Armed robbers
-
ఆ తల్లీ కూతుళ్లకి అందుకే అంత ధైర్యం..!
ధైర్యంగా ఉండమని చెప్పడం అందరూ చేసే పనే. ధైర్యాన్ని ప్రదర్శించడం కొందరు చేసేది. ప్రమాదంలోనూ ధైర్యాన్ని చూపడం అతి కొద్ది మందే చేస్తారు. ఆ అతి కొద్దిమందిలోనూ మేటిగా నిలుస్తున్నారు హైదరాబాద్‌లోని బేగంపేట వాసులైన ఈ తల్లీ కూతుళ్లు. ఇంట్లోకి అకస్మాత్తుగా చొరబడిన ఆగంతకులపైకి చిరుతపులుల్లా విరుచుకుపడ్డారు. మారణాయుధాలతో బెదిరించినా ఆత్మస్థైర్యాన్ని బెదరనివ్వలేదు. ఇద్దరు దండుగులను తరిమి తరిమి కొట్టిన తల్లి అమిత మెహోత్. తల్లిని కాపాడుకునేందుకు దుండగులతో వీరోచితంగా పోరాడిన కూతురు బాబీ. దుండగులు ఎలా ఎప్పుడు ఎక్కడ నుంచి వస్తారో, ఎలా దాడి చేస్తారో మనం ఊహించలేం. అకస్మాత్తుగా ఎదురయ్యే ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో తెలియక ధనాన్నే కాదు ప్రాణాలను సైతం కోల్పోయేవారెందరో. కానీ, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దుండగుల దుశ్చర్యను క్షణమాత్రంలోనే గుర్తించి, ఆ వెంటనే తమ స్థైర్యాన్ని చూపి నేడు ఎంతో మంది ప్రశంసలు అందుకుంటున్నారు అమిత, బాబీ. స్త్రీలు సబలలు అని నిరూపించిన ఈ వనితలు నేడు ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నారు. ‘‘ఎప్పుడో ప్రాక్టీస్ చేసిన బాక్సింగ్‌తో పాటు 15 ఏళ్లుగా చేస్తున్న జిమ్ వ్యాయామాలు, వీటికి తోడు మార్షల్ ఆర్ట్స్‌పై అవగాహన.. ఇవన్నీ దుండగులు తుపాకీ గురి పెట్టినా ఏమాత్రం బెదరక ధైర్యంగా నిలబడేలా చేశాయి. దోచుకోవడానికి వచ్చిన వారిని తరిమి కొట్టేలా చేశాయి’’ అని తెలిపింది నలభై ఆరేళ్ల అమిత. ఊహించని విధంగా ఆ తల్లీకూతుళ్ల నుంచి ప్రతిఘటన ఎదురవడంతో దుండగులు కాళ్లకు బుద్ధి చెప్పాల్సి వచ్చింది. కొరియర్ బాయ్స్ వేషంలో.. ఆన్లైన్ అమ్మకాలు పెరిగాక కొరియర్ బాయ్స్ మన ఇళ్ల ముందుకు వస్తుంటారు. వారి గురించి మనకేవిధంగానూ తెలియదు. అలాగని, కొరియర్ వారంతా ప్రమాదకారులే అని మనం చెప్పలేం. కానీ, ఒక్కోసారి సమస్య ఈ విధంగానూ మనల్ని పలకరించవచ్చు అని గ్రహించాలి అనడానికి గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన మన కళ్లకు కడుతుంది. ‘‘మా ఇంటి గుమ్మానికి, ప్రధాన గేటుకు 200 ఫీట్ల దూరం ఉంటుంది. కొరియర్బాయ్స్ ఎవరొచ్చినా గేటు బయటనే ఉండి పిలుస్తారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బ్యాగ్‌తో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఒకరు హెల్మెట్ ధరించి ఉండగా మరొకరు మాస్క్ ధరించి ఉన్నారు. నేను మొదటి అంతస్తులోనే ఉండి కొరియర్ వివరాలు అడిగాను. అమిత (నా పేరు), ఎన్‌కె జైన్ (నా భర్త) పేర్లు చెప్పి కొరియర్ వచ్చిందని చెప్పారు. అక్కడే ఉండాలని, వచ్చి తీసుకుంటామని చెప్పాను. నేను కిందికి వచ్చేసరికి గేటు లోపలి నుంచి గుమ్మం వద్దకు వచ్చేశారు. ఎదుర్కొని .. కనిపెట్టి.. బ్యాగ్‌లో నుంచి కొరియర్ పార్శిల్ తీస్తున్నట్లుగా తీసి ఒకరు తపంచా (నాటు తుపాకీ)తో నాపై ఎక్కుపెట్టాడు. మరొకరు నన్ను