బీజేపీ, టీడీపీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి | BJP, TDP activists to coordinate the work | Sakshi
Sakshi News home page

బీజేపీ, టీడీపీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి

Published Thu, Oct 29 2015 1:22 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బీజేపీ, టీడీపీ కార్యకర్తలు  సమన్వయంతో పనిచేయాలి - Sakshi

బీజేపీ, టీడీపీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి

రాష్ర్ట ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి
రైతు ఆత్మహత్యల నివారణలో విఫలం
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ
రైతు ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్‌దే బాధ్యత
రెండవ రాజధానిగా వరంగల్‌కు బీజేపీ గుర్తింపు
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

 
హన్మకొండ: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ, టీడీపీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. బుధవారం హన్మకొండ సహకారనగర్‌లోని  విష్ణుప్రియ గార్డెన్‌లో బీజేపీ వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ బూత్ కమిటీ కన్వీనర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దత్తాత్రేయ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని ,ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే తమ ఆకాంక్షలు నెరవేరుతాయని ఆశించిన వారి ఆశలు వమ్ము చేశారని, బంగారు తెలంగాణ అంటూ ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని  ధ్వజమెత్తారు.

ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని, ప్రజా వ్యరేకతను బీజేపీకి అనుకూలంగా మలచుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ఉప ఎన్నిక ఎంతో ప్రతిష్టాత్మకమైందని, నాయకులు, కార్యకర్తలు కష్టించి పనిచేయాలన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక అభివృద్ది, సంక్షేమ, సామాజిక భద్రత పథకాలు ప్రవేశ పెట్టిందని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆరు రోడ్లకు రూ.1100 కోట్లు మంజూరు చేయాలని కోరితే.. మంత్రి నితిన్ గడ్కరి రూ.1300 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు.

 టీఆర్‌ఎస్ పార్టీ పతనావస్థకు చేరుకుంది
 టీఆర్‌ఎస్ పార్టీ పతనావస్థకు చేరుకుందని, రోజు రోజుకు పరిస్థితి దిగజారుతుందన్నదని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భా వం నాడున్న పరిస్థితులు నేడు లేవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం కిషన్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ, ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్నారు. దేశంలో మహిళా మంత్రి లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని ఆయన విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు చేస్తే స్థలాన్ని చూపలేదని, టెక్స్‌టైల్స్ పార్కు మాటే ఎత్తడం లేదన్నారు. బీజేపీ తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. హైదరాబాద్ తర్వాత రెండు పెద్ద నగరం వరంగల్‌ను బీజేపీ రెండో రాజధానిగా గుర్తించి దీని అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం హెరిటేజ్ సిటీగా ఎంపిక చేసి నిధులు మంజూరు చేసిందని కిషన్‌రెడ్డి చెప్పారు. అదే విదంగా అమృత్, స్మార్ట్‌సిటీనగరాలుగా ఎంపిక చేసిందన్నారు.

వరంగల్‌లో ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయాలని ముందుకు వచ్చి కేంద్రం.. మామునూరు విమానాశ్రయంకు ప్రస్తుతమున్న స్థలానికి తోడు గా మరో 480 ఎకరాలు స్థలాన్ని సేకరించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదని విమర్శించా రు. తెలంగాణలో బీజేపీ నుంచి ఒక్క ఎంపీ బండారు దత్తాత్రేయ గెలిస్తే సంసద్ యోజన కింద రెండు గ్రామాలను కూడా వరంగల్ జిల్లా నుంచి ఎంపిక చేసుకోవడం జిల్లా అభివృద్ధి పట్ల బీజేపీకి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. కేంద్రం జిల్లాకు చేసిన అభివృద్ధి పనులను, టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు వివరించి మద్దతు కూడగట్టాలని కిషన్‌రెడ్డి కార్యకర్తలను కోరారు.

కేసీఆర్ ఒక్కరితోనే తెలంగాణ రాలేదు..
మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఒక్కరితో తెలంగాణ రాలేదన్నారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో కలుస్తామని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చెప్పితే కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టిందని, బీజేపీ మద్దతిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. అయితే కాంగ్రెస్‌కు ఇచ్చిన మాటతో పాటు, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు సీఎం కేసీఆర్ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ఈ ఉప ఎన్నిక ద్వారా సీఎం కేసీఆర్ కళ్ళు తెరిపించాలన్నారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, ఉప ఎన్నిక సమన్వయకర్త ఇనుగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ఓటమి లక్ష్యంగా టీడీపీ, బీజేపీ కార్యకర్తలు పనిచేయాలన్నారు. ఎన్డీఏ అభ్యర్థి గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే టీఆర్‌ఎస్‌కు మేలు చేసిన వారవుతారని, జిల్లా ప్రజలు ఈ అంశాన్ని గమనించాలని కోరారు. మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, బీజేపీ నాయకులు యెండల లక్ష్మినారాయణ, పేరాల చంద్రశేఖర్‌రావు, మార్తినేని ధర్మారావు, డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రావు పద్మ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు మాట్లాడారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement