గందరగోళంగా ఏపీపీఎస్సీ పరీక్ష
అనంతపురం : ఏపీపీఎస్సీ నిర్వహించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ల పోస్టుల పరీక్ష గందరగోళంగా ముగిసింది. అనంతపురం జిల్లాలో ఆదివారం 12 సెంటర్లలో నిర్వహించిన ఈ రాత పరీక్షకు ఏపీపీఎస్సీ నిర్వహణ లోపాలు కనిపించాయి. మొత్తం 4,096 మంది అభ్యర్థులకు గాను 3,083 మంది హాజరు కాగా, 1,003 మంది గైర్హాజరయ్యారు.
పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకే నంబరుపై ఇద్దరు నుంచి నలుగురుకి హాల్టికెట్లు జారీ కావడంతో అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. 612100312 నంబరుపై ఇద్దరికి హాల్టికెట్ జారీ అయ్యింది. 612201625 నంబరుపైన నలుగురికి హాల్టికెట్ జారీ అయ్యింది. దీంతో ఒకరి పేరు మాత్రమే నామినల్ రోల్లో ఉండి మిగతా వారి పేర్లు గల్లంతు కావడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి తోడు నామినల్ రోల్లో లేని మరో 99 మందిని గుర్తించారు. విషయాన్ని కో-ఆర్డినేటింగ్ అధికారి, డీఆర్ఓ మల్లీశ్వరి దేవి ఏపీపీఎస్సీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నామినల్ రోల్లో పేర్లు లేని వారికి వేరుగా పరీక్ష నిర్వహించారు. వేరుగా పరీక్ష రాసిన వారి ఓఎంఆర్ షీట్లు, అభ్యర్థుల వివరాలను ప్రత్యేకంగా ఒక కవర్లో సీల్ చేసి ఏపీపీఎస్సీకి పంపిస్తున్నట్లు ఆమె తెలిపారు.