సాక్షి ప్రతినిధి, కర్నూలు : రాయలసీమ ముఖ ద్వారం కర్నూలు జిల్లాలో తెలుగు తమ్ముళ్లను ఓటమి తరుముతోంది. జిల్లాలోని టీడీపీ అభ్యర్థులు ఎవరికి వారే.. యమునా తీరే అన్న చందంగా ముందుకెళ్తున్నారు. రాష్ట్రం ముక్కలు కావడంలో ప్రధాన పాత్ర పోషించిన బీజేపీ, టీడీపీ ఒక్కటై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని కుట్రలు పన్నుతున్నాయి.
జిల్లాలో రెండు పార్లమెంట్, 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీతో పొత్తులో భాగంగా టీడీపీ కోడుమూరును వదులుకుంది. అక్కడ బీజేపీ అభ్యర్థి రేణుకమ్మ బరిలో ఉన్నారు. అయితే టీడీపీ నేతలు ఆమెకు సహకరించకపోవటం.. ఆమె కూడా తమ్ముళ్లను కలుపుకుపోవడానికి ఆసక్తి చూపకపోవడంతో ఓటమి ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కేఈ, బీటీల మధ్య విభేదాలు
కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బీటీ నాయుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పత్తికొండ అసెంబ్లీ అభ్యర్థి కేఈ కృష్ణమూర్తి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. పత్తికొండలో కేఈ కృష్ణమూర్తి నిర్వహిస్తున్న ప్రచారంలో ఎక్కడా బీటీ నాయుడు ఫొటో లేకపోవడమే ఇందుకు నిదర్శనం. టీడీపీ ప్రచార రథంపై కేవలం ఎన్టీఆర్, చంద్రబాబు, కేఈ కృష్ణమూర్తి ఫొటోలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇదే విషయమై పత్తికొండలోని బీటీ నాయుడు వర్గీయులు కేఈ వర్గీయులను నిలదీశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఒకరినొకరు తోసుకున్నారు. ఈ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడడంలేదని ఆ పార్టీ కార్యకర్తలే చెబుతున్నారు. కర్నూలు పార్లమెంట్ టికెట్ కేఈ ప్రభాకర్ ఆశించి భంగపడ్డారు. అందుకు బీటీ నాయుడు, తిక్కారెడ్డి, టీజీ వెంకటేష్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కారణమనే ప్రచారం జరుగుతోంది.
ఫలితంగానే కేఈ సోదరులు వారిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా బీటీ నాయుడు కూడా కిందిస్థాయి కేడర్‌ను దగ్గరకు తీసుకోకపోవటంతో ఆయన తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆదోనిలోనూ తాజా మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, బీటీ నాయుడు మధ్య విభేదాల కారణంగా ఎవరికి వారు విడివిడిగా ప్రచారం చేసుకుంటున్నారు. కర్నూలు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ, ఎంపీ అభ్యర్థులు ఎవరికి వారు వారికి మాత్రమే ఓట్లు వేయమని అడుగుతున్నారు తప్పితే.. రెండు ఓట్లు వేయమని ప్రచారం చేయడం లేదని సమాచారం.
ముస్లింలు దూరం దూరం
జిల్లాలో అనేక ప్రాంతాల్లో జయాపజయాలను శాసించే ఓటర్లు ముస్లింలే. ఆదోని, కర్నూలు, నంద్యాల, బనగానపల్లె, శ్రీశైలం పరిధిలో ముస్లిం మైనారిటీల ఓట్లే అత్యధికం. అలాంటి ముస్లింలు టీడీపీకి ఓట్లేసేది లేదని తేల్చి చెబుతున్నారు. బీజేపీతో పొత్తుపెట్టుకోవటడం, మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. మతతత్వ పార్టీతో పొత్తుపెట్టుకోవడంతో టీడీపీపై ముస్లింలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే ముస్లింల పట్ల టీడీపీ నేతలు అనుసరిస్తున్న తీరు కూడా వీరిని తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. ముస్లింల ఓట్లను చీల్చేందుకు కొన్ని ప్రాంతాల్లో అదే సామాజిక వర్గం నుంచి కొందరు ముస్లింల చేత నామినేషన్ వేయించడాన్ని వారు తప్పుపడుతున్నారు.
నంద్యాల, ఆళ్లగడ్డలో చేతులెత్తేసిన తమ్ముళ్లు
ఆళ్లగడ్డ, నంద్యాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని తేలిపోయింది. నామినేషన్ వేసిన నాటి నుంచి నేటి వరకు ఈ ప్రాంత ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారు. ముఖ్యంగా నంద్యాల ప్రజలు వైఎస్ వీరాభిమానులు. ఇక్కడ భూమా నాగిరెడ్డి తనదైన శైలిలో వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకెళ్లారు. సొంత నిధులతో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో మన్నన పొందారు.
అదేవిధంగా ఆళ్లగడ్డ.. భూమా శోభా నాగిరెడ్డి కోట. ఇక్కడి వారు వారిని కాదని ఎవరినీ ఎన్నుకోవడానికి ఇష్టపడరు. ప్రమాదవశాత్తు శోభా నాగిరెడ్డి మరణించినా.. ఆమెకు ఓటుతో నివాళి అర్పించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. భారీ మెజారిటీతో గెలిపించి నివాళి అర్పిస్తామని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూసి టీడీపీ నేతలు చేతులెత్తేశారు. ఎంత పోరాడినా ఇక ఫలితం ఉండదని తెలుసుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
కుమ్మక్కు కుట్రలు: ఆలూరు, పత్తికొండ, శ్రీశైలం, డోన్, బనగానపల్లెలో టీడీపీ, కాంగ్రెస్ నాయకులు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారనే ప్రచారం జరుగుతోంది. పత్తికొండ, డోన్, శ్రీశైలం, బనగానపల్లెలో కాంగ్రెస్ వారు టీడీపీకి, ఆలూరులో కాంగ్రెస్‌కు టీడీపీ నాయకులు మద్దతిస్తున్నారు.
ఆదోనిలో ఒక ఓటు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థికి వేస్తే.. మరో ఓటు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థికి వేయమని చెబుతున్నట్లు సమాచారం. అదేవిధంగా నందికొట్కూరులో టీడీపీ ఓటమి ఖాయమని తేలిపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అడ్డుకునేందుకు టీడీపీ, రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్‌పీఎస్) కుమ్మక్కయ్యాయి. ఆర్‌పీఎస్ అభ్యర్థి తిమ్మన్న టీడీపీకి మద్దతివ్వడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు లబ్బి వెంకటస్వామి, బెరైడ్డి రాజశేఖరరెడ్డి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకున్న ఈ ఇద్దరు ప్రస్తుత ఎన్నికల్లో అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. లబ్బికి మద్దతు ఇచ్చేందుకు బెరైడ్డి నిర్ణయించుకోవటం గమనార్హం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు టీడీపీ, కాంగ్రెస్, ఆర్‌పీఎస్ రకరకాల కుట్రలకు తెరతీశాయి. నిబంధనలను పక్కనపెట్టి మద్యం, డబ్బును విచ్చలవిడిగా పంపిణీ చేస్తుండటం గమనార్హం.
పెడమొహం
Published Wed, Apr 30 2014 12:31 AM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM
Advertisement