Assembly candidate
-
పెడమొహం
సాక్షి ప్రతినిధి, కర్నూలు : రాయలసీమ ముఖ ద్వారం కర్నూలు జిల్లాలో తెలుగు తమ్ముళ్లను ఓటమి తరుముతోంది. జిల్లాలోని టీడీపీ అభ్యర్థులు ఎవరికి వారే.. యమునా తీరే అన్న చందంగా ముందుకెళ్తున్నారు. రాష్ట్రం ముక్కలు కావడంలో ప్రధాన పాత్ర పోషించిన బీజేపీ, టీడీపీ ఒక్కటై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని కుట్రలు పన్నుతున్నాయి. జిల్లాలో రెండు పార్లమెంట్, 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీతో పొత్తులో భాగంగా టీడీపీ కోడుమూరును వదులుకుంది. అక్కడ బీజేపీ అభ్యర్థి రేణుకమ్మ బరిలో ఉన్నారు. అయితే టీడీపీ నేతలు ఆమెకు సహకరించకపోవటం.. ఆమె కూడా తమ్ముళ్లను కలుపుకుపోవడానికి ఆసక్తి చూపకపోవడంతో ఓటమి ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేఈ, బీటీల మధ్య విభేదాలు కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బీటీ నాయుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పత్తికొండ అసెంబ్లీ అభ్యర్థి కేఈ కృష్ణమూర్తి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. పత్తికొండలో కేఈ కృష్ణమూర్తి నిర్వహిస్తున్న ప్రచారంలో ఎక్కడా బీటీ నాయుడు ఫొటో లేకపోవడమే ఇందుకు నిదర్శనం. టీడీపీ ప్రచార రథంపై కేవలం ఎన్టీఆర్, చంద్రబాబు, కేఈ కృష్ణమూర్తి ఫొటోలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇదే విషయమై పత్తికొండలోని బీటీ నాయుడు వర్గీయులు కేఈ వర్గీయులను నిలదీశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఒకరినొకరు తోసుకున్నారు. ఈ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడడంలేదని ఆ పార్టీ కార్యకర్తలే చెబుతున్నారు. కర్నూలు పార్లమెంట్ టికెట్ కేఈ ప్రభాకర్ ఆశించి భంగపడ్డారు. అందుకు బీటీ నాయుడు, తిక్కారెడ్డి, టీజీ వెంకటేష్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కారణమనే ప్రచారం జరుగుతోంది. ఫలితంగానే కేఈ సోదరులు వారిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా బీటీ నాయుడు కూడా కిందిస్థాయి కేడర్‌ను దగ్గరకు తీసుకోకపోవటంతో ఆయన తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆదోనిలోనూ తాజా మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, బీటీ నాయుడు మధ్య విభేదాల కారణంగా ఎవరికి వారు విడివిడిగా ప్రచారం చేసుకుంటున్నారు. కర్నూలు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ, ఎంపీ అభ్యర్థులు ఎవరికి వారు వారికి మాత్రమే ఓట్లు వేయమని అడుగుతున్నారు తప్పితే.. రెండు ఓట్లు వేయమని ప్రచారం చేయడం లేదని సమాచారం. ముస్లింలు దూరం దూరం జిల్లాలో అనేక ప్రాంతాల్లో జయాపజయాలను శాసించే ఓటర్లు ముస్లింలే. ఆదోని, కర్నూలు, నంద్యాల, బనగానపల్లె, శ్రీశైలం పరిధిలో ముస్లిం మైనారిటీల ఓట్లే అత్యధికం. అలాంటి ముస్లింలు టీడీపీకి ఓట్లేసేది లేదని తేల్చి చెబుతున్నారు. బీజేపీతో పొత్తుపెట్టుకోవటడం, మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. మతతత్వ పార్టీతో పొత్తుపెట్టుకోవడంతో టీడీపీపై ముస్లింలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ముస్లింల పట్ల టీడీపీ నేతలు అనుసరిస్తున్న తీరు కూడా వీరిని తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. ముస్లింల ఓట్లను చీల్చేందుకు కొన్ని ప్రాంతాల్లో అదే సామాజిక వర్గం నుంచి కొందరు ముస్లింల చేత నామినేషన్ వేయించడాన్ని వారు తప్పుపడుతున్నారు. నంద్యాల, ఆళ్లగడ్డలో చేతులెత్తేసిన తమ్ముళ్లు ఆళ్లగడ్డ, నంద్యాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని తేలిపోయింది. నామినేషన్ వేసిన నాటి నుంచి నేటి వరకు ఈ ప్రాంత ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారు. ముఖ్యంగా నంద్యాల ప్రజలు వైఎస్ వీరాభిమానులు. ఇక్కడ భూమా నాగిరెడ్డి తనదైన శైలిలో వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకెళ్లారు. సొంత నిధులతో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో మన్నన పొందారు. అదేవిధంగా ఆళ్లగడ్డ.. భూమా శోభా నాగిరెడ్డి కోట. ఇక్కడి వారు వారిని కాదని ఎవరినీ ఎన్నుకోవడానికి ఇష్టపడరు. ప్రమాదవశాత్తు శోభా నాగిరెడ్డి మరణించినా.. ఆమెకు ఓటుతో నివాళి అర్పించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. భారీ మెజారిటీతో గెలిపించి నివాళి అర్పిస్తామని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూసి టీడీపీ నేతలు చేతులెత్తేశారు. ఎంత పోరాడినా ఇక ఫలితం ఉండదని తెలుసుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కుమ్మక్కు కుట్రలు: ఆలూరు, పత్తికొండ, శ్రీశైలం, డోన్, బనగానపల్లెలో టీడీపీ, కాంగ్రెస్ నాయకులు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారనే ప్రచారం జరుగుతోంది. పత్తికొండ, డోన్, శ్రీశైలం, బనగానపల్లెలో కాంగ్రెస్ వారు టీడీపీకి, ఆలూరులో కాంగ్రెస్‌కు టీడీపీ నాయకులు మద్దతిస్తున్నారు. ఆదోనిలో ఒక ఓటు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థికి వేస్తే.. మరో ఓటు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థికి వేయమని చెబుతున్నట్లు సమాచారం. అదేవిధంగా నందికొట్కూరులో టీడీపీ ఓటమి ఖాయమని తేలిపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అడ్డుకునేందుకు టీడీపీ, రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్పీఎస్) కుమ్మక్కయ్యాయి. ఆర్పీఎస్ అభ్యర్థి తిమ్మన్న టీడీపీకి మద్దతివ్వడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు లబ్బి వెంకటస్వామి, బెరైడ్డి రాజశేఖరరెడ్డి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకున్న ఈ ఇద్దరు ప్రస్తుత ఎన్నికల్లో అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. లబ్బికి మద్దతు ఇచ్చేందుకు బెరైడ్డి నిర్ణయించుకోవటం గమనార్హం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు టీడీపీ, కాంగ్రెస్, ఆర్పీఎస్ రకరకాల కుట్రలకు తెరతీశాయి. నిబంధనలను పక్కనపెట్టి మద్యం, డబ్బును విచ్చలవిడిగా పంపిణీ చేస్తుండటం గమనార్హం. -
టీఆర్ఎస్ శ్రేణుల దాష్టీకం
బషీరాబాద్, న్యూస్‌లైన్: తాండూరు వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి ప్రభుకుమార్ ప్రచార వాహనంపై శనివారం రాత్రి టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగారు. వాహనం అద్దాలు ధ్వంసం చేయడంతోపాటు డ్రైవర్, ఓ కార్యకర్తను చితకబాదారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి. బషీరాబాద్ మండలంలో ప్రభుకుమార్ ఎన్నికల ప్రచారం ముగించుకుని తన అనుచరులతో కలిసి తిరిగి తాండూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో మంతన్‌గౌడ్ గ్రామం వద్దకు వారి వాహనాలు రాగానే టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి మహేందర్‌రెడ్డి అనుచరులుగా భావిస్తున్న కొందరు అడ్డుకున్నారు. ప్రచారం వాహనం తమ మోటార్‌సైకిల్‌ను ఢీకొందని ఆరోపిస్తూ ప్రచార రథం అద్దాలు పగులగొట్టారు. అదే సమయంలో ప్రచార రథాన్ని అనుసరిస్తూ ఇన్నోవా కారులో వెనుక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ప్రభుకుమార్ అక్కడికి వచ్చారు. ప్రచార రథం వద్ద గొడవ జరుగుతుండటంతో కారు డ్రైవర్ సతీష్ వెళ్లి ఏం జరిగింది..ఎందుకు గొడవ పడుతున్నారని అడుగుతుండగానే టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త జహీర్ వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆయనపై కూడా దాడి చేశారు. అభ్యర్థి ప్రభుకుమార్‌పై దాడికి యత్నించగా అక్కడే ఉన్న పార్టీ నాయకుడు సత్యమూర్తి తదితరులు అడ్డుకున్నారు. అనంతరం దాడికి పాల్పడిన వారు పారిపోయారు. ఈ విషయమై అభ్యర్థి ప్రభుకుమార్, సత్యమూర్తి తదితరులు బషీరాబాద్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి మహేంద ర్‌రెడ్డి అనుచరులుగా భావిస్తున్న కొందరు తమపై దాడికి దిగారని ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్సీపీకి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే మహేందర్‌రెడ్డి ముఖ్య అనుచరులు దళిత వర్గానికి చెందిన తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ప్రభుకుమార్ ఆరోపించారు. తమ ప్రచార రథం ఎవరినీ ఢీకొట్టలేదని, కావాలనే గొడవ పడి తన కారును ధ్వంసం చేసి, అనుచరులపై దాడికి పాల్పడ్డారన్నారు. కాగా దాడిచేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీస్‌స్టేషన్ ఎదుట ప్రభుకుమార్, వైఎస్సార్సీపీ కార్యకర్తలు బైఠాయించారు. దీంతో పోలీసులు స్పందించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు. -
17న వైఎస్ జగన్ నామినేషన్
పులివెందులలో భారీ ర్యాలీ.. పూలంగళ్ల వద్ద సభ భారీగా తరలి రావాలని శ్రేణులకు వైఎస్ఆర్ సీపీ నేతల పిలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 17వ తేదీన వైఎస్ఆర్ సీపీ పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ముందుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి భాకరాపురంలోని స్వగృహం నుంచి కార్యకర్తలు, నాయకులతో కలిసి ర్యాలీగా బయలుదేరుతారు. పూలంగళ్ల వద్ద జనాలనుద్ధేశించి ప్రసంగిస్తారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారిని కలిసి నామినేషన్‌ను దాఖలు చేస్తారు. భారీగా తరలి రండి: వైఎస్ఆర్ సీపీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 17వ తేదీన పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలి రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏడు మండలాల వైఎస్ఆర్ సీపీ నాయకులతో నియోజకవర్గ నాయకులు వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ఆర్ సీపీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ఆర్ సీపీ నాయకులు నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి, జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తదితరులు సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ జగన్ నామినేషన్‌కు సంబంధించి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి.. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి ప్రజలు వచ్చేలా అందరూ కృషి చేయాలన్నారు. వైఎస్ జగన్ సీఎం అభ్యర్థిగా ఉన్న నేపథ్యంలో పులివెందుల నుంచి భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఊపు మీద ఉందని.. పులివెందులలో కూడా శ్రేణులు మరింత ఉత్సాహంగా పనిచేయాలని వారు కోరారు. తాలుకా అధికార ప్రతినిధి చవ్వా సుదర్శన్‌రెడ్డి, మండలాల కన్వీనర్లు వై.వి.మల్లికార్జునరెడ్డి, పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కొమ్మా శివప్రసాద్‌రెడ్డి, చంద్ర ఓబుళరెడ్డి, పి.