ప్రేమను కొలిచే సాధనం!
నయా మాల్
‘‘నీకు నా మీద ఎంత ప్రేమ ఉంది?’’ అని ప్రేయసి అడిగితే-
‘‘చెప్పలేనంత’’ అనే మాటను ఇక ముందు ప్రియుడు ఉపయోగించనక్కర్లేదు. తనకు ఎంత ప్రేమ ఉందో...లెక్క వేసి మరీ చెప్పవచ్చు. దీని కోసం ‘లవ్ మెజరింగ్’ యంత్రం దగ్గర ఉంటే చాలు!
ఆష్లే క్లార్క్ అనే అమెరికన్, స్లోవేకియాకు చెందిన మాటెజ్ వకుళ ఆర్టిస్ట్‌లు. ప్రేమికులు. ఆ తరువాత దంపతులు. ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి ఈ ఇద్దరు కలిసి ‘ప్రేమ కొలత’ యంత్రాన్ని తయారుచేశారు. ఈ లవ్ మెషిన్ మనిషిలో ఉండే ఎలక్ట్రిసిటీ ఆధారంగా పని చేస్తుంది. హార్ట్ట్బీట్ను అంచనా వేయడం ద్వారా ప్రేమ శక్తిని కొలిచి మరీ చెబుతుంది.
వీసా సమస్య ఎదురై ఈ దంపతులిద్దరూ ఒకరికొకరు దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు స్కైప్‌లో గంటల తరబడి సంభాషించుకునేవారు. ఈ క్రమంలోనే వారికి ‘ప్రేమయంత్రం’ అలోచన వచ్చింది. ఈ ఆలోచన వచ్చిందే ఆలస్యం...రకరకాల శాస్త్రీయ, మానసిక విశ్లేషణ పుస్తకాలు చదివి ఎన్నో రోజులు ప్రయోగాలు చేసిన తరువాత ‘లవ్ మెషిన్’ను తయారుచేశారు. తమకు పరిచితమైన జంటలపై ఈ మెషిన్‌ను ఉపయోగించిన తరువాత... సత్ఫలితాలు ఇస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు.
లవ్ మెషిన్ అనేది ఒకటి వచ్చిందని, దాని సహాయంతో ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవచ్చుననే విషయం తెలిసిన తరువాత...మామూలుగానైతే ప్రేమజంటలు మటేజ్-క్లార్క్‌ల ఇంటి ముందు క్యూ కట్టాలి.
చిత్రమేమిటంటే ఒక్క ప్రేమ జంట కూడా వారి దగ్గరికి ఇప్పటి వరకు రాలేదు. ‘‘మీరు తయారుచేసిన యంత్రం మీద వారికి నమ్మకం లేదా?’’ అని అడిగితే ‘‘యంత్రం మీద కాదు... వారి ప్రేమ మీద’’ అని బిగ్గరగా నవ్వుతాడు మటెజ్.
‘‘లవ్ మెషిన్ వచ్చింది అని తెలిసి చాలామంది ప్రేమికులు ఇప్పుడు భయపడుతున్నారు’’ అని మటెజ్ నవ్వుకు తన నవ్వులను జత కలిపారు క్లార్క్.