Assembly elections in Bihar
-
‘అందుకే ఎన్నికలు వాయిదా వేయాలంటున్నారు’
పట్నా: ఈ ఏడాది చివర్లో జరగనున్న బిహార్ ఎన్నికలను వాయిదా వేయాలంటూ ఆర్జేడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్డీయే భాగస్వామి లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) నాయకుడు చిరాగ్ పాశ్వాన్ ఆర్జేడీ నిర్ణయానికి మద్దతిచ్చారు. అయితే బీజేపీ సీనియర్ నాయకుడు సంజయ్ పాశ్వాన్, చిరాగ్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అంతేకాక ఎల్జేపీ నాయకుడు, కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ మరికొద్ది రోజులు అధికారంలో ఉండటానికి ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతున్నట్లు ఆరోపించారు. ఈ సందర్భంగా సంజయ్ పాశ్వాన్ మాట్లాడుతూ.. ‘ఎన్నికల నిర్వహణ అంశాన్ని ఎన్నికల కమిషన్ చేసుకుంటుంది. ఎన్నికలు వాయిదా వేయాలని కోరేవారు సొంత పార్టీ వారు అయినా లేక ప్రతిపక్షం వారైనా సరే.. వారికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని భావించాల్సి వస్తుంది’ అన్నారు. అంతేకాక ఎన్నికల కమిషన్‌కు సొంతంగా నిర్ణయం తీసుకునే సామార్థ్యం ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం, ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ప్రస్తుతం బిహార్‌లో ఎన్నికలు జరపడానికి పరిస్థితులు అనుకూలంగా లేవన్నారు. ఎన్నికలు నిర్వహిస్తే.. జనాలకు ప్రమాదమే కాక ఖజానాపై అదనపు భారం పడుతుందని తెలిపారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవాలని కోరారు. అంతేకాక ‘కరోనా కారణంగా, సామాన్యులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. ఈ పరిస్థితులలో, ఎన్నికలు అదనపు భారాన్ని కలిగిస్తాయి. పార్లమెంటరీ బోర్డు సభ్యులందరూ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు’అంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపిన తరువాత ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుందని (ఎన్నికలను సకాలంలో నిర్వహించడానికి) పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్ తెలిపారు. సకాలంలో ఎన్నికలు ‘సుపరిపాలన’ ప్రయోజనాలకు ఉపయోగపడతాయని.. జాతీయ వేదికపై బిహార్‌కు ‘తగిన గౌరవం’ పొందడానికి సహాయపడుతుందని అన్నారు. -
ష్..!
వరంగల్ : బిహార్ అసెంబ్లీతోపాటే వరంగల్ లోక్‌సభకు ఉప ఎన్నికలు జరుగుతాయని భావించిన ఆశావహులకు నిరాశ మిగిలింది. ఉప ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయంలో స్పష్టత లేకపోవడంతో రాజకీయ పార్టీలు జోరును కాస్త తగ్గించాయి. ప్రధాన పార్టీల టిక్కెట్లు ఆశిస్తున్న నేతలు ఎన్నికలు దూరంగా ఉన్నాయనే సమాచారంతో కొంచెం వెనక్కి తగ్గుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చేది లేనప్పుడు ఇప్పుడే హడావుడి ఎందుకనే ధోరణిలో అధిక మంది నేతలు ఉన్నారు. కొందరు మాత్రం ఎన్నికలు ఆలస్యమవడాన్ని వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీలో తమ ప్రాధాన్యతను చెప్పి టిక్కెట్ వచ్చేలా వ్యూహాలు అమలు చేసుకుంటున్నారు. సొంత కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీల ముఖ్యనేతల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా గెలిచిన కడియం శ్రీహరి డిప్యూటీ సీఎం పదవి చేపట్టారు. జూన్‌లో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. జూన్ 11న లోక్‌సభ స్పీకర్ జూన్ 11న కడియం రాజీనామాను ఆమోదించారు. నాటి నుంచి వరంగల్ లోక్‌సభ స్థానం ఖాళీ అయ్యింది. టిక్కెట్‌పై పలువురి ఆశలు తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. అధికార టీఆర్ఎస్కు ఈ ఎన్నిక పెద్ద సవాలుగా మారనుంది. ప్రభుత్వంలో ఉన్న పార్టీగా ఎట్టి పరిస్థితుల్లోనూ వరంగల్ ఎంపీ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు టీఆర్ఎస్ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎంపిక, రాజకీయ వ్యూహం.. వంటి విషయాల్లో టీఆర్ఎస్ అధిష్టానం కొంత స్తబ్దుగా ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన తీరుకు పరీక్షగా మారనున్న ఈ ఎన్నికలో టీఆర్ఎస్ తరుఫున పోటీ చేసేందుకు ఎక్కువ మంది నాయకులు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలోని నేతలకే టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కొత్తగా వచ్చే వారికి కాకుండా గతం నుంచి పని చేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని అంటున్నారు. ఎన్నికలో ఎవరు పోటీ చేయాలనేది పూర్తిగా టీఆర్ఎస్ అధినేత నిర్ణయం ప్రకారమే జరుగుతుందని గులాబీ పార్టీ టిక్కెట్ ఆశిస్తున్నవారు చెబుతున్నారు. టీఆర్ఎస్లో మొదటి నుంచి క్రియాశీలంగా ఉన్న బోడ డిన్న, పసునూరి దయాకర్, గుడిమల్ల రవికుమార్, చింతల యాదగిరి, జోరిక రమేశ్, బూజుగుండ్ల రాజేంద్రకుమార్లతోపాటు ఒయాసిస్సు విద్యా సంస్థల అధినేత జన్ను పరంజ్యోతి గులాబీ పార్టీ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. వరంగల్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ సీరియస్‌గా కసరత్తు చేస్తోంది. నియోజకవర్గాలవారీగా పార్టీ ముఖ్యనేతలను ఇన్‌చార్జీలుగా నియమించి కార్యక్రమాలు చేపడుతోంది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఆలస్యమవుతుండడంతో కాంగ్రెస్ నేతలు ఇటీవల కార్యక్రమాలను తగ్గించారు. ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ వరంగల్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి కోసం వెతుకుతోంది. పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్‌ను బరిలో దింపాలని కాంగ్రెస్‌లోని ఓ వర్గం నేతలు ప్రయత్నిస్తున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోంది. వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కొత్తగా ఎవరైనా తెరమీదకు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ వరంగల్ ఉప ఎన్నికలో గెలవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఉప ఎన్నిక నిర్వహణలో స్పష్టత లేకున్నా కార్యక్రమాల నిర్వహణలో మాత్రం బీజేపీ క్రీయాశీలంగానే వ్యవహరిస్తోంది. పార్టీకి చెందిన కీలకమైన నేతలు తరుచు వరంగల్ జిల్లాకు వచ్చి వెళ్తున్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ బాగానే ఉన్నా అభ్యర్థి విషయంలో బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులే కనిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కుమార్తె శృతిని బరిలో దించాలని స్థానిక బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ నేతలు కొత్త రవి, సోద రామకృష్ణ, చింతా సాంబమూర్తి, రిటైర్డ్ పోలీస్ అధికారి రామచంద్రు, మాజీ ఎమ్మెల్యే జైపాల్ తదితర నేతలు బీజేపీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి అభ్యర్థిగా తటస్థులను బరిలో దించేందుకు వామపక్షాలు, ప్రజా సంఘాల ప్రయత్నిస్తున్నాయి. మొత్తంగా ఉప ఎన్నిక నిర్వహణ ఆలస్యమవుతుండడంతో వ్యూహాల అమలు విషయంలో రాజకీయ పార్టీలు స్తబ్దుగానే వ్యవహరిస్తున్నాయి. -
బీజేపీకి 160.. ఎల్జేపీకి 40!