తోసుకుంటూ లోపలికి వచ్చి కిచెన్ లో ఉన్న పనిమనిషి మెడపై కత్తి పెట్టాడు. నా అరుపులకు మొదటి అంతస్తులో ఉన్న కుమార్తె కూడా వచ్చింది. మాపై అటాక్ చేస్తుండగా మేం కూడా తిరిగి అటాక్చేశాం. ఇద్దరం కలిసి ఆ వ్యక్తి చేతులను గట్టిగా పట్టుకుని వెనక్కి తిప్పి, తపంచాను లాగేసుకున్నాం. దీంతో అచేతనుడైన ఆ వ్యక్తి వెంట తెచ్చుకున్న తాళ్లతో మమ్మల్ని కట్టేసేందుకు ప్రయత్నించగా, ఎదురుతిరిగాం. దాదాపు 20 నిమిషాల సేపు ఘర్షణ జరిగింది. చివరకు ఆ వ్యక్తి పారిపోయే ప్రయత్నం చేశాడు. మమ్మల్ని బలవంతంగా తోసుకుంటూ బయటకు వచ్చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు మేము ఎంతగానో వెంబడించాం. ఆ వ్యక్తి పారిపోయాడని తెలుసుకుని కిచెన్ లో ఉన్న మరో వ్యక్తి ఎక్కడ దొరికిపోతాడో అని ఆందోళనపడ్డాం. అతను కూడా పారిపోయేందుకు కత్తితో బెదిరిస్తూ బయటకు వచ్చాడు. మా అరుపులకు ఈ లోగా స్థానికులు రావడంతో అతన్ని పట్టుకోగలిగాం. తెలిసిన వారే అయ్యుంటారని మేం వారు ధరించిన హెల్మెట్, మాస్క్‌ను తీసేయడంతో వారెవరో కనిపెట్టగలిగాం. కిందటేడాది దీపావళి సమయంలో పది రోజులపాటు మా ఇంటి క్లీనింగ్ విషయంలో ఓ ఏజెన్సీని సంప్రదిస్తే, వారు పంపించిన వ్యక్తులే వీళ్లు. మా ఇంటిని క్లీన్ చేసే సమయంలో ఏయే వస్తువులు ఎక్కడ ఉన్నాయో గమనించి, ఇంట్లో ఆడవాళ్లం మాత్రమే ఉండే సమయం చూసి, ఇలా దొంగతనం చేయడానికి ప్లాన్ చేసుకున్నారని తెలిసింది. మేం ఎదురు తిరగడంతో వచ్చిన పని గురించి కాకుండా మేము తమ ముఖాలను చూడకుండా కాపాడుకునేందుకే ఎక్కువ ప్రయత్నం చేశారు. ఆ ధైర్యం ఎలా వచ్చిందంటే.. గతంలో ఐదేళ్లు బాక్సింగ్ ప్రాక్టీస్ చేశాను. రోజూ జిమ్‌కు వెళ్తుంటాను. మార్షల్ ఆర్ట్స్‌పై కూడా అవగాహన ఉంది. అవే నన్ను ధైర్యంగా ఉండేలా, సాహసం చూపేలా చేశాయి. ఎదురొచ్చిన విపత్తు నుంచి కాపాడేలా చేశాయి. ఒక తపంచా, రెండు కత్తులు, తాళ్ల సహాయంతో వారు మమ్ముల్ని లొంగదీసుకునేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. వారి ప్రతి చర్యను తిప్పికొట్టగాలిగామంటే బాక్సింగ్, ఫిట్నెస్లే కారణమని కచ్చితంగా చెప్పగలను’’ అని తామ ఎదుర్కొన్న సంఘటనను వివరించారు అమిత. ఈ తల్లీకూతుళ్లు దుండగులను ధైర్యంగా ఎదుర్కొన్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటన తర్వాత అమిత, ఆమె భర్త, స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. డీసీపీ ప్రశంసలు.. సన్మానం.. అమిత, ఆమె కుమార్తె బాబీ ఇద్దరూ చూపిన ధైర్యసాహసాలు ఆదర్శప్రాయం అని నార్త్‌జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. బేగంపేట పైగా కాలనీలోని అమిత నివాసానికి నేరుగా వచ్చిన డీసీపీ అమితతో పాటు ఆమె కుమార్తెనూ ప్రశంసించి, శాలువాతో సత్కరించారు. మైనర్ బాలిక అయినా ఆమె చూపిన తెగువ ఎంతో అభినందనీయమన్నారు. ఆత్మరక్షణకై మెలకువలు అవసరం మహిళలు ఆత్మరక్షణ దిశగా మెలకువలను నేర్చుకోవాలి. ఇప్పుడు నా జీవితంలో ఎదురైన అనుభవం లాగా ఎవరి జీవితాల్లోనూ రాకూడదని కోరుకుంటాను. ఒకవేళ వస్తే మాత్రం అందుకు సిద్ధంగా ఉండాలి. ధైర్యంగా ముందడుగు వేయాలి. – అమిత – కోట కృష్ణారావు, సాక్షి, హైదరాబాద్ -
