athletics competitions
-
అంతర్జాతీయ క్రీడా వేదికపై తూగో జిల్లా ఆదివాసి బిడ్డ
కూనవరం(తూగో జిల్లా): కృషి ఉంటే మనుషులు రుషులవుతారు..మహాపురుషులవుతారు..అడవిరాముడు చిత్రం కోసం వేటూరి రాసిన ఈ గీతం ఓ స్ఫూర్తి మంత్రం..నిజమే..కొండ కోనల్లో కట్టెలమ్ముకునే ఇంట పుట్టిన ఓ అడవిబిడ్డ ఎంతో కష్టపడింది. పరుగులో రాణించేందుకు అహరహం శ్రమించింది. ఇప్పుడు కెన్యాలో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపికైంది. పట్టుదల..కఠోర సాధనతో ఈ బాలిక విజయపథాన రివ్వున దూసుకెళుతోంది. కుటుంబ సభ్యులతో రజిత కుగ్రామం నుంచి.. కూనవరం మండలం పోచవరం పంచాయతీ పరిధిలోని ఆదివాసీ కుగ్రామం రామచంద్రాపురం. చుట్టూ దట్టమైన అడవి తప్ప మరేమీ కనిపించదు. 35 ఏళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్ నుంచి ఇక్కడికి వలసవచ్చింది మారయ్య కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని దయనీయ స్థితి. కుంజా మారయ్య..భద్రమ్మ దంపతులకు ముగ్గురు మగ పిల్లలు ..ఇద్దరు ఆడపిల్లలు. ఇందులో ఆఖరి బిడ్డ రజిత. భర్త చనిపోయాక భద్రమ్మ అడవికి వెళ్లి కట్టెలు సేకరించడం ద్వారా పిల్లల్ని పోషిస్తోంది. రజిత రోజూ చింతూరు మండలం కాటుకపల్లి వెళ్లి చదువుకునేది. 1 నుంచి 8వ తరగతి వరకు అక్కడ చదివింది. సెలవులు ఇచ్చినప్పుడు తల్లి వెంట కట్టెలు తెచ్చి చేదోడు వాదోడుగా నిలిచేది. పరుగులో తొలినుంచి ఈమెలో వేగాన్ని పెద్దన్న జోగయ్య గమనించాడు. చిన్నా చితకా పరుగుపందెం పోటీల్లో పాల్గొని ముందు నిలిచేది. ఆగని పరుగు.. నెల్లూరు ఆశ్రమ పాఠశాలలో సీటు రావడంతో రజిత 9, 10 తరగతులు చదివింది. అప్పుడే నెల్లూరు సుబ్బారెడ్డి స్టేడియంలో వంశీసాయి కిరణ్ ఆధ్వర్యంలోని స్పోర్ట్స్ శిక్షణ పొందింది. మంగళగిరిలో ఇంటర్మీడియెట్ చదువుతూ గుంటూరులో శాప్ ద్వారా గురువులు కృష్ణమోహన్, మైకె రసూల్ వద్ద అథ్లెటిక్స్ శిక్షణ తీసుకుంది. 2019లో అసోంలో నిర్వహించిన జాతీయ ఖేలిండియా అథ్లెటిక్ పోటీల్లో 400 మీటర్లు పరుగు విభాగంలో విశేష ప్రతిభ కనబర్చింది. ఈ నెల 17న కెన్యాలోని నైరోబిలో జరిగే అండర్–20 జూనియర్ అథ్లెటిక్ పోటీలకు ఎంపికైంది. తగిన ప్రోత్సాహముంటే దేశ కీర్తిని చాటేలా ప్రతిభ నిరూపించుకుంటానని రజిత ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. -
30 ఏళ్ల క్రితం ఇక్కడే ఆడా
కోలాహలంగా స్టేడియం రాష్ట్రంలో తొలిసారి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తుండడంతో జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియం క్రీడాకారులతో కోలాహలంగా మారిపోయింది. రెండురోజులపాటు జరగనున్న ఈ పోటీలకు పది జిల్లాల నుంచి దాదాపు 700మంది క్రీడాకారులు, మరో 300మంది టెక్నికల్, కోచ్‌లు హాజరయ్యారు. దీంతో స్టేడియం పరిసర ప్రాంతాలు కళకళలాడాయి. క్రీడాకారులు శుక్రవారం రాత్రే స్టేడియంకు చేరుకోవడంతో సందడి నెలకొంది. హన్మకొండ చౌరస్తా : 30ఏళ్ల క్రితం ఇదే గ్రౌండ్లో ఆటలాడిన.. మళ్లీ ఇప్పుడు అధికార హోదాలో ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది.. అంటూ ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు, రిటైర్డ్ ఐఏఎస్ బీవీ పాపారావు తన కాలేజీ రోజులను గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. క్రీడా పతాకాన్ని ఆవిష్కరించిన పాపారావు పది జిల్లాల నుంచి పాల్గొన్న క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. తాను చదువుకున్న రోజుల్లో క్రీడాకారులకు ఎటువంటి సదుపాయాలు లేకున్నా జాతీయస్థాయికి ఎదిగిన క్రీడాకారులున్నారన్నారు. తాను ఐఏఎస్ అయ్యాక అప్పటి ప్రధాని పీవీ నరసింహరావుతో కలిసి ప్రత్యేక విమానంలో హన్మకొండ వచ్చి స్టేడియం కోసం స్థలాన్ని పరిశీలించామని, ఆయన చలువతోనే ఈ స్టేడియం ఏర్పడిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం క్రీడాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, త్వరలోనే జేఎన్ఎస్లో అథ్లెటిక్స్ కోసం సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రబెల్లి వరద రాజేశ్వర్‌రావు, డీఎస్డీఓ సారయ్య, ప్రొఫెసర్ పాండురంగారావు, అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సారంగపాణి పాల్గొన్నారు. అండర్ 14 (బాలురు) : 600 మీటర్ల రన్నింగ్ డి.శ్రీకాంత్ (నల్గొండ), నిఖిల్‌కుమార్ (హైదరాబాద్), గణేష్ (వరంగల్) అండర్ 14(బాలురు) : హైజంప్ ఆర్.ముని (నల్గొండ), జి.కన్నారావు (ఖమ్మం), ఇంద్రసేన (వరంగల్) అండర్ -14(బాలురు) : షాట్‌పుట్ సత్యవన్(హైదరాబాద్), అవినాష్కుమార్సింగ్(రంగారెడ్డి), సురేష్(కరీంనగర్) అండర్-16(బాలురు) : డిస్కస్ త్రో సాహిల్ (హైదరాబాద్), ఎం.రవి (కరీంనగర్), రాహుల్ (వరంగల్)అండర్-16 (బాలురు) : లాంగ్‌జంప్ రమేష్ (వరంగల్), రజనీకుమార్ (వరంగల్), అజీబాబా (కరీంనగర్) అండర్-18 (బాలురు) : డిస్కస్ త్రో కిరణ్‌కుమార్ (ఖమ్మం), సాయికుమార్ (నిజామాబాద్), వెంకటేష్ (వరంగల్) అండర్-20 (బాలుర) : 800 మీ. రన్నింగ్ చంద్రశేఖర్ (మహబూబ్‌నగర్), రాము (హైదరాబాద్), లోకేష్‌కుమార్ (రంగారెడ్డి) అండర్-14 ( బాలికలు) : లాంగ్‌జంప్ దివ్యపావని (ఖమ్మం), లిఖిత (మహబూబ్‌నగర్), శైలజ (ఆదిలాబాద్) అండర్-14 (బాలికలు) : షాట్‌పుట్ బి.సరిత (వరంగల్), శిరీష (నల్గొండ), సునీత (మహబూబ్‌నగర్) అండర్-16 (బాలికలు) : 200 మీటర్ల రన్నింగ్ నిత్య (హైదరాబాద్), భానుచంద్రిక (ఖమ్మం), మౌనిక (వరంగల్) అండర్-18 (బాలికలు) : 500 మీటర్ల వాకింగ్ హర్షశ్రీ (రంగారెడ్డి), వాసవి (కరీంనగర్), భవానీ (కరీంనగర్) అండర్-18(బాలికలు) : జావెలిన్ త్రో ఆర్.రాధిక (నిజామాబాద్), వి.కవిత (ఆదిలాబాద్) అండర్-18 (బాలికలు) : లాంగ్ జంప్ ఎస్.సుజాత (ఆదిలాబాద్), సీహెచ్.సమ్మక్క (ఖమ్మం), ఎన్.రోజా (నల్గొండ) అండర్-20(బాలికలు) : 200 మీటర్ల రన్నింగ్ లేఖ(వరంగల్), హారికాదేవి(హైదరాబాద్), అశ్విని (వరంగల్) అండర్-20(బాలికలు) : డిస్కస్ త్రో ఎం.అలివేలు (మహబూబ్‌నగర్), ఆష్మ (రంగారెడ్డి) అండర్-20 (బాలికలు) : లాంగ్ జంప్ సవంతి (నిజామాబాద్), శాంతికుమారి (మహబూబ్‌నగర్), శోభ (నల్గొండ) -
భీమవరంలో ముగిసిన అథ్లెటిక్స్ పోటీలు
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ : ఆంధ్ర, నన్నయ యూనివర్సిటీల అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ పోటీల్లో ఏలూరు సెయింట్ థెరిస్సా మహిళా కళాశాల విద్యార్థినులు సత్తా చాటారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ (అక్నూ) ఉమెన్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు. భీమవరం డీఎన్నార్ కళాశాల క్రీడామైదానంలో రెండు రోజులుగా జరిగిన అథ్లెటిక్స్ పోటీలు మంగళవారం ముగిశాయి. ముగింపు సభకు అక్నూ వీసీ జార్జివిక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. బాల్యం నుంచే విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడల్లో రాణిస్తే మంచి ఉద్యోగాలు సాధించవచ్చని చెప్పారు. తాను డీఎన్నార్ కళాశాలలో చదువుకుని ఈ స్థాయికి ఎదిగానని చెప్పారు. అనంతరం విజేతలకు పతకాలు అందజేశారు. సభకు కళాశాల అధ్యక్షుడు జీవీ నర్సింహరాజు అధ్యక్షత వహించారు. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు(బాబు), పాలకవర్గ ఉపాధ్యక్షుడు కె.రామకృష్ణంరాజు, ప్రిన్సిపాల్ యు.ధనపతి వర్మ, పీడీ భూపతిరాజు నరసింహరాజు, ఏయూ, అక్నూ పీడీలు శ్యాంబాబు, ఎ.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులకు ఆహారం అందించిన వైఎస్సార్ సీపీ నాయకుడు పేకేటి శ్రీనుకు వీసీ జార్జివిక్టర్ జ్ఞాపిక అందించారు. ఏయూ చాంపియన్లు.. తొమ్మిది బంగారు పతకాలు సాధించి ఏయూ మెన్ చాంపియన్‌షిప్‌ను విశాఖ వీఎంసీ కళాశాల, ఎనిమిది బంగారు పతకాలు సాధించి ఏయూ ఉమెన్ చాంపియన్‌షిప్‌ను విశాఖ ఎల్బీ కళాశాల విద్యార్థులు దక్కించుకున్నారు. ఫాస్టెస్ట్ మెన్‌గా విశాఖ వీఎంసీ కళాశాల క్రీడాకారుడు పి.గౌతమ్, ఫాస్టెస్ట్ ఉమెన్‌గా విశాఖ ఎల్బీసీ కళాశాల విద్యార్ధిని ఎస్.శ్రావణి నిలిచారు. ‘నన్నయ’ చాంపియన్లు.. ఏడు బంగారు పతకాలు గెలుచుకుని అక్నూ ఉమెన్ చాంపియన్‌షిప్‌ను ఏలూరు సెయింట్ థెరిస్సా కళాశాల, ఐదు బంగారు పతకాలు సాధించి మెన్ చాంపియన్‌షిప్‌ను కాకినాడ ఐడియల్ కళాశాల విద్యార్థులు గెలుచుకున్నారు. ఫాస్టెస్ట్ మెన్‌గా ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడాకారుడు బి.లీలా వరప్రసాద్, ఫాస్టెస్ట్ ఉమెన్‌గా కాకినాడ ఐడియల్ కళాశాల క్రీడాకారిణి ఎన్.శివజ్యోతి నిలిచారు.