అమ్మానాన్న అని ఏడ్చినందుకు..
* చిన్నారిని చితకబాదిన వంట మనిషి
* పోలీస్‌స్టేషన్‌కు చేరిన చిన్నారులు
ఆత్మకూర్: తల్లిదండ్రులు లేని అనాథలు అమ్మా నాన్నను గుర్తు చేసుకొని ఏడిస్తే.. ఆదరించి వారి కన్నీటిని తూడ్చాల్సిందిపోయి చితకబాదింది ఆ వంట మనిషి. మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూర్ బాల సదనంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వం ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్న ఈ బాలసదనంలో 14 మంది విద్యార్థినులు ఉన్నారు. ఇన్చార్జ్ మ్యాట్రిన్ వెంకటేశ్వరమ్మ ఎప్పుడో ఒకసారి వచ్చిపోతుండటంతో వంట మనిషి ప్రమీలదే అక్కడ పెత్తనం. బాల సదనంలోని పాప పేరు మనీష.
ప్రస్తుతం 3వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రుల పేర్లు పెట్టాలి కాబట్టి నాన్న సీతయ్య, అమ్మ చిట్టెమ్మలుగా రిజిస్టర్లో పేర్కొన్నారు. ఆ పాపకు తల్లిదండ్రులు గుర్తుకు వచ్చి బుధవారం రాత్రి ఓ మూలన ఏడ్చుకుంటూ కూర్చుంది. అప్పుడే వచ్చిన వంటమనిషి ప్రమీల నచ్చజెప్పాల్సిందిపోయి ఒక్కసారిగా విరుచుకుపడిందని విద్యార్థినులు తెలిపారు. మేం చెప్పినట్లు వినాలి.. నేనే ఇక్కడ బాస్‌ను అని, లేని తల్లిదండ్రులను ఎందుకు గుర్తుచేసుకున్నావంటూ మనీషను చితకబాదింది.
దీంతో భయబ్రాంతులైన మిగతా విద్యార్థినులు గేటు దూకి ఎదురుగా ఉన్న ఇళ్లలోకి వెళ్లి గోడు వెళ్లబోసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకుడు ఐ.శ్రీనివాసులు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర అక్కడికు చేరుకొని ఆ విద్యార్థులకు నచ్చజెప్పి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ట్రైనీ ఎస్ఐ కృష్ణయ్య తెలిపారు.