Duvvada Police Two Arrested For Murder Of Mother And Son In Visakhapatnam - Sakshi
Sakshi News home page

పైసా లేదు.. రూ.30 లక్షలు ఉన్నాయని గొప్పలు.. చివరికి బిగ్‌ ట్విస్ట్‌

Published Wed, Sep 14 2022 3:07 PM | Last Updated on Wed, Sep 14 2022 3:56 PM

Police Solved Assassination Mystery Of Mother And Son In Visakhapatnam - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

దొండపర్తి (విశాఖ దక్షిణ): తన వద్ద పైసా లేనప్పటికీ... రూ.30 లక్షలు ఉన్నాయని గౌరమ్మ అందరికీ గొప్పలు చెప్పుకుంది. బంగారాన్ని ఓ ఫైనాన్స్‌ సంస్థ లో పెట్టినట్లు హెచ్చులకు పోయింది. దీంతో ఆ డబ్బులపై కన్నేసిన ఇద్దరు స్నేహితులు ఆమెతోపాటు కుమారుడు పోలారెడ్డిని సైతం హత్య చేశారు. అనంతరం ఆమె ఇళ్లంతా వెతకగా కేవలం రూ.2 వేలు మాత్రమే దొరకడంతో వారు చెన్నైకు పారిపోయారు.
చదవండి: టాలీవుడ్‌ నటిపై అత్యాచారం!

దువ్వాడలో జరిగిన తల్లీకొడుకు  మర్డర్‌ మిస్టరీని పోలీసులు ఛేదించారు. అయిదు రోజులపాటు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి హంతకులను చెన్నైలో పట్టుకున్నారు. వ్యాపారంలో నష్టపోయిన పెదగంట్యాడకు చెందిన సలివెందుల చైతన్య(32), అతని స్నేహితుడు గుంటూరు నివాసి మంద కిశోర్‌బాబు(32)ను అరెస్ట్‌ చేశారు

ఈ కేసు∙వివరాలను మంగళవారం పోలీస్‌ కమిషనరేట్‌లో మీడియా సమావేశంలో కమిషనర్‌ సీహెచ్‌ శ్రీకాంత్‌ వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. మంగి గౌరమ్మ (52) తన కుటుంబంతో కలిసి పెదగంట్యాడ సమీప మదీనాబాగ్‌ ప్రాంతంలోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీ బ్లాక్‌ నంబర్‌– 3లో నివాసముంటోంది. ఆమెకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె మస్కట్‌లో ఉండగా.. మిగిలిన వారందరూ అదే బ్లాక్‌లో వేర్వేరు ఫ్లాట్లలో నివాసముంటున్నారు. గౌరమ్మ, ఆమె ఎదురు ఫ్లాట్‌లో ఉంటున్న ఒక కుమారుడు మంగి పోలారెడ్డి(36) మదీనాబాగ్‌లో ఉన్న గవర్నమెంట్‌ వైన్‌షాప్‌ పక్కన చికెన్‌ కబాబ్, ఫిష్‌ ఫ్రై అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు.

రూ.30 లక్షలు ఉన్నట్లు గొప్పలు 
గౌరమ్మ తన వద్ద డబ్బులు లేకపోయినప్పటికీ రూ.30 లక్షలు ఉన్నాయని, భూమిని కూడా కొనుగోలు చేయడానికి చూస్తున్నానని అందరికీ చెప్పుకుంటూ ఉండేది. అలాగే తన వద్ద భారీగా బంగారం ఉందని, వాటిని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో పెట్టినట్లు ప్రచారం చేసుకునేది. ఇదేవిధంగా ఆ వైన్‌షాప్‌నకు వచ్చిన సలివెందుల చైతన్య, మందకిషోర్‌బాబుకు కూడా చెప్పింది.

