నియోజకవర్గాల పెంపు లేనట్టే!
ఇప్పట్లో సాధ్యంకాదని తేల్చిన కేంద్రం
రాజ్యాంగ సవరణ చేయాల్సి రావడమే కారణం
ఇతర రాష్ట్రాల నుంచీ డిమాండ్లు వచ్చే అవకాశం
రాజ్యసభలో ముందుకు వెళ్లలేని స్థితిలో మోదీ సర్కారు
విభజన చట్టంలో గడువు చెప్పలేదన్న కేంద్ర హోంశాఖ
హైదరాబాద్: వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి అసెంబ్లీ నియోజక వర్గాల సంఖ్య పెరుగుతుం దని ఎదురుచూస్తున్న రాజకీయ నేతలకు ఇది చేదు వార్తే! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఇప్పట్లో ఉండబోదని కేంద్ర న్యాయ, హోం మంత్రిత్వ శాఖలు స్పష్టం చేశాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ప్రస్తుతమున్న 119 అసెంబ్లీ స్థానాలను 153కు, ఏపీలో 175 నుంచి 225 స్థానాలకు పెంచుకోవచ్చని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో నిర్దేశించిన సంగతి తెలిసిందే. తదుపరి చర్యల కోసం సిద్ధమైన కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై కేం ద్రం వివరణ కోరగా ఇరు శాఖలూ ఈ మేరకు సమాచారం పంపాయి. రాష్ట్ర విభజన చట్టంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశాన్ని పేర్కొన్నప్పటికీ రాజ్యాంగ సవరణ చేయకుండా ఈ ప్రక్రియకు ఆమోదం తెలపలేమని వివరించాయి. రాజ్యాంగంలోని 82, 170 అధికరణలను సవరిస్తే తప్ప నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదని కేంద్ర న్యాయ శాఖ చెప్పింది. 2031లో జనాభా గణన పూర్తయ్యే వరకు 25 ఏళ్ల పాటు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టరాదని గతంలో రాజ్యాంగ సవరణ(84, 87వ రాజ్యాంగ సవరణలు) జరిగింది. అందువల్ల ఇప్పుడు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు సాధ్యంకాదని తేల్చింది.
తొందర లేదన్న కేంద్రం
నియోజకవర్గాల పెంపు కోసం అందుతున్న విజ్ఞాపనలపై కేంద్ర హోంశాఖ స్పందిస్తూ మరో విషయాన్ని ప్రస్తావించింది. కచ్చితంగా ఫలానా గడువులోగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ఏపీ విభజన చట్టంలో ఎక్కడా పేర్కొనలేదని, అందువల్ల ఇప్పటికిప్పుడు ఆ ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల కమిషన్కు తెలియజేసింది. రాజ్యాంగ సవరణ చేయాలంటే మోదీ ప్రభుత్వం ఇప్పటికే పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. రాజ్యసభలో పరి స్థితి దృష్ట్యా మరోసారి రాజ్యాంగ సవరణకు కేంద్రం ముందుకు వెళ్లబోదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ, ఏపీల్లో నియోజకవర్గాల పెంపు అంశం పార్లమెంట్ ముందుకు వస్తే.. ఇదే తరహాలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా డిమాండ్లు రావొచ్చని కేం ద్రం భావిస్తోంది. 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళ సైతం నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించాలని డిమాండ్ చేస్తోంది. దీంతో కేంద్రం రాజ్యాంగ సవరణకు మొగ్గుచూపే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.
పోలవరం ముంపు మండలాలు, జిల్లాల పెంపు సంగతేంటి?
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని 7 ముంపు మండలాలను ఏపీ లో విలీనం చేశారు. ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియ చేసిన కారణంగా ఇప్పుడు ఆ గ్రామాలకు ప్రాతి నిధ్యం వహించే ప్రజాప్రతినిధులు లేకుండా పోయారు. అక్కడి నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులకు రెండు రాష్ట్రాల్లో ప్రాతినిథ్యం కల్పించాలని కోరినప్పటికీ అనుమతివ్వలేదు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తప్ప ఆ గ్రామాలకు ప్రజాప్రతినిధులు ఉండే అవకాశాలు లేవు. పాలనా సౌలభ్యం కోసం జిల్లాల సంఖ్యను పెంచుకోవాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు యోచిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాతే కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఆ ప్రతిపాదనలను పక్కనబెట్టాయి. నియోజకవర్గాల పెం పు ఇప్పట్లో ఉండదని తేలడంతో కొత్త జిల్లాల విషయంలో ఇరు రాష్ర్ట ప్రభుత్వాలు ఏం చేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.