ష్..! | Promising left disappointed | Sakshi
Sakshi News home page

ష్..!

Published Tue, Sep 15 2015 4:32 AM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM

ష్..! - Sakshi

ష్..!

 వరంగల్ : బిహార్ అసెంబ్లీతోపాటే వరంగల్ లోక్‌సభకు ఉప ఎన్నికలు జరుగుతాయని భావించిన ఆశావహులకు నిరాశ మిగిలింది. ఉప ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయంలో స్పష్టత లేకపోవడంతో రాజకీయ పార్టీలు జోరును కాస్త తగ్గించాయి. ప్రధాన పార్టీల టిక్కెట్లు ఆశిస్తున్న నేతలు ఎన్నికలు దూరంగా ఉన్నాయనే సమాచారంతో కొంచెం వెనక్కి తగ్గుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చేది లేనప్పుడు ఇప్పుడే హడావుడి ఎందుకనే ధోరణిలో అధిక మంది నేతలు ఉన్నారు. కొందరు మాత్రం ఎన్నికలు ఆలస్యమవడాన్ని వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీలో తమ ప్రాధాన్యతను చెప్పి టిక్కెట్ వచ్చేలా వ్యూహాలు అమలు చేసుకుంటున్నారు. సొంత కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీల ముఖ్యనేతల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. 2019  సాధారణ ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా గెలిచిన కడియం శ్రీహరి డిప్యూటీ సీఎం పదవి చేపట్టారు. జూన్‌లో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. జూన్ 11న  లోక్‌సభ స్పీకర్ జూన్ 11న కడియం రాజీనామాను ఆమోదించారు. నాటి నుంచి వరంగల్ లోక్‌సభ స్థానం ఖాళీ అయ్యింది.

 టిక్కెట్‌పై పలువురి ఆశలు
 తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నిక పెద్ద సవాలుగా మారనుంది. ప్రభుత్వంలో ఉన్న పార్టీగా ఎట్టి పరిస్థితుల్లోనూ వరంగల్ ఎంపీ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు టీఆర్‌ఎస్ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎంపిక, రాజకీయ వ్యూహం.. వంటి విషయాల్లో టీఆర్‌ఎస్ అధిష్టానం కొంత స్తబ్దుగా ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన తీరుకు పరీక్షగా మారనున్న ఈ ఎన్నికలో టీఆర్‌ఎస్ తరుఫున పోటీ చేసేందుకు ఎక్కువ మంది నాయకులు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలోని నేతలకే టీఆర్‌ఎస్ టిక్కెట్ ఇవ్వాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కొత్తగా వచ్చే వారికి కాకుండా గతం నుంచి పని చేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని అంటున్నారు. ఎన్నికలో ఎవరు పోటీ చేయాలనేది పూర్తిగా టీఆర్‌ఎస్ అధినేత నిర్ణయం ప్రకారమే జరుగుతుందని గులాబీ పార్టీ టిక్కెట్ ఆశిస్తున్నవారు చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌లో మొదటి నుంచి క్రియాశీలంగా ఉన్న బోడ డిన్న, పసునూరి దయాకర్, గుడిమల్ల రవికుమార్, చింతల యాదగిరి, జోరిక రమేశ్, బూజుగుండ్ల రాజేంద్రకుమార్‌లతోపాటు ఒయాసిస్సు విద్యా సంస్థల అధినేత జన్ను పరంజ్యోతి గులాబీ పార్టీ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్నారు.

వరంగల్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ సీరియస్‌గా కసరత్తు చేస్తోంది. నియోజకవర్గాలవారీగా పార్టీ ముఖ్యనేతలను ఇన్‌చార్జీలుగా నియమించి కార్యక్రమాలు చేపడుతోంది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఆలస్యమవుతుండడంతో కాంగ్రెస్ నేతలు ఇటీవల కార్యక్రమాలను తగ్గించారు. ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ వరంగల్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి కోసం వెతుకుతోంది. పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్‌ను బరిలో దింపాలని కాంగ్రెస్‌లోని ఓ వర్గం నేతలు ప్రయత్నిస్తున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోంది. వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కొత్తగా ఎవరైనా తెరమీదకు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ వరంగల్ ఉప ఎన్నికలో గెలవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఉప ఎన్నిక నిర్వహణలో స్పష్టత లేకున్నా కార్యక్రమాల నిర్వహణలో మాత్రం బీజేపీ క్రీయాశీలంగానే వ్యవహరిస్తోంది. పార్టీకి చెందిన కీలకమైన నేతలు తరుచు వరంగల్ జిల్లాకు వచ్చి వెళ్తున్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ బాగానే ఉన్నా అభ్యర్థి విషయంలో బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులే కనిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కుమార్తె శృతిని బరిలో దించాలని స్థానిక బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ నేతలు కొత్త రవి, సోద రామకృష్ణ, చింతా సాంబమూర్తి, రిటైర్డ్ పోలీస్ అధికారి రామచంద్రు, మాజీ ఎమ్మెల్యే జైపాల్ తదితర నేతలు బీజేపీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి అభ్యర్థిగా తటస్థులను బరిలో దించేందుకు వామపక్షాలు, ప్రజా సంఘాల ప్రయత్నిస్తున్నాయి. మొత్తంగా ఉప ఎన్నిక నిర్వహణ ఆలస్యమవుతుండడంతో వ్యూహాల అమలు విషయంలో రాజకీయ పార్టీలు స్తబ్దుగానే వ్యవహరిస్తున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement