సునంద కేసు సిట్ కు ఇవ్వండి లేదా..!
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ హత్య కేసు విచారణకు సుప్రీం లేదా హైకోర్టు పర్యవేక్షణలో సిట్‌ను ఏర్పాటు చేయాలంటూ బీజేపీ ఎంపీ సుబ్మణ్యం స్వామి కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు సంపాదించడంలో కూడా ఢిల్లీ పోలీసులు ఇంతవరకు పురోగతి చూపలేదని, కేసును త్వరగా పరిష్కరించడానికి సిట్‌ను నియమించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
సునంద శరీరంలో విషం ఉన్నట్లు తెలిసి చాలా రోజులు కావొస్తున్నా.. ఇంతవరకు ఢిల్లీ పోలీసులు ఒక్క చార్జ్ షీటును కూడా నమోదు చేయలేదని వివరించారు. అమెరికా విచారణ సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) సునంద శరీరంలో ఏ రకమైన విషపదార్ధాలు ఉన్నాయో నిర్ధారించిందని, అయినా ఢిల్లీ పోలీసులు కేసును నత్తనడకన సాగదీస్తున్నారని చెప్పారు.
ఈ కేసును సిట్‌కు అప్పగించడం మంచిదని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికీ సమయం మించిపోలేదనీ.. ఢిల్లీ పోలీసులు చార్జ్ షీట్ ను దాఖలు చేయొచ్చని చెప్పారు. కానీ, కోర్టు ఆధ్వర్యంలో ఈ విషయంపై విచారణ చేయిస్తే బాగుంటుందని లేదా తానే స్వయంగా ఈ విషయంపై కోర్టులో పిల్ దాఖలు చేస్తానని తెలిపారు. స్వామి ఇప్పటివరకు సునంద హత్య విషయంపై ప్రభుత్వానికి రెండు లేఖలు రాశారు.