వి.సుబ్బారెడ్డి, బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పరిశీలకులు బలరామిరెడ్డి, రామమునిరెడ్డి, వేల్పుల రాము, పులివెందుల, వేముల, వేంపల్లె, సింహాద్రిపురం, తొండూరు మండల నాయకులు రాజుల భాస్కర్‌రెడ్డి, నాగేళ్ల సాంబశివారెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, గిడ్డంగివారిపల్లె రవికుమార్‌రెడ్డి, కొమ్మా పరమేశ్వరరెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు గంగిరెడ్డి, సోమశేఖరరెడ్డి, సురేష్‌రెడ్డి, శేషారెడ్డి, శివశంకర్‌రెడ్డి, యూత్ కన్వీనర్లు మనోహర్‌రెడ్డి, వెంకటసుబ్బయ్య, ముస్లిం మైనార్టీ నాయకులు ఇస్మాయిల్ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. -
గుసగుసలు
పలమనేరు టీడీపీ అభ్యర్థిగా మంత్రి గల్లా చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ బోసు వర్గంలో భయం పలమనేరు నియోజకవర్గం నుంచి రాష్ట్ర భూగర్భ వనరుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి టీడీపీ శాసనసభ అభ్యర్థిగా పోటీలో ఉండేందుకు రంగం సిద్ధమైనట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఈ విషయాన్ని ఆమె ధ్రువీకరించలేదు. తానుఇంకా టీడీపీలోకి వెళ్లాలనే నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: మంత్రి గల్లా అరుణకుమారి గత ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్నారు. చంద్రబాబుతో గల్లా మంతనాలు జరిపినట్లు సమాచారం. ఇటీవల జయదేవ్ తమ ఫ్యాక్టరీ వద్ద సహచరులు, అభిమానులతో సమావేశం ఏర్పాటు చేసి ‘‘మా అమ్మకు ఎలాగైనా టీడీపీలో సీటు సంపాదించాలి. మా అమ్మను అభిమానించే కాంగ్రెస్, టీడీపీ వారంతా చంద్రబాబుపై ఒత్తిడి తీసుకు రావాలి’’ అని కోరారు. దీంతో మంత్రి గల్లా అనుయాయుల నుంచి కూడా చంద్రబాబుపై వత్తిడి పెరిగినట్లు సమాచారం. చంద్రగిరిలో కష్టమనే... చంద్రగిరి నుంచి పోటీచేస్తే గెలుపు కష్టమని, వైఎస్ఆర్ సీపీ నుంచి తీవ్రస్థాయిలో పోటీ ఉంటుందనే భావనతోనే చంద్రగిరి కాకుండా పలమనేరును ఎంచుకున్నట్లు సమాచారం. పలమనేరు నియోజకవర్గంలోకి పునర్విభజన సందర్భంగా కుప్పం నియోజకవర్గంలోని వీ.కోట మండలం రావడంతో ఈ మండలం నుంచి వచ్చే ఓట్లు చంద్రబాబు నాయుడి అభిమానులవేనని ఆమె నమ్ముతున్నారు. పైగా ఆమె తండ్రి రాజగోపాల్‌నాయుడు కూడా పార్లమెంటుకు గతంలో ప్రాతినిథ్యం వహించడంతో ఇదీ తనకు ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఆమె పలమనేరు నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరినట్లు సమాచారం. చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారని తెలిసింది. అయితే చంద్రబాబు తుది నిర్ణయం ఎలా ఉంటుందనేది తెలియాలి. త్వరలో గుంటూరులో జరిగే టీడీపీ మీటింగ్‌లో గల్లా అరుణకుమారితో పాటు ఆమె తనయుడు జయదేవ్కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలిసింది. బోస్ వర్గంలో భయం పలమనేరు టీడీపీ టికెట్ కోరుకుంటున్న సుభాష్‌చంద్రబోస్ ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో గల్లాకు టిక్కెట్ ఇస్తారనే విషయం పలమనేరులో హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీలో ఈమెకు టికెట్ ఇస్తారో లేదో గానీ బోస్ వర్గానికి మాత్రం ఈ విషయం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.రేసులో బోస్‌తో పాటు మరో ఆరుగురు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ బోస్ మాత్రమే అన్ని మండలాల్లోనూ ఇప్పటికే ప్రచారం సైతం చేసుకెళ్తున్నారు.