బ్యాంకులో పట్టపగలే రూ.18.80 కోట్ల దోపిడీ
ఇంఫాల్: మణిపూర్‌లోని ఓ బ్యాంకులో గురువారం పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. గుర్తు తెలియని సాయుధ దుండగులు సుమారు రూ.18.80 కోట్లను దోచుకెళ్లారు. ఉఖ్రుల్ పట్టణంలోని వ్యూలాండ్‌లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఈ ఘటన చోటుచేసుకుంది. రిజర్వు బ్యాంకు అధికారులు ఉఖ్రుల్ జిల్లాలోని అన్ని ఏటీఎంలకు అవసరమైన నగదును వ్యూలాండ్ బ్రాంచిలో నిల్వ ఉంచుతుంటారు. గురువారం సాయంత్రం 5.40 గంటల సమయంలో అత్యాధునిక ఆయుధాలతో ముసుగులు ధరించిన దుండగులు బ్యాంకు సిబ్బంది ప్రవేశించే గేట్ గుండా లోపలికి ప్రవేశించారు. ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బందిని తుపాకీలతో బెదిరించి వాష్‌రూంలో బంధించారు. క్యాషియర్‌కు తుపాకీ గురిపెట్టి, క్యాష్ వాల్ట్‌ను తెరిపించారు. మొత్తం రూ.18.80 కోట్లను ఎత్తుకెళ్లి పోయారు. -
చిలీలో రూ.262 కోట్ల దోపిడీకి యత్నం
శాంటియాగో: చిలీ రాజధాని శాంటియాగోలో వందల కోట్ల నగదును దోచుకునేందుకు సాయుధ దుండగులు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. అమెరికాలోని మియామి నుంచి శాంటియాగో విమానాశ్రయానికి బుధవారం చేరుకున్న విమానంలో 32 మిలియన్ డాలర్ల (రూ.262 కోట్ల) నగదు ఉంది. బ్యాంకుల్లో పంపిణీ చేయాల్సిన ఆ నగదును ట్రక్కులోకి తరలించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో, 10 మంది సాయుధ దుండగులు ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించారు. పక్కా ప్రణాళికతో అక్కడికి చేరుకున్న దుండగులు నగదును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందితో కొద్దిసేపు ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో భద్రతా సిబ్బంది ఒకరు, ఒక దుండగుడు చనిపోయారు. దుండగులు వెంటనే తమ వాహనంలో అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం ఆ ప్రాంతంలో పూర్తిగా కాలిపోయిన మరో రెండు వాహనాలు కనిపించాయి. భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించి ఈ భారీ దోపిడీని అడ్డుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నగదును తీసుకువచ్చిన లాతమ్ విమానంలోని ప్రయాణికులకు ఎటువంటి అపాయం కలగలేదన్నారు. ఇదే శాంటియాగో ఎయిర్‌పోర్టులో గతంలో రెండుసార్లు దోపిడీ దొంగలు తెగబడి మొత్తం 25 మిలియన్ డాలర్ల నగదును ఎత్తుకెళ్లారు. -
ఒంటిపై కేవలం అండర్వేర్..అలానే వచ్చి దొంగలను పరిగెత్తించాడు
ఒక వ్యక్తి ఇంటికి కొందరూ దొంగలు దోచుకునేందుకు వచ్చారు. ఆ సమయంలో అతను పడుకుని ఉన్నాడు. వారి అలికిడికి లేచి తాను ఎలా ఉన్నది గమనించకుండా అలానే వచ్చి వారితో వీరోచితంగా పోరాడాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...స్టీవ్ మిడిల్టన్ అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తుండగా కొందరు సాయుధ దొంగలు ఇంటిలోకి చొరబడేందుకు యత్నించారు. ఆ క్రమంలోనే ఆ దుండగులు స్టీవ్ ఇంటి ముంగిట ఉన్న కారు వద్ద గుమిగూడి ఉన్నారు. ఐతే వారి అలికిడికి స్టీవ్‌కి మెలుకువ వచ్చింది. ఆ దొంగలను చూసి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారితో పోరాడేందుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో స్టీవ్ నగ్నంగా నిద్రిస్తున్నాడు. వారిని చూసి హడావిడిగా కేవలం అండర్ వేర్ ధరించి అలానే బయటకు పరిగెత్తాడు. అక్కడ ఉన్న ఆ సముహంతో వీరోచితంగా పోరాడాడు. పైగా వారి వద్ద ఆయుధాలు ఉన్న లెక్కచేయకుండా గట్టిగా పోరాడి వారిని పరిగెట్టించాడు. విచారణలో ఆ దొంగలు భవన నిర్మాణ కార్మికుల సముహం అని తేలింది. స్టీవ్ మాత్రం తన గురించి ఆలోచించికుండా దోచుకోవడానికి వచ్చారన్న కోపంతో అలానే బయటకు వచ్చేశానని చెబుతున్నాడు. ఐతే తాను వారిలో ఒక్కరినైనా పట్టుకుని పోలీసులకు అప్పగించేందకు ప్రయత్నించానని, కానీ సాధ్యం కాలేదని చెబుతున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు సదరు వ్యక్తి స్టీవ్‌ని 'అండర్ వేర్ హిరో' అంటూ నెటిజన్లు ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. Not all heroes wear capes, in fact some just wear a pair of undies. Steve Middleton was up early on Boxing Day when he spotted some thugs trying to steal from his car - the tradie decided to take matters into his own hands. #9News pic.twitter.com/ocg3s37W2f — 9News Gold Coast (@9NewsGoldCoast) December 26, 2022 (చదవండి: ఆందోళనతో బాధపడుతున్న కూతురు కోసం ఆ తల్లి ఏం చేసిందో తెలుసా!) -
దోపిడి దొంగల బీభత్సం; భారీ చోరి
పాట్నా : బిహార్‌లోని బేగుసారయి జిల్లాలో మంగళవారం రాత్రి దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. కారు డ్రైవర్‌ను కాల్చి చంపడమే గాక ఇద్దరు నగల వ్యాపారలును గాయపరిచి రూ. 25 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన రాత్రి తొమ్మిది గంటల సమయంలో చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, దాడిలో చనిపోయిన డ్రైవర్‌ను దీపక్‌కుమార్‌గా గుర్తించినట్లు తెలిపారు. బేగుపారయి డీఐజీ రాజేశ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బేగుసారయికి చెందిన ప్రిన్స్ సోనీ, అభయ్ కుమర్ సింగ్, సంతోష్ కుమార్‌లు నగల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లిళ్ల సీజన్‌ను పురస్కరించుకొనిహోల్‌సేల్‌గా బంగారం కొందామని మంగళవారం కోల్‌కతాకు వెళ్లారు. అయితే తిరుగు ప్రయాణంలో కోల్‌కతా నుంచి బరౌని వరకు రైళ్లో వచ్చిన వీరు అక్కడి నుంచి బేగుసారయి వెళ్లడానికి దీపక్ కుమార్‌కు చెందిన ఎస్యూవీ కారులో బయలుదేరారు. ఠాకూరిచౌక్ వద్దకు రాగానే అప్పటికే మాటు వేసిన దోపిడి దొంగలు కారును అడ్డుకొని వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఆభరణాలు ఉన్న బ్యాగులను ఎత్తుకెళ్లారు. దుండగులు జరిపిన కాల్పులల్లో కారు నడుపుతున్న డ్రైవర్ దీపక్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, సంతోష్, సోనీలు తీవ్రంగా గాయపడ్డారు. అయితే దుండగులు దోచుకెళ్లిన ఆభరణాల విలువ సుమారు రూ. 25 కోట్లు వరకు ఉన్నట్లు తెలిసింది. కాగా, దీపక్‌కుమార్ మృతదేహానన్ని పోస్టుమార్టంకు తరలించామని.. గాయపడిన సంతోష్, సోనీలను బేగుసారయిలోని ఆసుపత్రికి తరలించినట్లు డీఐజీ పేర్కొన్నారు. విచక్షణారహితంగా కాల్పులు జరపడమే గాక, ఒకరి మృతికి కారణమైన దుండగులపై ఐపీసీ సెక్షన్ 302, 307, 395 కింద గర్హారా పోలీసులు కేసులు నమోదు చేసినట్లు రాజేశ్ కుమార్ వెల్లడించారు. అయితే దుండగులు వారిని ఉదయం నుంచే వెంబడిస్తూ పక్కా ప్లాన్ ప్రకారమే చేశారా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు డీఐజీ స్పష్టం చేశారు. -
బ్యాంకులో కవాతు చేసి సైనికుల స్టైల్లో దోచారు
సార్డినియా: ఇప్పటి వరకు చాలా దొంగతనాల గురించి విన్నాం. ఒక్కో దొంగది ఒక్కో స్టైల్.. సాధరణంగా దొంగతనాలకు వచ్చే వారంతా లోపలికి రాగానే కత్తులుకటార్లు చూపించి దొంగతనాలకు పాల్పడుతుంటారు. తిరగబడితే హంతకులుగా మారుతారు. అడ్డగోలుగా దొంగతనం చేయడంలో నైపుణ్యం చూపిస్తారే తప్ప క్రమశిక్షణ మాత్రం ఉండదు. అయితే, సర్దినియా దొంగలు మాత్రం క్రమశిక్షణగల సైనికులుగా వ్యవహరించారు. ఓ బ్యాంకును దోచుకునేందుకు వచ్చినవారంతా సైనికుల్లాగా మారిపోయి సైనికుల్లాగా టెక్నిక్స్ ఉపయోగించారు. సార్డినియాలోని ఓ బ్యాంకులోకి చొరబడినవారు వెంటనే బ్యాంకులో వాళ్లందరినీ కదిలితే కాల్చిపారేస్తామని, అంతా నేలపై కదలకుండా పడుకోవాలని ఆదేశించారు. ఆయుధాలతో నింపిన వాహనాన్ని ఏకంగా బ్యాంకు లోపలికి తీసుకొచ్చారు. ఆ వెంటనే అందులో నుంచి కుప్పలుగా సాయుధులు దిగి బ్యాంకులో సైనికుల్లాగా మార్చ్ నిర్వహించారు. ఉగ్రవాదులను తుదముట్టించే సైనికుల శైలిలో ముందుకు కదులుతూ బ్యాంకులో ఉన్నదంతా దోచుకెళ్లారు. ఈ సమయంలో బ్యాంకు ఉద్యోగులంతా లొంగిపోయిన ఉగ్రవాదుల మాదిరిగా నేలపై కిక్కురుమనకుండా పడుకున్నారే తప్ప ఏం చేయలేకపోయారు. ఆ దొంగలను పట్టుకునేందుకు తాజాగా పోలీసు అధికారులు ఈ వీడియోను విడుదల చేశారు. -
బ్యాంకులో రూ.17 లక్షలు దోపిడీ
సివాన్: బిహార్‌లోని సివాన్ జిల్లాలో దీన్‌దయాల్ బజార్ వద్ద ఉన్నపంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. మంగళవారం ఉదయం సాయుధులు సుమారు 17లక్షల రూపాయలు దోచుకుని పారిపోయారు. బ్యాంకులోకి చొరబడిన దొంగలు మొదట నలుగురిపై కాల్పులు జరిపారు. ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు, ఒక కస్టమర్ గాయపడినట్టు ఏఎస్పీ అరవింద్ గుప్తా తెలిపారు. సాయుధుల్లో ఇద్దరు బ్యాంకు బయట కాపలా ఉండగా, మరో నలుగురు దోపిడీకి పాల్పడినట్టు గుప్తా తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్పీ చెప్పారు. ఓ అనుమానితుడిని విచారిస్తున్నట్టు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు పేర్కొన్నారు.