ఉద్యమం ఆగదు
బాపట్లటౌన్ : నిత్యం ప్రశాంతంగా ఉండే వ్యవసాయ కళాశాల ప్రస్తుతం ఆందోళనలతో అట్టుడికిపోతోంది. అసోసియేట్ డీన్ ప్రసాద్ అక్రమ నియామకం చెల్లదంటూ తొమ్మిది రోజులుగా వ్యవసాయ కళాశాల విద్యార్థులు తరగతులు బాయ్‌కాట్ చేశారు. డీన్‌గా విష్ణుశంకరరావునే నియమించాలంటూ ఆయనకు మద్దతుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీనిపై ఇటీవల పరిశీలనకు వచ్చిన యూనివర్సిటీ కమిటీ బృందం నుంచి కూడా విద్యార్థులకు సరైన సమాధానం రాలేదు.
దీంతో యూనివర్శిటీ అధికారుల తీరుపై విద్యార్థిలోకం తీవ్రస్థాయిలో మండిపడింది. విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ పద్మరాజు, రిజిస్ట్రార్ సత్యనారాయణ, కార్యాలయ అడ్మినిస్ట్రేట్ ఆఫీసర్ల దిష్టిబొమ్మలకు శనివారం కళాశాల ప్రాంగణంలో శవయాత్ర నిర్వహించారు. స్థానిక కళాశాల ఎదుట దహన సంస్కారాలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.
డీన్‌ను తిరిగి నియమించేంత వరకు ఉద్యమం ఆగదు .. డీన్‌గా విష్ణుశంకరరావునే నియమించేంత వరకు ఉద్యమం ఆగదని విద్యార్థులు తేల్చిచెప్పారు. శవయాత్రలో భాగంగా విద్యార్థులు మాట్లాడుతూ ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిబంధనల ప్రకారం వ్యవసాయ కళాశాలలో అసోసియేట్ డీన్‌గా బాధ్యతలు చేపట్టాలంటే కనీసం మారుమూల ప్రాంతాల్లో రెండేళ్లు, కళాశాలలో ప్రొఫెసర్‌గా ఐదేళ్లు పనిచేసి ఉండాలి. డీన్ అయ్యేనాటికి 15 ఏళ్ల సర్వీస్ ఉండాలి.
అసోసియేట్ డీన్‌గా పనిచేసిన డాక్టర్ దర్శి విష్ణుశంకరరావు నిబంధనల ప్రకారమే ఆశ్వారావుపేట, అనకాపల్లి, గుంటూరు లాంఫామ్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో 11 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేశారు. వ్యవసాయ ఎకనామిక్స్ విభాగానికి విశ్వవిద్యాలయం హెడ్‌గా, కళాశాల వార్డెన్‌గా, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్, విద్యార్థి కార్యకలాపాల అధికారిగా వివిధ విద్యార్థుల కార్యక్రమాల్లో విధులు నిర్వహించిన అనుభవం ఉంది.
ప్రస్తుతం అసోసియేట్ డీన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసిన పీఆర్‌కె ప్రసాద్ కేవలం బాపట్ల వ్యవసాయ కళాశాలలో అది కూడా మూడేళ్లు మాత్రమే ప్రొఫెసర్‌గా పనిచేశారని, మిగిలిన సర్వీస్ అంతా కూడా రిసెర్చ్ విభాగంలో ఉన్నారన్నారు. గతంలో రెండేళ్ల పాటు వసతిగృహం వార్డెన్‌గా నిర్వహించినప్పటికీ తమ సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని విద్యార్థులు ముక్తకంఠంతో చెబుతున్నారు.
కళాశాల ప్రగతికి సహకరించాలి..
అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్న వ్యవసాయశాఖా మంత్రి, విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు వాళ్ల నిర్ణయాన్ని ఉపసంహరించుకొని కళాశాల ప్రగతికి సహకరించాలి. అనుభవం లేని వ్యక్తిని డీన్‌గా నియమించడం కేవలం రాజకీయ కారణమే. ఇలాంటి నిర్ణయాలు వెంటనే ఉపసంహరించుకోవాలి.
- విద్యార్థులు వెంకటే ష్, సన్యాసినాయుడు
నియామకం నిలిపివేయాలి...
కళాశాల అభ్యున్నతికి ఆహర్నిశలు కృషిచేసే అసోసియేట్ డీన్‌ను కాదని, కళాశాలపై ఎలాంటి అవగాహన లేని వ్యక్తిని డీన్‌గా నియమిస్తే విలువైన మా జీవితాలు అంధకారమవుతాయి. ఈ విషయాన్ని విద్యార్ధిలోకమంతా ముక్తకంఠంతో చెబుతున్నా యూనివర్శిటీ అధికారులు కనీసం చలనం లేకుండా వ్యవహరిస్తున్నారు.
- విద్యార్థినులు పద్మజ, వేదశ్రీ, ప్రశాంతి
నా సామర్థ్యాన్ని గుర్తించే నియమించారు..
బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఉప్పునీటి పరిశోధనస్థానంలో, వాటర్ మేనేజ్మెంట్, మట్టి నమూనా కేంద్రాల్లో శాస్త్రవేత్తగా, సీనియర్ శాస్త్రవేత్తగా, విభాగాధిపతిగా పనిచేశాను. గతంలో రెండేళ్లు వసతిగృహ వార్డెన్‌గా విధులు నిర్వహించా. నా సామర్థ్యాన్ని గుర్తించి నన్ను అసోసియేట్ డీన్‌గా నియమించారు.
- పి.ఆర్.కె.ప్రసాద్, ప్రస్తుత డీన్
న్యాయం కోరుతూ కోర్టును ఆశ్రయించా..
వ్యవసాయ కళాశాలలో అసోసియేట్ డీన్‌గా నియమించాలంటే ఉండాల్సిన అర్హతలు అన్నీ ఉన్నా నన్ను కాదని, ఎలాంటి అనుభవం లేని వ్యక్తి, జూనియర్‌ను అసోసియేట్ డీన్‌గా నియమిస్తూ యూనివర్శిటీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని యూనివర్శిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. నా విషయంలో జరిగిన అన్యాయాన్ని అరికట్టి న్యాయం జరిగేలా చూడాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించాను.
- డి. విష్ణుశంకరరావు, తొలగించిన డీన్