ఆర్మీ యూనిఫాంలో ఏడుగురు ఉగ్రవాదులు?
దేశ రాజధాని ఢిల్లీలోని విమానాశ్రయం, మెట్రో స్టేషన్లన్నింటినీ ఒక్కసారిగా అప్రమత్తం చేశారు. ఏడుగురు ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని, వాళ్లు మన ఆర్మీలోని సుబేదార్, కెప్టెన్ ర్యాంకుల వాళ్లు ధరించే యూనిఫాంలు సంపాదించారని నిఘావిభాగం నుంచి ఎలర్ట్ రావడంతో వీటిలో భద్రతను పెంచారు. చక్రి, గుర్దాస్పూర్ బోర్డర్ పోస్టులకు సమీపంలో ఏడుగురు ఉగ్రవాదులు కనిపించారని, వాళ్లంతా ఆర్మీ యూనిఫాంలు కూడా సంపాదించారని అమృతసర్ నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఎలర్ట్ తెలిపింది. ఢిల్లీ ఎయిర్పోర్టు, మెట్రో స్టేషన్లతో పాటు పంజాబ్లో ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు.
రిపబ్లిక్ డే వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో అదనంగా రెండంచెల భద్రతను ఏర్పాటుచేశామని, విమానాశ్రయంలో ఫ్రిస్కింగ్ పెంచామని సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా వాళ్లు క్యూలైన్లలో ఉండగానే ఒకసారి, మెటల్ డిటెక్టర్ దాటి వచ్చిన తర్వాత మరోసారి వాళ్లను చెక్ చేస్తున్నామన్నారు.
అయితే, తమ బ్యాగులను రెండేసి సార్లు స్క్రీన్ చేస్తూ తమను ఇబ్బంది పెడుతున్నారని ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మహిళా ప్రయాణికులను నగలు తీయమంటున్నారని, మరికొన్నిసార్లు ఎంట్రీ గేటు వద్దే బ్యాగులు తెరిచి చూపించమంటున్నారని, చెకిన్ కౌంటర్ల వద్ద కూడా క్యూలైన్లు బాగా పెరిగిపోయాయని రాధా సింగ్ అనే ప్రయాణికురాలు ఆరోపించారు.
అయితే, ఉగ్రవాద దాడి జరుగుతుందన్న అనుమానాలు వచ్చినప్పుడు, అందునా ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఎలర్ట్ వచ్చినప్పుడు ఈమాత్రం తనిఖీలు తప్పనిసరని అధికారులు చెబుతున్నారు. చివరిగా విమానంలోకి ఎక్కే ముందు కూడా మరోసారి క్షుణ్ణంగా ప్రయాణికులను తనిఖీ చేయాల్సిందిగా విమానయాన సంస్థల సిబ్బందికి చెప్పామన్నారు. ప్రస్తుతం క్యూలైన్లు పెరగడం వల్ల ప్రయాణకులు విమాన సమయం కంటే ముందుగానే రావాల్సిందిగా సూచిస్తున్నట్లు సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ తెలిపారు. ఇలా విమానంలో ఎక్కే ముందు కూడా తనిఖీలు అనేవి ప్రమాదం చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే చేస్తారు. ప్రస్తుతం కేవలం అమెరికా వెళ్లే విమానాల్లో మాత్రమే ఈ తరహా తనిఖీలు చేస్తుండగా, ఇకమీదట అన్ని విమానాల్లో చేయనున్నారు.