క్యాంటీన్‌ నిర్వహణకు డబ్బుల కోసం...  
సలివెందుల చైతన్య ఏడాది క్రితం ఎస్టీబీఎల్‌లో రాయలసీమ రుచులు అనే రెస్టారెంట్‌ పెట్టి రూ.16 లక్షలు నష్టపోయాడు. అనంతరం ఇంట్లో గొడవలు జరగడంతో రెండు నెలల క్రితమే మదీనాబాగ్‌కు మకాం మార్చాడు. గౌరమ్మ దుకాణం పక్కన ఉన్న వైన్‌షాప్‌నకు వచ్చి మద్యం కొనుగోలు చేసేవాడు. ఇదే క్రమంలో గౌరమ్మ, అతడి కుమారుడు పోలారెడ్డితోపాటు మస్కట్‌లో ఉంటున్న గౌరమ్మ కుమార్తె సంతోషితో కూడా పరిచయం ఏర్పడింది. ఇదిలా ఉంటే చైతన్య స్టీల్‌ప్లాంట్‌ క్యాంటీన్‌ కాంట్రాక్ట్‌ను రూ.12 లక్షలకు పాడగా రూ.6 లక్షలు వెంటనే కట్టాల్సి వచ్చింది.

దీంతో అంతకు ముందే గౌరమ్మ తన వద్ద రూ.30 లక్షలు ఉన్నాయని చెప్పడంతో వాటిని చేబదులుగా ఇవ్వాలని ఆమెను కోరాడు. దానికి ఆమె అంగీకరించలేదు. చైతన్య తనకు పరవాడలో కొంత స్థలం ఉందని, దానిని కొనుగోలు చేసి డబ్బు ఇవ్వమని అడిగాడు. దానికి కూడా ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆమె వద్ద ఉన్న డబ్బులు ఎలాగైనా కాజేయాలని స్నేహితుడు కిషోర్‌బాబుతో కలిసి పథకం వేశాడు.

క్లోరోఫామ్‌ పెట్టి చంపాలనుకొని.. 
గౌరమ్మను హత్య చేసి డబ్బు కాజేయాలని చైతన్య, కిషోర్‌బాబు అనేక రకాలుగా ప్లాన్లు వేసుకున్నారు. ముందుగా క్లోరోఫామ్‌ పెట్టి చంపాలని భావించారు. అయితే అది డాక్టర్‌ ప్రి్రస్కిప్షన్‌ లేకుండా దొరకదని తెలుసుకున్నారు. అదే సమయంలో ఈ నెల 7న రాత్రి పోలారెడ్డి తన అక్క సంతోషితో వీడియో కాల్‌ మాట్లాడుతుండగా ఫోన్‌ మధ్యలో కట్‌ అయింది. దీంతో అక్కడే ఉన్న చైతన్య తన మొబైల్‌ నుంచి వీడియో కాల్‌ చేసి అందరూ మాట్లాడారు. అనంతరం మద్యం తాగడానికి వెళ్దామని చెప్పి పోలారెడ్డిని చైతన్య, కిషోర్‌బాబు తీసుకెళ్లారు.

వైన్‌షోప్‌లో మద్యం కొనుగోలు చేసి కొంత తాగాక... పథకం ప్రకారం మిగిలినది ఇంట్లో తాగుదామని చెప్పారు. దీంతో దుకాణం మూసి వేసిన తర్వాత చైతన్య, కిశోర్‌బాబు తమ బైక్‌ల మీద గౌరమ్మ, పోలిరెడ్డిలను ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఇంట్లోకి వెళ్లిన వెంటనే ఇద్దరూ పోలిరెడ్డి చేతులను టవల్‌తో కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కారు.  కూరగాయల కత్తితో అతడితోపాటు గౌరమ్మను కూడా హత్య చేశారు. అనంతరం ఇళ్లంతా వెతకగా కేవలం రూ.2 వేలు మాత్రమే దొరికింది. అలాగే బీరువాలో ఉన్న నగలను కూడా తీసుకొని ఇంట్లో కారం చల్లి తమ బైక్‌లపై వెళ్తూ మధ్యలో ఆగి వస్తువులను తనిఖీ చేయగా అవి రోల్డ్‌గోల్డ్‌గా గ్రహించారు. వాటితోపాటు హత్యకు ఉపయోగించిన కత్తి, వారు తాగిన మందుబాటిల్, గ్లాసులు, కారం డబ్బాను ఒక ప్లాస్టిక్‌ కవర్‌లో పెట్టి తుప్పల్లో పడేసి యలమంచిలి వైపుగా వెళ్లిపోయారు.

