స్వాతి పొలంలోనే నరేశ్‌ను చంపేశారు | naresh was murderded by swathi father, bhuvanagiri police | Sakshi
Sakshi News home page

స్వాతి పొలంలోనే నరేశ్‌ను చంపేశారు

Published Sat, May 27 2017 11:09 AM | Last Updated on Tue, Sep 5 2017 12:09 PM

స్వాతి పొలంలోనే నరేశ్‌ను చంపేశారు

స్వాతి పొలంలోనే నరేశ్‌ను చంపేశారు

- భువనగిరి ప్రేమగాథ విషాదాంతం
- నరేశ్‌ను స్వాతి తండ్రే హత్యచేశాడని పోలీసుల వెల్లడి
- కొద్ది రోజుల కిందటే ఆత్మహత్య చేసుకున్న స్వాతి


భువనగిరి:
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన నరేశ్‌ అదృశ్యం కేసు ఊహించిన మలుపే తిరిగింది. స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డే నరేశ్‌ను కిరాతకంగా హత్యచేసినట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో పోలీసులు శనివారం ఉదయం శ్రీనివాసరెడ్డిని అరెస్ట్‌ చేశారు. శ్రీనివాస రెడ్డి సోదరుడు, సోదరుడి కుమారుల పేర్లను కూడా నిందితుల జాబితాలో చేర్చారు. మే 1 నుంచి నరేశ్‌ అదృశ్యంకాగా, అతని ప్రియురాలు స్వాతి మే 16న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆద్యంతం మలుపులతో కూడిన ప్రేమగాథ చివరికి తీవ్రవిషాదాంతంగా ముగిసినట్లయింది.

స్వాతి పొలంలోనే చంపేశారు..
స్వాతి- నరేశ్‌ల ప్రేమ వ్యవహారంపై మొదటి నుంచీ విముఖత ప్రదర్శించిన శ్రీనివాసరెడ్డి.. తమను కాదని స్వాతి.. నరేశ్‌ వెళ్లడంతో కోపం పెంచుకున్నారు. పథకం ప్రకారమే ముంబై నుంచి స్వాతి-నరేశ్‌లను ఊరికి రప్పించారు. వివాహం జరిపిస్తామని కూతురిని నమ్మించిన శ్రీనివాసరెడ్డి.. ఆమె చేతే ఫోన్‌ చేయించి నరేశ్‌ను పిలిపించాడు. స్వాతి పేరుమీద ఉన్న పొలంలోనే నరేశ్‌ను అతికిరాతకంగా హత్యచేశారు. అనంతరం శవాన్ని టైర్లతో కాల్చేసి, బూడిదను మూసి నదిలో కలిపారు. పోలీసుల విచారణలో స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి, ఇతర నిందితులు ఈ మేరకు నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం.

కోర్టు జోక్యంతో కదిలిన డొంక..
అంబోజి నరేశ్‌ అదృశ్యం విషయంలో అతని తల్లిదండ్రులు, దళిత సంఘాలు వ్యక్తపరిచిన అనుమానమే నిజమైంది. మే 1 నుంచి కనిపించకుండాపోయిన నరేశ్‌ను స్వాతి కుటుంబీకులే ఏదైనా చేసి ఉంటారని సర్వత్రా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే పోలీసులు మాత్రం ఆ దిశగా దర్యాప్తు జరపకపోవడంతో బాధిత కుటుంబం కోర్టును ఆశ్రయించింది. స్పందించిన కోర్టు.. జూన్‌ 1 లోగా నరేశ్‌ ఆచూకీ కనిపెట్టాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు గడువు సమీపిస్తుండటంతో చేసేదేమీలేక అసలు నిందితులను అరెస్ట్‌చేశారు. ఈ కేసులో పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

ఎలా మొదలైంది? పల్లెర్ల గ్రామానికి చెందిన అంబోజు నరేష్‌తో ఫేస్‌బుక్‌ ద్వారా రెండు సంవత్సరాల క్రితం స్వాతి పరిచయం ఏర్పడింది. నరేష్‌ తల్లిదండ్రులు ముంబై లో ఉంటున్నారు. నరేష్‌ పల్లెర్లలో తాత వద్ద ఉంటూ భువనగిరిలో డిగ్రీ పూర్తి చేశాడు. స్వాతి వలిగొండలో ప్రగతి కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. ఫేస్‌బుక్‌లో ఏర్పడిన ఈ ఇద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో గత మార్చి 25న ముంబై వెళ్లి వివాహం చేసుకున్నారు. నెల రోజుల క్రితం అమ్మాయి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి ఇరువురిని ముంబై నుంచి పిలిపించారు.

 మన కుటుంబాల మధ్య గొడవలు ఉండవద్దు మంచిగా ఉండాలని వారికి సూచిం చారు. అయినా నరేష్‌–స్వాతి తిరిగి ముంబైకి వెళ్లారు. 15 రోజుల క్రితం ఇద్దరికి వివాహం జరిపిస్తానంటూ.. స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి చెప్పడంతో ఈనెల 11న తిరిగి భువనగిరికి వచ్చారు. అక్కడే ఉన్న శ్రీనివాస్‌రెడ్డి తన కూతురును తీసుకెళ్లాడు. అప్పటి నుంచి అంబోజు నరేష్‌ కనిపించడం లేదు.

ఈ విషయంపై నరేష్‌ తండ్రి అంబోజు వెంకటయ్య హోంమంత్రి, డీసీపీలకు ఇటీవలనే హైకోర్టులోనూ ఫిటిషన్‌ దాఖలు చేశాడు. దీంతో మే 18న స్వాతితో పాటు ఆమె తండ్రి శ్రీని వాస్‌రెడ్డి, కిడ్నాప్‌కు గురైన నరేష్‌లను కోర్టులో హాజరు పర్చాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమంలోనే  స్వాతి ఆత్మహత్య చేసుకోవడం, అది ఆత్మహత్యా లేక హత్యా అనే అనుమానాలు వ్యక్తం కావడం, అంతలోనే ఇవాళ నరేశ్‌ హత్యకు గురైన విషయం వెల్లడికావడంతో వీరి ప్రేమగాథ విషాదాంతంగా ముగిసినట్లయింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement