వైఎస్ఆర్ చిత్రపటాన్ని యథాస్థానంలో ఉంచండి: కేవీపీ
హైదరాబాద్ : రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రారావు..ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు లేఖ రాశారు. 'ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో వైఎస్ఆర్ చిత్రపటాన్ని తొలగించడం దిగ్ర్భాంతి కలిగించిందని, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా వైఎస్ఆర్ ఎనలేని సేవలందించారని, స్పీకర్ అనుమతి లేకుండా సభా ప్రాంగణంలో చిత్రపటాన్ని ఎవరూ తాకలేరని, దయచేసి తొలగించిన వైఎస్ఆర్ చిత్రపటాన్ని యథాస్థానంలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని' కేవీపీ తన లేఖలో కోరారు.
కాగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ లాంజ్‌లో.. కొన్ని సంవత్సరాలుగా చిరునవ్వు చిందిస్తూ అక్కడికి వచ్చిన వారిని పలకరిస్తున్నట్లుగా ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిలువెత్తు ఫొటోను తొలగించిన విషయం తెలిసిందే. ఇటీవల శాసనసభ ఇన్‌ఛార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ దగ్గరుండి మరీ సిబ్బందితో అక్కడి నుంచి ఆ చిత్రపటాన్ని తీయించి వేశారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆదేశాల మేరకు వైఎస్ ఫొటోను తొలగిస్తున్నామని ఈ సందర్భంగా సిబ్బందికి సత్యనారాయణ చెప్పినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వైఎస్ నిలువెత్తు ఫొటో ఉన్న లాంజ్ ప్రాంతాన్ని ఏపీకి కేటాయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్కడ పలుమార్లు తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాలు జరిగే సమయంలో హాజరైన ఎమ్మెల్యేలకు వైఎస్ చిత్రపటం కనిపించకుండా ముసుగు వేసేవారు. ఇప్పుడు ఏకంగా అక్కడి నుంచి చిత్రపటాన్ని తొలగించారు.