బీజేపీకి 160.. ఎల్జేపీకి 40!
ఆర్‌ఎల్‌ఎస్‌పీకి 23; మాంఝీ పార్టీకి 20
- బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే పక్షాల సీట్ల సర్దుబాటు
- అసంతృప్తి లేదు: మాంఝీ; గెలుపు మా కూటమిదే: అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఎన్డీయే మిత్రపక్షాల మధ్య అవగాహన కుదిరింది. మొత్తం 243 స్థానాలకు గాను.. 160 సీట్లలో బీజేపీ, 40 స్థానాల్లో రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ), 23 స్థానాల్లో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్‌ఎల్‌ఎస్‌పీ), 20 సీట్లలో జతిన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ ఆవామ్ మోర్చా-సెక్యులర్(హెచ్‌ఏఎమ్-ఎస్) పోటీ చేయనున్నాయి.
పాశ్వాన్, ఆర్‌ఎల్‌ఎస్‌పీ నేత ఉపేంద్ర కుష్వాహా, మాంఝీలతో కలసి సోమవారం మీడియా భేటీలో పాల్గొన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఈ వివరాలను వెల్లడించారు. మిత్రపక్షాల్లో విబేధాలు లేవని, మాంఝీ పార్టీ నేతలు కొందరు బీజేపీ తరఫున పోటీ చేస్తారన్నారు. ఎన్నికల్లో ఎన్డీయే పూర్తి మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ల లౌకిక కూటమి అవసరాల ప్రాతిపదికన ఏర్పడిన కూటమి కాగా, తమది బిహార్ అభివృద్ధి ధ్యేయంగా సైద్ధాంతిక ప్రాతిపదికన ఏర్పడిన కూటమి అని విశ్లేషించారు. ‘నితీశ్‌కుమార్ నేతృత్వంలోని కూటమి.. రూ.12 లక్షల కోట్ల స్కాం చేసిన కాంగ్రెస్‌తో కలిసి బిహార్‌లో అవినీతి రహిత పాలన అందిస్తామని హామీ ఇస్తోంది. జంగిల్‌రాజ్‌తో ప్రసిద్ధి చెందిన లాలూతో కలిసి నేరరహిత బిహార్‌కు హామీ ఇస్తోంది’ అని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లోనూ తమ ప్రధాన ప్రచారకర్త ప్రధాని మోదీనేనని అన్నారు.
పాశ్వాన్‌తో విబేధాలు లేవు: మాంఝీ
హెచ్‌ఏఎం-ఎస్‌కు బీజేపీ మొదట 13 నుంచి 15 సీట్లు ఇవ్వజూపిందని, ఆ ప్రతిపాదనను తాను తిరస్కరించడం వల్లనే సీట్ల సర్దుబాటులో జాప్యం నెలకొందన్న వార్తలను మాంఝీ కొట్టేశారు. తమ పార్టీకి కేటాయించిన సీట్లతో సంతృప్తి చెందానన్నారు. పాశ్వాన్ కన్నా దళితుల్లో తనకే ఎక్కువ పలుకుబడి ఉన్నందువల్ల తన పార్టీకే ఎక్కువ సీట్లు ఇవ్వాలని పట్టుబట్టారని వచ్చిన వార్తలను కూడా మాంఝీ తోసిపుచ్చారు. పాశ్వాన్‌తో తనకు విభేదాల్లేవన్నారు. ప్రస్తుత అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని ఎల్జేపీకి కేటాయించిన స్థానాల కన్నా తక్కువ సీట్లకు ఎలా ఒప్పుకున్నారన్న ప్రశ్నకు.. ఈ అంశాన్ని అమిత్ షా ముందు లేవనెత్తానన్నారు.
లౌకిక కూటమిలో కేటాయింపు చర్చలు..
బిహార్ ఎన్నికల్లో మహా లౌకిక కూటమి వేదికగా పోటీ చేస్తున్న జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు.. ఏయే స్థానాల్లో ఏ పార్టీ పోటీ చేయాలన్న విషయంపై చర్చలు కొనసాగిస్తున్నాయి. మిత్రపక్ష నేతల మధ్య సీఎం నితీశ్ నివాసంలో సోమవారం కూడా చర్చలు జరిగాయి. మొదటి, రెండో దశ ఎన్నికల్లో నియోజకవర్గాల కేటాయింపునకు సంబంధించి తుది ప్రకటన మంగళవారం వెలువడుతుందని ఆర్జేడీ నేత అబ్దుల్ బారీ తెలిపారు.
కలసి పోటీ చేయనున్న ఎస్పీ, ఎన్సీపీ
ఈ ఎన్నికల్లో కలసి పోటీ చేయనున్నామని ఎస్పీ, ఎన్సీపీలు ప్రకటించాయి. పొత్తుపై కాంగ్రెస్, బీజేపీల వ్యతిరేక పార్టీలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయన్నాయి. కాగా, బిహార్‌లోని మొత్తం 62,779 పోలింగ్ బూత్‌ల్లో కేంద్ర పారా మిలటరీ బలగాలను మోహరిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్ర పోలీసులను, హోంగార్డులను వివిధ అవసరాలకు వినియోగిస్తామని వెల్లడించింది.