కీచక ప్రధానోపాధ్యాయుడి అరెస్ట్
తిరుమలాయపాలెం: పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెచ్చేలా విద్యార్థినిని లొంగదీసుకుని, ఆమె జీవితంతో ఆటలాడుకున్న ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. వేధింపుల వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న ఆ ఉపాధ్యాడు హైదరాబాద్ లోని ఓ లాడ్జిలో ఉండగా ఆదివారం అర్ధరాత్రి తర్వాత అరెస్టు చేసినట్లు తిరుమలాయపాలెం పోలీసులు చెప్పారు.
ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని చింతకాని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాడిగా పనిచేస్తున్న శంకర్ రెడ్డి.. గతంలో ఇదే జిల్లాలోని తిరుమలాయపాలెం పాఠశాలలో పనిచేసినప్పుడు ఎనిమిదో తరగతి విద్యార్థినితో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. ఆ తరువాత విద్యార్థినిపై చదువుల కోసం సహకరిస్తున్నట్లు నటించాడు. పదోతరగతి తర్వాత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాయించి హైదరాబాద్లోని ఓ కళాశాలలో చేర్పించాడు. ఓ గది అద్దెకు తీసుకుని ఆమెను అక్కడే ఉంచి, కావాల్సినవన్నీ కొనిస్తూ శారీరకంగా లొంగదీసుకున్నాడు.
తరచూ హైదరాబాద్ వచ్చిపోతూ ఆమెపై అఘాయిత్యం చేసేవాడు. చదువు పూర్తి చేసుకుని ఆ యువతి ప్రస్తుతం ఉద్యోగ అన్వేషణలో ఉంది. అయితే, శంకర్రెడ్డి ఆమెను కనీసం తల్లిదండ్రులతో కూడా మాట్లాడనివ్వకుండా, ఆమెపై లైంగిక దాడి కొనసాగిస్తూ ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరిస్తుండడంతో బాధిత యువతి తల్లిదండ్రులతో కలసి వారం క్రితం తిరుమలాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం అర్ధరాత్రి శంకర్రెడ్డిని అరెస్ట్ చేశారు.