గుంటూరు ఈస్ట్: ఇంట్లో ఒంటరిగా ఉన్న ఫిజియోథెరపిస్టు హత్యకు గురైన ఘటనపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పల్నాడు జిల్లా బెల్లంకొండకు చెందిన సత్తెనపల్లి సీతారామాంజనేయులు (36) గుంటూరులోని ఓ ఆస్పత్రిలో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్నాడు. సీతారామాంజనేయులు గతంలో తన సోదరి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అయితే భార్యను బెల్లంకొండలోనే వదిలేసి గుంటూరులోని గుంటూరువారితోట 5వ లైనులో నివాసం ఉంటున్నాడు. తాను పనిచేసే ఆస్పత్రిలోనే ఫార్మాసిస్టు అయిన స్వాతిరెడ్డిని రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.
అయితే వీరి వివాహం స్వాతిరెడ్డి తల్లిదండ్రులకు ఇష్టం లేదు. స్వాతిరెడ్డి సంవత్సరన్నర క్రితం యూఎస్‌లో ఎం ఫార్మసీ చేసేందుకు వెళ్లింది. సీతారామాంజనేయులు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. రోజూ విధులకు వెళ్లి వస్తుంటాడు. నవంబరు 1న స్వాతిరెడ్డి యూఎస్‌ఏ నుంచి గుంటూరు రానుంది. స్వాతిరెడ్డి తండ్రి పి.శ్రీనివాసరెడ్డి ఆర్టీసీ ఉద్యోగి. శ్రీనివాసరెడ్డి ఆదివారం రాత్రి సీతారామాంజనేయులు ఇంటికి వచ్చి మాట్లాడి వెళ్లినట్లు సమాచారం.
సోమవారం ఉదయం సీతారామాంజనేయులు అసిస్టెంట్ వచ్చేటప్పటికి అతను విగత జీవుడై రక్తపు మడుగులో పడి ఉన్నాడు. దీంతో అసిస్టెంట్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సీతారామాంజనేయులు తలకు బలమైన గాయమైంది. ఈస్ట్ అడిషనల్ ఎస్పీ నచికేత్ షల్కి, కొత్తపేట ఎస్‌హెచ్‌ఓ షేక్ అన్వర్‌బాషా ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment