ATM card theft
-
ఏటీఎం కార్డు పోతే ఇలా చేయండి..!
ప్రస్తుతం చాలా మంది వారి జీవితంలో ఏటీఎం కార్డులను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఏటీఎం ద్వారా డబ్బు విత్ డ్రా చేయడంతో పాటు డిపాజిట్ చేయడం వంటి పనులు చాలా తేలిక అవుతున్నాయి. లావాదేవీల కోసం ఎక్కువగా వాడే ఏటీఎం కార్డు పోతే మాత్రం ఇక అంతే సంగతులు. ఎందుకంటే ఏటీఎం నుంచి డబ్బులు ఇతరులు తీసుకునే ఆస్కారం ఎక్కువ. అందుకే ఒకవేల మీ డెబిట్ కార్డు ఎక్కడైన పోతే వెంటనే ఈ క్రింద చెప్పిన విదంగా చేయండి. 1. ఇంటర్నెట్ బ్యాంకింగ్ మీ ఖాతాకు కనుక ఇంటర్నెట్ సదుపాయం ఉంటే చాలా మంచింది. దీని ద్వారా మీ కార్డును క్షణాలలో బ్లాక్ చేయవచ్చు. కార్డును బ్లాక్ చేయడానికి మొదట ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు వెళ్లి లాగిన్ అవ్వండి. ఆ తర్వాత డెబిట్ కార్డ్ ఆప్షన్ ఎంపిక చేసుకోండి. ఇక్కడ మీరు పోయిన డెబిట్ కార్డ్ నంబర్‌ను వివరాలు సమర్పించండి. ఇప్పుడు బ్లాక్ యువర్ డెబిట్ కార్డ్ ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా మీ కార్డును బ్లాక్ చేయవచ్చు. కార్డు బ్లాక్ చేయడం వల్ల ఎవరూ మీ డబ్బును తీసుకోలేరు. 2. మొబైల్ బ్యాంకింగ్ యాప్ మీరు మొబైల్ బ్యాంకింగ్ యాప్ సహాయంతో మీ కార్డును బ్లాక్ చేయవచ్చు. ఇందుకోసం మీ బ్యాంక్ యాప్‌ను మొబైల్లో ఓపెన్ చేయండి. ఇప్పుడు మీకు కార్డ్ ఆప్షన్‌కు వెళ్లి మీ డెబిట్ కార్డును బ్లాక్ చేసే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ డెబిట్ కార్డు బ్లాక్ అవుతుంది. 3. హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి మీరు బ్యాంక్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా కూడా మీ ఏటీఎం కార్డును బ్లాక్ చేయవచ్చు. హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసిన తర్వాత మీ ఏటీఎం, బ్యాంక్ ఖాతా నంబర్ వివరాలు పేర్కొనాలి. మీరు చివరిగా డబ్బులు ఎప్పుడు తీశారో తెలియజేయాల్సి ఉంటుంది. ధృవీకరణ తర్వాత మీ కార్డ్ బ్లాక్ చేయబడుతుంది. 4. ఎఫ్ఐఆర్ దాఖలు చేయండి మీ ఏటీఎం కార్డు ఎవరైనా దొంగలించినట్లు మీకు అనిపిస్తే వెంటనే ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి. దీనికోసం మీరు కార్డు దొంగతనం జరిగిన సమీప పోలీసు స్టేషన్‌కు వెళ్లి నివేదించాలి. ఎఫ్ఐఆర్ కాపీ రిజిస్టర్ చేసిన తర్వాత మీకు ఇస్తారు. ఈ కాపీని భవిష్యత్ ఉపయోగం కోసం ఉంచాలి. చదవండి: 2020లో భారీగా పెరిగిన డిజిటల్ మోసాలు -
నగదు డ్రా చేసి ఇస్తానని..
భువనగిరిఅర్బన్ : ఏటీఎంలకు నగదు డ్రా చేయడానికి వచ్చే వ్యక్తులను మోసగిస్తున్న వ్యక్తిని భువనగిరి పట్టణ పోలీసులు మంగళవారం జిల్లా కేంద్రంలో అరెస్టు చేశారు. భువనగిరిలోని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను సీఐ వెంకన్నగౌడ్ వెల్లడించారు. గుంటూరు జిల్లా నర్సంపేట్లోని ప్రకాష్‌నగర్‌కు చెందిన తుమ్మల ఉదయ్‌కుమార్(మాజీ హోంగార్డు) కూలీ పని చేస్తున్నాడు. ఉదయ్‌కుమార్ ఏటీఎంల వద్ద కాపుకాస్తూ నగదు కోసం వచ్చేవారిని గమనిస్తుంటాడు. ఏటీఎంలపై అవగాహన లేనివారుంటే వారికి సహాయం చేస్తానని చెప్పి నగదు తీసి ఇస్తాడు. అనంతరం వారి ఒరిజినల్ ఏటీఎంను కాకుండా తన వద్ద అప్పటికే ఉన్న మరో డూప్లికేట్ కార్డు ఇస్తాడు. తాను తీసుకున్న ఒరిజినల్ ఏటీఎం కార్డులతో పెట్రోల్ బంకులు, నగదు ఇచ్చే చోటుకు వెళ్లి డబ్బులు తీసుకుంటాడు. జనవరి 7న భువనగిరిలో కొమ్మిడి ఇంద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ నెల 4న భువనగిరి పట్టణంలో అనుమానస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని విచారించగా ఏటీఎం వద్ద చోరీలకు పాల్పడుతున్నట్లు ఒపుకున్నాడు. అతని వద్ద నుంచి రూ.3 లక్షల నగదు, 4 సెల్ఫోన్లు, 2 ఏటీఎం కార్డులు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితుడు 2012 నుంచి ఏటీఎం వద్ద మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. పలు జిల్లాల్లో 11 కేసులు నమోదు నిందితుడిపై పలు జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయి. యాదాద్రి జిల్లాలోని భువనగిరి పట్టణంలో రూ. 2.65లక్షలు, వరంగల్ జిల్లాలోని దేవరుప్పలలో రూ.76,650లు, కాజీపేటలో రూ. 1.27 లక్షలు, వర్దన్నపేటలో రూ.50,000, మెదక్ జిల్లాలోని నర్సపూర్‌లో రెండు ఏటీఎంలలో రూ. 1,09,300, సిద్దిపేట జిల్లాలోని చేర్యాల్లో రూ.40,000, దుబ్బాకలో రూ. 74,500, మహబూబాద్ జిల్లాలోని దంతాలపల్లిలో రూ.1,07,000, సిరిసిల్లలో రూ. 53000, కరీంనగర్ జిల్లా టౌన్–1లో రూ. 30,000, మొత్తం రూ. 9,32,450 నగదును అపహరించినట్లు సీఐ తెలిపాడు. ఏటీఎంల వద్ద అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. గుర్తు తెలియని వ్యక్తులకు ఏటీఎం కార్డులు ఇవ్వొద్దని సూచించారు. దొంగను పట్టుకున్న ఎస్ఐ రాజు, ఐడీ పార్టీ కానిస్టేబుల్స్ శ్రీనివాస్, సైదులు, రవి, శ్రీనివాస్‌ను సీఐ వెంకన్నగౌడ్ అభినందించారు. వీరికి రివార్డు కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజు, ఐడీ పార్టీ శ్రీనివాస్, సైదులు, రవి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఏటీఎం మోసగాడు అరెస్ట్
పోరుమామిళ్ల (వైఎస్సార్ కడప): ఏటీఎం కార్డుతో డబ్బు డ్రా చేస్తానని చెప్పి తన అకౌంటుకు డబ్బు బదిలీ చేసుకుని ఓ వ్యక్తిని మోసగించిన కేసులో పోరుమామిళ్ల ఎస్ఐ పెద్ద ఓబన్న నిందితుడిని అరెస్టు చేసి డబ్బు స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని అక్కలరెడ్డిపల్లెకు చెందిన బాలెబోయిన రామయ్య ఇటీవల డబ్బు డ్రా చేసుకునేందుకు పోరుమామిళ్ల స్టేట్‌బ్యాంక్ ఏటీఎంకు వచ్చాడు. అక్కడ ఓ యువకుడు తాను డ్రా చేసి ఇస్తానంటూ ఏటీఎం కార్డు తీసుకుని అందులో నుంచి రూ. 40 వేలు తన భార్య అకౌంటుకు ట్రాన్స్ఫర్ చేసి, డబ్బు రాలేదని చెప్పి కార్డు రామయ్య చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. దాంతో రామయ్య బ్యాంకు లోనికి వెళ్లి క్యాషియర్‌తో తన కార్డుకు డబ్బు రాలేదని చెప్పాడు. అకౌంటులో చూసిన క్యాషియర్ ఇప్పుడే రూ. 40 వేలు గుంటూరు జిల్లా వినుకొండ అకౌంట్‌కు బదిలీ అయిందని తెలుపడంతో రామయ్య తాను మోసపోయినట్లు గుర్తించి, జరిగిన సంఘటన క్యాషియర్‌కు వివరించాడు. వెంటనే క్యాషియర్ వినుకొండ అకౌంట్ నుంచి డబ్బు డ్రా కాకుండా దాన్ని బ్లాక్ చేసి, ఆ అకౌంటుకు సంబంధించిన పూర్తి వివరాలు రామయ్యకు చెప్పారు. వెంటనే రామయ్య పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ పెద్ద ఓబన్న మోసం చేసిన యువకుడు రవికుమార్, వినుకొండ మండలం అందుగులపాడు గ్రామానికి చెందినవాడని గుర్తించి అతని ఫోన్ నెంబర్ ఆధారంగా వలపన్ని పట్టుకున్నారు. ఐపీసీ 296, 420, 379 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతని వద్ద నుంచి రూ. 39 వేలు స్వాధీనం చేసుకున్నారు. అటు బ్యాంకు అధికారులు, ఇటు పోలీసులు సకాలంలో స్పందించడంతో ఏటీఎం మోసగాడు కటకటాలపాలు కాక తప్పలేదు. -
నమ్మి సాయం కోరితే..నగదు డ్రా
దుగ్గొండి(నర్సంపేట) : ఏటీఎంలో బ్యాలన్స్ చూడాలని నమ్మి సాయం కొరితే అదే అదనుగా భావించిన సదరు వ్యక్తి నగదు డ్రా చేసుకున్న సంఘటన మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. మండలంలోని పీజీ తండాకు చెందిన నునావత్ ఉమాదేవి జాతీయ గ్రామీణ పథకంలో భాగంగా కూలి పనులు చేస్తోంది. ఈ క్రమంలో ఎస్బీఐ దుగ్గొండి బ్యాంకులో తన బ్యాలన్స్ చూసుకోవడానికి వచ్చింది. బ్యాంకు అధికారులు ఉమాదేవిని ఏటీఎంలో బ్యాలన్స్ చూసుకోవాలని సూచించగా పక్కనే ఉన్న ఏటీఎంకు వెళ్లింది. కాగా, ఆమెకు బ్యాలన్స్ చూడటం రాకపోవడంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి సాయం కోరింది. కార్డు తీసుకున్న ఆయన ఏటీఎం ఫిన్ నంబర్ అడిగాడు. ఆమె తన భర్తకు తెలుసు అని చెప్పింది. వెంటనే మరో వ్యక్తి ఫోన్ తీసుకుని భర్త రవికిషొర్నాయక్కు ఫోన్ చేసింది. ఫిన్నంబర్ భర్త ద్వారా తెలుసుకుని సదరు వ్యక్తికి చెప్పింది. వ్యక్తి ఖాతాలో రూ. 5500 ఉన్నాయని చెప్పి ఉమాదేవికి కార్డు ఇచ్చాడు. దీంతో మహిళ వెళ్లిపోయింది. మరుక్షణమే ఆమె ఖాతానుంచి రూ.5500 డ్రా చేసుకుని వెళ్లాడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న ఆమె బ్యాంకు వద్దకు వచ్చి బోరున విలపించింది. విషయం తెలుసుకున్న ఎస్సై భాస్కర్‌రెడ్డి ఏటీఎం వద్దకు వచ్చి సీసీ పుటేజీలను పరిశీలించారు. -
ఏటీఎం కార్డు చోరీ
అమలాపురం, న్యూస్‌లైన్ : ఓ మహిళకు సంబంధించిన ఏటీఎం కార్డు చోరీను చోరీ చేసి, ఆమె ఖాతాలో రూ.లక్ష నగదు డ్రా చేసుకున్న ఉదంతమిది. అల్లవరం మండలం బెండమూర్లంకకు చెందిన రాయుడు లక్ష్మిదుర్గ ఎస్బీఐ కొమరగిరిపట్నం బ్రాంచిలో ఖాతా ఉంది. ఈ ఖాతాకు చెందిన ఏటీఎం కార్డు చోరీకి గురైంది. భూమి కొనుగోలుకు లక్ష్మీదుర్గ భర్త నాగరాజు సోదరుడు రాయుడు శ్రీను గుజరాత్ నుం చి లక్ష్మీదుర్గ ఖాతాలో నగదును ఆన్లైన్ ద్వారా జమ చేశాడు. భూమి కొనుగోలు చేసేందుకు భార్య ఖాతా నుంచి నగదు డ్రా చేసేందుకు బ్యాంకుకు వెళ్లిన నాగరాజు తన భార్య ఖాతాలో రూ.లక్ష లేదని గుర్తించాడు. బ్యాంక్ అధికారులను ఆరా తీయగా, 4 దఫాలుగా రూ. 25 వేల చొప్పున బెండమూర్లంకలోని ఏటీఎం నుంచి డ్రా చేసినట్టు చెప్పారు. ఇంటికి వచ్చి ఏటీఎం కార్డు కోసం వెతికినా కనిపించకపోవడంతో పుట్టింట్లో ఉన్న లక్ష్మీదుర్గను ఫోన్ చేసి అడిగాడు. ఏటీఎం తన వద్ద లేద ని, గతంలో ఏటీఎంల నుంచి నగదు డ్రా చేసుకుని రమ్మ ని ఇచ్చిన పొరుగింటి వ్యక్తే ఏటీఎం చోరీ చేసి, నగదు డ్రా చేసి ఉంటాడని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. దీంతో నాగరాజు అల్లవరం పోలీసులను ఆశ్రయించాడు. ఎస్సై రాజేష్‌కుమార్ కేసు నమోదు చేయగా, సీఐ ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.