని భావించిన బాలిక బంధువులు.. శ్రీహరితో గొడవకు దిగారు. దీనిపై శ్రీహరి పోలీసులకు తెలియజేయగా.. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమ పట్ల అమానుషంగా ప్రవర్తించారని బాలిక బంధువులు శ్రీహరి కుటుంబంపై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ప్రత్యర్థుల ఫిర్యాదుకు ప్రాధాన్యం ఇచ్చి తమ ఫిర్యాదును పక్కన పెట్టేశారని ఆరోపిస్తూ శ్రీహరి, అతని భార్య బుధవారం ఆత్మహత్యాయత్నం చేశారు.
దీంతో సకాలంలో గుర్తించి వారిని వెంటనే స్థానిక ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. విషయం తెలుసుకున్న విశాఖ నార్త్ ఏసీపీ సీహెచ్.శ్రీనివాసరావు బాధితులను పరామర్శించారు. పోలీసులు చట్ట నిబంధనల మేరకే కేసులు నమోదు చేస్తారని, దర్యాప్తు చేసి నిందితులపై తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇదే విషయంపై పీఎంపాలెం పోలీస్ స్టేషన్ సీఐ రవికుమార్ వద్ద ప్రస్తావించగా కేసు దర్యాపులో ఉందని, పోలీసులు ఫిర్యాదుదారులు చెప్పినట్టు చేయరని, నిబంధనల ప్రకారం మాత్రమే చేస్తారని పేర్కొన్నారు. రెండు ఫిరాదులు స్వీకరించానని, ఫిర్యాదులో అరోపించినంత మాత్రాన దోషులు కారన్న విషయం తెలసుకోవాలన్నారు.
(చదవండి: అనకాపల్లి స్వాతి కేసులో కొత్త ట్విస్ట్)
Comments
Please login to add a commentAdd a comment