కుమార్తె ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయకపోవడంతో..  
మస్కట్‌లో ఉన్న సంతోషి తన తల్లి గౌరమ్మకు ఎన్నిసార్లు కాల్‌ చేసినా లిఫ్ట్‌ చేయకపోవడంతో ఆ విషయాన్ని తన సోదరుడి కుమారుడు కల్యాణ్‌ రెడ్డికి చెప్పింది. దీంతో కల్యాణ్‌ ఇంటికి వెళ్లి చూడగా.. లోపల వస్తువులు చిందరవందరగా పడి ఉండడాన్ని గమనించారు. బెడ్‌రూమ్‌లో గౌరమ్మ, పోలిరెడ్డి రక్తపు మడుగులో ఉండడాన్ని గమనించాడు. దీంతో అతడు 8వ తేదీన దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులను తప్పుదోవ పట్టించిన కోడలు 
ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విచారించారు. గౌరమ్మ కుటుంబ సభ్యులు ఆమె కోడలు దేవిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు విచారించగా తానే హత్య చేసినట్లు చెప్పింది. హత్యకు గల కారణాలపై ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు ఇచ్చింది. మరోసారి తన భర్త హత్య చేశాడని, ఇంకోసారి అదే ప్రాంతంలో ఉన్న మరో నలుగురు హత్యచేశారని చెప్పింది.

దీంతో పోలీసులు వారందరినీ విచారించగా ఈ హత్యలతో వారికి సంబంధం లేనట్లు నిర్ధారణైంది. ఒక్కోసారి ఒక్కో విధంగా ఆమె చెబుతుండడంతో కేసు ముందుకు సాగలేదు. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేనట్లు గ్రహించిన పోలీసులు సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ద్వారా ఆయా ప్రాంతాల్లో తిరిగిన వారిని గుర్తించారు.

చెన్నైలో హంతకుల అరెస్ట్‌ 
తల్లీ కొడుకులను హత్య చేసిన అనంతరం చైతన్య తన భార్యకు ఫోన్‌ చేసి గుంటూరులో పని ఉందని, అర్జెంట్‌గా రెడీ అవ్వాలని చెప్పాడు. గుంటూరులో ఆమెను పుట్టింట్లో వదిలేసిన చైతన్య, స్నేహితుడు కిషోర్‌బాబుతో కలిసి చెన్నైకు పారిపోయాడు. పోలీసులు సీసీ కెమెరాలు, వారి ఫోన్‌ నంబర్లు ఆధారంగా వారు తమిళనాడులో ఉన్నట్లు గుర్తించారు. దీంతో అక్కడకు వెళ్లి వారిని అరెస్ట్‌ చేశారు.

వారి నుంచి రూ.500 నగదు, రెండు బుల్లెట్‌ వాహనాలు, రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో అవాంతరాలు ఎదురైనా చాకచక్యంగా హంతకులను పట్టుకున్న ఏసీపీ(క్రైమ్‌) సీహెచ్‌.పెంటారావు, సౌత్‌ డివిజన్‌ క్రైమ్‌ సీఐ పి.సూర్యనారాయణ, సీసీఎస్‌ సీఐ బి.ఎం.డి.ప్రసాద్, హార్బర్‌ సీఐ ఎం.అవతారం, దువ్వాడ క్రైమ్‌ ఎస్‌ఐ కె.నరసింగరావు, టెక్‌ సెల్‌ ఎస్‌ఐ ఆర్‌.సోమేశ్వరరావు, గాజువాక క్రైమ్‌ ఎస్‌ఐ ఇ.మహేశ్వరరావు, స్టీల్‌ప్లాంట్‌ క్రైమ్‌ ఎస్‌ఐ ఎల్‌.శ్రీనివాసరావు, సీసీఎస్‌ హెచ్‌సీ సీహెచ్‌.మధు, గాజువాక క్రైమ్‌ పీసీ ఎన్‌.ఘాటిల్‌లను సీపీ అభినందించారు. సమావేశంలో డీసీపీ (క్రైమ్‌) నాగన్న, ఏడీసీపీ గంగాధరం, ఏసీపీ(క్రైమ్‌) పెంటారావు, సౌత్‌ డివిజన్‌ క్రైమ్‌ సీఐ పి.సూర్యనారాయణ, సీసీఎస్‌ సీఐ బి.ఎం.డి.ప్రసాద్, హార్బర్‌ సీఐ ఎం.అవతారం పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement