ఏటీఎం మోసగాడు రవికుమార్‌తో ఎస్‌ఐ
పోరుమామిళ్ల (వైఎస్సార్ కడప): ఏటీఎం కార్డుతో డబ్బు డ్రా చేస్తానని చెప్పి తన అకౌంటుకు డబ్బు బదిలీ చేసుకుని ఓ వ్యక్తిని మోసగించిన కేసులో పోరుమామిళ్ల ఎస్‌ఐ పెద్ద ఓబన్న నిందితుడిని అరెస్టు చేసి డబ్బు స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని అక్కలరెడ్డిపల్లెకు చెందిన బాలెబోయిన రామయ్య ఇటీవల డబ్బు డ్రా చేసుకునేందుకు పోరుమామిళ్ల స్టేట్‌బ్యాంక్ ఏటీఎంకు వచ్చాడు. అక్కడ ఓ యువకుడు తాను డ్రా చేసి ఇస్తానంటూ ఏటీఎం కార్డు తీసుకుని అందులో నుంచి రూ. 40 వేలు తన భార్య అకౌంటుకు ట్రాన్స్‌ఫర్ చేసి, డబ్బు రాలేదని చెప్పి కార్డు రామయ్య చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. దాంతో రామయ్య బ్యాంకు లోనికి వెళ్లి క్యాషియర్‌తో తన కార్డుకు డబ్బు రాలేదని చెప్పాడు.
అకౌంటులో చూసిన క్యాషియర్ ఇప్పుడే రూ. 40 వేలు గుంటూరు జిల్లా వినుకొండ అకౌంట్‌కు బదిలీ అయిందని తెలుపడంతో రామయ్య తాను మోసపోయినట్లు గుర్తించి, జరిగిన సంఘటన క్యాషియర్‌కు వివరించాడు. వెంటనే క్యాషియర్ వినుకొండ అకౌంట్ నుంచి డబ్బు డ్రా కాకుండా దాన్ని బ్లాక్ చేసి, ఆ అకౌంటుకు సంబంధించిన పూర్తి వివరాలు రామయ్యకు చెప్పారు. వెంటనే రామయ్య పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ పెద్ద ఓబన్న మోసం చేసిన యువకుడు రవికుమార్, వినుకొండ మండలం అందుగులపాడు గ్రామానికి చెందినవాడని గుర్తించి అతని ఫోన్ నెంబర్ ఆధారంగా వలపన్ని పట్టుకున్నారు. ఐపీసీ 296, 420, 379 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతని వద్ద నుంచి రూ. 39 వేలు స్వాధీనం చేసుకున్నారు. అటు బ్యాంకు అధికారులు, ఇటు పోలీసులు సకాలంలో స్పందించడంతో ఏటీఎం మోసగాడు కటకటాలపాలు కాక తప్పలేదు.
Comments
Please login to add a commentAdd a comment