ఆర్ఎల్ఎస్పీకి 23; మాంఝీ పార్టీకి 20 - బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే పక్షాల సీట్ల సర్దుబాటు - అసంతృప్తి లేదు: మాంఝీ; గెలుపు మా కూటమిదే: అమిత్ షా సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఎన్డీయే మిత్రపక్షాల మధ్య అవగాహన కుదిరింది. మొత్తం 243 స్థానాలకు గాను.. 160 సీట్లలో బీజేపీ, 40 స్థానాల్లో రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ), 23 స్థానాల్లో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ), 20 సీట్లలో జతిన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ ఆవామ్ మోర్చా-సెక్యులర్(హెచ్ఏఎమ్-ఎస్) పోటీ చేయనున్నాయి. పాశ్వాన్, ఆర్ఎల్ఎస్పీ నేత ఉపేంద్ర కుష్వాహా, మాంఝీలతో కలసి సోమవారం మీడియా భేటీలో పాల్గొన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఈ వివరాలను వెల్లడించారు. మిత్రపక్షాల్లో విబేధాలు లేవని, మాంఝీ పార్టీ నేతలు కొందరు బీజేపీ తరఫున పోటీ చేస్తారన్నారు. ఎన్నికల్లో ఎన్డీయే పూర్తి మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ల లౌకిక కూటమి అవసరాల ప్రాతిపదికన ఏర్పడిన కూటమి కాగా, తమది బిహార్ అభివృద్ధి ధ్యేయంగా సైద్ధాంతిక ప్రాతిపదికన ఏర్పడిన కూటమి అని విశ్లేషించారు. ‘నితీశ్‌కుమార్ నేతృత్వంలోని కూటమి.. రూ.12 లక్షల కోట్ల స్కాం చేసిన కాంగ్రెస్‌తో కలిసి బిహార్‌లో అవినీతి రహిత పాలన అందిస్తామని హామీ ఇస్తోంది. జంగిల్రాజ్తో ప్రసిద్ధి చెందిన లాలూతో కలిసి నేరరహిత బిహార్‌కు హామీ ఇస్తోంది’ అని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లోనూ తమ ప్రధాన ప్రచారకర్త ప్రధాని మోదీనేనని అన్నారు. పాశ్వాన్‌తో విబేధాలు లేవు: మాంఝీ హెచ్ఏఎం-ఎస్‌కు బీజేపీ మొదట 13 నుంచి 15 సీట్లు ఇవ్వజూపిందని, ఆ ప్రతిపాదనను తాను తిరస్కరించడం వల్లనే సీట్ల సర్దుబాటులో జాప్యం నెలకొందన్న వార్తలను మాంఝీ కొట్టేశారు. తమ పార్టీకి కేటాయించిన సీట్లతో సంతృప్తి చెందానన్నారు. పాశ్వాన్ కన్నా దళితుల్లో తనకే ఎక్కువ పలుకుబడి ఉన్నందువల్ల తన పార్టీకే ఎక్కువ సీట్లు ఇవ్వాలని పట్టుబట్టారని వచ్చిన వార్తలను కూడా మాంఝీ తోసిపుచ్చారు. పాశ్వాన్‌తో తనకు విభేదాల్లేవన్నారు. ప్రస్తుత అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని ఎల్జేపీకి కేటాయించిన స్థానాల కన్నా తక్కువ సీట్లకు ఎలా ఒప్పుకున్నారన్న ప్రశ్నకు.. ఈ అంశాన్ని అమిత్ షా ముందు లేవనెత్తానన్నారు. లౌకిక కూటమిలో కేటాయింపు చర్చలు.. బిహార్ ఎన్నికల్లో మహా లౌకిక కూటమి వేదికగా పోటీ చేస్తున్న జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు.. ఏయే స్థానాల్లో ఏ పార్టీ పోటీ చేయాలన్న విషయంపై చర్చలు కొనసాగిస్తున్నాయి. మిత్రపక్ష నేతల మధ్య సీఎం నితీశ్ నివాసంలో సోమవారం కూడా చర్చలు జరిగాయి. మొదటి, రెండో దశ ఎన్నికల్లో నియోజకవర్గాల కేటాయింపునకు సంబంధించి తుది ప్రకటన మంగళవారం వెలువడుతుందని ఆర్జేడీ నేత అబ్దుల్ బారీ తెలిపారు. కలసి పోటీ చేయనున్న ఎస్పీ, ఎన్సీపీ ఈ ఎన్నికల్లో కలసి పోటీ చేయనున్నామని ఎస్పీ, ఎన్సీపీలు ప్రకటించాయి. పొత్తుపై కాంగ్రెస్, బీజేపీల వ్యతిరేక పార్టీలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయన్నాయి. కాగా, బిహార్‌లోని మొత్తం 62,779 పోలింగ్ బూత్‌ల్లో కేంద్ర పారా మిలటరీ బలగాలను మోహరిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్ర పోలీసులను, హోంగార్డులను వివిధ అవసరాలకు వినియోగిస్తామని వెల్లడించింది.