వివరాలు వెల్లడిస్తున్న సీఐ వెంకన్నగౌడ్
భువనగిరిఅర్బన్ : ఏటీఎంలకు నగదు డ్రా చేయడానికి వచ్చే వ్యక్తులను మోసగిస్తున్న వ్యక్తిని భువనగిరి పట్టణ పోలీసులు మంగళవారం జిల్లా కేంద్రంలో అరెస్టు చేశారు. భువనగిరిలోని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను సీఐ వెంకన్నగౌడ్ వెల్లడించారు. గుంటూరు జిల్లా నర్సంపేట్‌లోని ప్రకాష్‌నగర్‌కు చెందిన తుమ్మల ఉదయ్‌కుమార్(మాజీ హోంగార్డు) కూలీ పని చేస్తున్నాడు. ఉదయ్‌కుమార్ ఏటీఎంల వద్ద కాపుకాస్తూ నగదు కోసం వచ్చేవారిని గమనిస్తుంటాడు. ఏటీఎంలపై అవగాహన లేనివారుంటే వారికి సహాయం చేస్తానని చెప్పి నగదు తీసి ఇస్తాడు. అనంతరం వారి ఒరిజినల్ ఏటీఎంను కాకుండా తన వద్ద అప్పటికే ఉన్న మరో డూప్లికేట్ కార్డు ఇస్తాడు.
తాను తీసుకున్న ఒరిజినల్ ఏటీఎం కార్డులతో పెట్రోల్ బంకులు, నగదు ఇచ్చే చోటుకు వెళ్లి డబ్బులు తీసుకుంటాడు. జనవరి 7న భువనగిరిలో కొమ్మిడి ఇంద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ నెల 4న భువనగిరి పట్టణంలో అనుమానస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని విచారించగా ఏటీఎం వద్ద చోరీలకు పాల్పడుతున్నట్లు ఒపుకున్నాడు. అతని వద్ద నుంచి రూ.3 లక్షల నగదు, 4 సెల్‌ఫోన్లు, 2 ఏటీఎం కార్డులు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితుడు 2012 నుంచి ఏటీఎం వద్ద మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
పలు జిల్లాల్లో 11 కేసులు నమోదు
నిందితుడిపై పలు జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయి. యాదాద్రి జిల్లాలోని భువనగిరి పట్టణంలో రూ. 2.65లక్షలు, వరంగల్ జిల్లాలోని దేవరుప్పలలో రూ.76,650లు, కాజీపేటలో రూ. 1.27 లక్షలు, వర్దన్నపేటలో రూ.50,000, మెదక్ జిల్లాలోని నర్సపూర్‌లో రెండు ఏటీఎంలలో రూ. 1,09,300, సిద్దిపేట జిల్లాలోని చేర్యాల్‌లో రూ.40,000, దుబ్బాకలో రూ. 74,500, మహబూబాద్ జిల్లాలోని దంతాలపల్లిలో రూ.1,07,000, సిరిసిల్లలో రూ. 53000, కరీంనగర్ జిల్లా టౌన్–1లో రూ. 30,000, మొత్తం రూ. 9,32,450 నగదును అపహరించినట్లు సీఐ తెలిపాడు.
ఏటీఎంల వద్ద అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. గుర్తు తెలియని వ్యక్తులకు ఏటీఎం కార్డులు ఇవ్వొద్దని సూచించారు. దొంగను పట్టుకున్న ఎస్‌ఐ రాజు, ఐడీ పార్టీ కానిస్టేబుల్స్ శ్రీనివాస్, సైదులు, రవి, శ్రీనివాస్‌ను సీఐ వెంకన్నగౌడ్ అభినందించారు. వీరికి రివార్డు కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ రాజు, ఐడీ పార్టీ శ్రీనివాస్, సైదులు, రవి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment