పాముచర్మం ఆకృతిలో పర్వతాలు
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా)కు చెందిన న్యూహారిజాన్స్ వ్యోమనౌక ప్లూటో గ్రహానికి సంబంధించి తాజాగా పంపిన అత్యధిక రెజల్యూషన్తో కూడిన చిత్రాలు ఖగోళ శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ చిత్రంలో ప్లూటోపై పర్వతాలు పాము చర్మం ఆకృతిలో ఉన్నట్లు నాసా తెలిపింది. దీంతో పాటు చిత్రమైన ఆకారాల్లో నీలం-గోధుమ రంగుల్లో మిట్టలు ఉన్నట్లు ఈ కలర్ ఫొటో స్పష్టం చేస్తోందని 'న్యూహారిజాన్స్ జియోలజీ, జియోఫిజిక్స్ అండ్ ఇమేజింగ్' బృందానికి డిప్యూటి హెడ్ అయిన విలియమ్ మెకినన్ తెలిపారు.
మల్టీస్పెక్ట్రల్ విజువల్ ఇమేజింగ్ కెమెరా(ఎంవీఐసీ) ద్వారా సుమారు 530 కిలోమీటర్ల మేర ప్లూటో ఉపరితల ప్రాంతాన్ని జూలై 14న న్యూహారిజాన్స్ వ్యోమనౌక చిత్రించిందని చెప్పారు. దీంతో పాటు లాంగ్ రేంజ్ రీకనెసైన్స్ ఇమేజర్(ఎల్ఓఆర్ఆర్ఐ) ద్వారా తీసిన చిత్రం సెప్టెంబర్ 20న భూమికి చేరిందని, ప్లూటో భౌగోళిక వివరాలు ఇది స్పష్టం చేస్తోందని వివరించారు.