పాట కోసం ధనుష్ కు రూ.4 లక్షల వాచ్
శివరాజ్‌కుమార్ ‘వజ్రకాయ’ సినిమాలో ఓ పాటను పాడిన ధనుష్
సాక్షి, బెంగళూరు : ‘వై దిస్ కొలవెరి డీ’ ఈ పాట ఒకే ఒక్క రోజులో దేశాన్నంతా ఒక ఊపు ఊపేసింది. అంతేనా అప్పటి వరకు సినీపరిశ్రమలో మంచి నటుడిగా, రజనీకాంత్ అల్లుడిగా సుపరిచితుడైన ధనుష్‌ను ఓ యూత్‌ఫుల్ సింగర్‌గా ప్రపంచానికి పరిచయం చేసింది. ఇక అప్పటి నుంచి ధనుష్‌తో కన్నడలో కూడా ఓ పాటను పాడించాలని, ఎంతో మంది సంగీత దర్శకులు, నిర్మాతలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ఇన్ని రోజులకు కన్నడ సినీప్రియులకు ధనుష్ గాత్రాన్ని వినే అవకాశం కలిగింది. అర్జున్‌జన్య సంగీత సారధ్యంలో శివరాజ్‌కుమార్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న వజ్రకాయ సినిమా ద్వారా కన్నడ సంగీత అభిమానులకు ధనుష్ చేరువకానున్నారు. చెన్నైలోని ధనుష్ స్టూడియోలో మంగళవారం ఈ పాటను రికార్డింగ్ చేశారు. ఈ విషయంపై వజ్రకాయ దర్శకుడు హర్ష మాట్లాడుతూ ధనుష్ పాడిన వై దిస్ కొలవెరి డీ పాటను విన్న తర్వాత కన్నడ సినిమాలో కూడా ఆయనతో ఓ పాటను పాడించాలని భావించానన్నారు.
వజ్రకాయ సినిమాలోని ఓ పాట ఆయన గాత్రంలో అయితేనే చక్కగా ఉంటుందని భావించానన్నారు. అందుకే పాట లిరిక్స్, ట్యూన్ తీసుకుని చెన్నైలో ఉన్న ధనుష్‌ని కలిసి వినిపించామన్నారు. దీంతో ఈ పాటను పాడడానికి ఆయన అంగీకరించారని తెలిపారు. ఈ అద్భుతంగా వచ్చిందని వివరించారు.
పాట కోసం రూ.4 లక్షల వాచ్
వజ్రకాయ చిత్రంలో పాట పాడినందుకు ధనుష్‌కి రూ.4 లక్షల విలువైన వాచ్‌ను బహుమతిగా ఇవ్వనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం గాంధీనగర్‌లో హాట్‌టాపిక్. ‘ధనుష్ పాటకు ఇంతని పారితోషికాన్ని చెల్లించడం కష్టతరమైన పని. అందుకే మా యూనిట్ తరఫున ఓ వాచ్‌ను ఆయనకు అందజేయనున్నాం. ఆ వాచ్ ధర ఎంతని మాత్రం నేను చెప్పలేను’ అని నిర్మాత సి.ఆర్.మనోహర్ పేర్కొన్నారు.