‘అసిస్టెంట్ ప్రొఫెసర్’ల భర్తీకి స్క్రీనింగ్ టెస్టు
ఏపీపీఎస్సీకి బాధ్యతలు.. ఉన్నతస్థాయి కమిటీ భేటీలో అభిప్రాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 14 యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ టెస్టు నిర్వహించాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ అభిప్రాయానికి వచ్చింది. సోమవారం కమిటీ హైదరాబాద్లో సమావేశమైంది. వర్సిటీలో 1,385 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపి విధివిధానాలకు కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తొలివిడతలో 1,104 పోస్టులు, రెండో విడతలో 281 పోస్టులు భర్తీచేయడానికి అవకాశమిచ్చింది.
ఇందులో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఆయా యూనివర్సిటీలే యూజీసీ నిబంధనల ప్రకారం భర్తీ చేసుకుంటాయి. అసోసియేట్ పోస్టుల భర్తీకి మాత్రం రాష్ట్రస్థాయిలో స్క్రీనింగ్ టెస్టు నిర్వహించి అర్హులైన వారిని ఎంపిక చేయాలని ప్రభుత్వం కమిటీకి నిర్దేశించింది. నెట్, స్లెట్తో పాటు పీజీలో నిర్ణీత శాతంలో మార్కులు సాధించిన వారికి స్క్రీనింగ్ టెస్టుకు అర్హులుగా నిర్ణయిస్తారు.