టీడీపీకి కొత్త టెన్షన్.. అక్కడ అభ్యర్థి కరువు?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గ నాయకత్వంపై ఆ పార్టీకి నమ్మకంలేక వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి ఎర్రతివాచీ పరిచింది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆత్మకూరు కంచుకోట కావడంతో పోటీ చేసినా ఓటమి తప్పదనే సంకేతాలు ఆనంకు అందాయి. దీంతో పార్టీ కండువా కప్పుకోకముందే ఈ సీటు తనకొద్దంటూ తెగేసి చెప్పి మరోసారి వెంకటగిరి వైపు చూస్తున్నారు. నో చెప్పలేక వెంకటగిరి సీటును ఆనంకే ఖరారు చేశారని సమాచారం. ఈ పరిణామాలతో ఆత్మకూరులో అభ్యర్థి కోసం టీడీపీ వెతుకులాట ఇంకా కొలిక్కి రాలేదు.
వైఎస్సార్సీపీ గ్రాఫ్పైపైకి..
ఆత్మకూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ నానాటికీ పెరుగుతోంది. ఇక్కడి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి విద్యావంతుడు కావడంతో అభివృద్ధి విషయంలో ఓ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తనదైన శైలిలో విక్రమ్‌రెడ్డి దూసుకెళ్తున్నారు. నిరుద్యోగులకు జాబ్ మేళాలు.. ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం ద్వారా పలు పనులను చేపడుతూ ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటున్నారు.
ఆత్మకూరా.. నాకొద్దు..!
టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రను ఆత్మకూరులో చేపట్టిన సమయంలో అన్నీతానై ఆనం రామనారాయణరెడ్డి నడిపించారు. ఆత్మకూరు బాధ్యత ఇక ఆయనదేనని లోకేశ్ ప్రకటించారు. దీంతో నెల పాటు నియోజకవర్గంలో హడావుడి చేసిన ఆనం ఆ తర్వాత వాస్తవ పరిస్థితి తెలుసుకొని ముఖం చాటేశారు. పార్టీతో పాటు వ్యక్తిగతంగా చేయించుకున్న సర్వేల్లో సైతం ఓటమి తప్పదని తేలడంతో ఆత్మకూరు అంటేనే హడలిపోతున్నారు.
దూరమైన సీనియర్ నేతలు
స్థానిక టీడీపీ నాయకత్వం సైతం ఆనం రామనారాయణరెడ్డికి సహకరించడంలేదు. కష్టకాలంలో పార్టీని నమ్ముకున్న మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు, బొల్లినేని కృష్ణయ్యనాయుడు, గూటూరు కన్నబాబు లాంటి నేతలూ దూరంగా ఉన్నారు. అటు కేడర్ కలిసిరాక.. ఇటు నేతలు సహకరించక ఆయన మీమాంసలో పడ్డారు.
ఆత్మకూరు టు వెంకటగిరి వయా నెల్లూరు సిటీ
ఆత్మకూరు కలిసి రాకపోవడంతో నెల్లూరు సిటీ వైపు ఆనం మొదట్లో కన్నేశారు. నగరంలో తన కుటుంబానికి రాజకీయ బలంతో పాటు అభిమాన గణం ఉండటంతో నెల్లూరు సిటీ సీటును ఇవ్వాలని చంద్రబాబును ప్రాధేయపడ్డారని సమాచారం. అయితే నారాయణకు ఖరారు చేశామని స్పష్టం చేసిన బాబు.. సర్వేపల్లిలో ఛాన్స్ ఇస్తామని చెప్పినా సిట్టింగ్ సీటు కావాలని పట్టుబట్టడంతో ఓకే చేశారని తెలుస్తోంది.
సిట్టింగ్ స్థానంలోనూ తప్పని కుస్తీ
ఆనం రామనారాయణరెడ్డి తన సిట్టింగ్ సీటు వెంకటగిరిని మరోసారి దక్కించుకునేందుకు కుస్తీ పడాల్సి వస్తోందనే వాదనా వినిపిస్తోంది. ఇక్కడి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ రెండుసార్లు విజయం సాధించి పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. పార్టీని నమ్ముకొని ప్రస్తుత ఎన్నికల్లో పోటీకి సై అంటున్న క్రమంలో తన ప్రత్యర్థి ఆనం టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చి సీటు తనదేనంటూ ప్రకటనలు చేయడంపై కురుగొండ్ల తీవ్రంగా మండిపడుతున్నారు.
సీటు విషయంలో వీరిద్దరూ కుస్తీ పడాల్సి వస్తోంది. మరోవైపు వెంకటగిరి సీటును బీసీలకు కేటాయించాలని మరో నేత యత్నాలు ప్రారంభించారు. కాగా ఈ ముగ్గురిలో సీటు ఎవరికొచ్చినా మిగిలిన ఇద్దరూ హ్యాండిచ్చే అవకాశం లేకపోలేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
ఎన్నికలొస్తున్నాయంటే సాధారణంగా ఆయా నియోజకవర్గాల్లో సీటు దక్కించుకునేందుకు ఆశావహులు పోటీ పడతారు. నువ్వా.. నేనా అనే రీతిలో తలపడి తమ అభ్యర్థిత్వాన్ని పరీక్షించుకుంటారు. అయితే ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. ఆది నుంచి ఇక్కడ సరైన నాయకత్వం లేకపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని టీడీపీ అక్కున చేర్చుకుంది.
అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అశేష ప్రజాదరణతో ఇక్కడ పోటీ చేసినా ఓటమి తప్పదని తెలియడంతో ఆనం విముఖత చూపుతున్నారు. ఈ పరిణామాలతో రండి బాబూ రండీ అనే రీతిలో కొత్త అభ్యర్థి కోసం టీడీపీ అన్వేషణను ప్రారంభించింది.