సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు వచ్చింది. పార్టీ రాష్ట్ర కమిటీ అభ్యర్థుల తుది జాబితాకు ముగ్గురి పేర్లను సిద్ధం చేసింది. బీజేపీ-టీడీపీ కూటమి అభ్యర్థిగా బీజేపీ పోటీ చేయాలన్న నిర్ణయానికి రావడానికి ముందే ‘గెలుపు గుర్రం’ కోసం పార్టీ విస్తృతంగా చర్చలు జరిపింది. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇప్పటికే పార్టీ కార్యకర్తలు, ముఖ్యనేతలతో సమావేశాలను ఏర్పాటు చేశారు. పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న 14 మంది అభ్యర్థులతో ఎన్నికల సమన్వయ కమిటీ సమావేశమై చర్చించింది. మరోవైపు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఈ లోక్‌సభ ఉప ఎన్నికకు పార్టీ ఇన్‌చార్జిగా వ్యవహరించనున్నారు.
ఆ ముగ్గురి నేపథ్యాలివీ..
పార్టీ సిద్ధం చేసిన తుది జాబితాలో డాక్టర్ పంగిడి దేవయ్య, డాక్టర్ రాజమౌళి, డాక్టర్ ఎ.చంద్రశేఖర్ పేర్లున్నాయి. జనగాం పట్టణానికి చెందిన పంగిడి దేవయ్య వృత్తి రీత్యా డాక్టర్. అమెరికాలోని ఫ్లోరిడాలో స్థిరపడిన ఈయన పలు సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. రాజమౌళి కూడా వైద్యుడే. 2009లో ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేశారు. ఈయనది జనగాం సమీపంలోని వెల్లంల గ్రామం. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎ.చంద్రశేఖర్ మాజీ మంత్రి. ప్రస్తుతం కాంగ్రెస్‌లోనే ఉన్నా.. బీజేపీ అభ్యర్థిగా పోటీచేయడానికి ఆసక్తి ప్రదర్శిస్తు న్నారు. వీరి పేర్లతో కూడిన జాబితాను జాతీయ కమిటీకి ఆమోదం కోసం పంపినట్టుగా తెలుస్తోంది. ప్రొఫెసర్ గాదె దయాకర్, మాజీ ఎమ్మెల్యే జైపాల్, పార్టీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి తదితరులు కూడా అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ప్రతి బూత్‌కు సమన్వయ కమిటీ
టీడీపీ, బీజేపీ మధ్య సమన్వయానికి ప్రతి బూత్‌కు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.ప్రతీరోజూ బూత్ స్థాయిలో ప్రచారం, ఎన్నికల వ్యూహం వంటి వాటిపై చర్చించడానికి వీలుగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఇలాంటి కమిటీలనే గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 28 నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని బీజేపీ నిర్ణయించింది.
తుది జాబితాలో ముగ్గురు
Published Mon, Oct 26 2015 4:53 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement