సేవింగ్ ఖాతా ఆంక్షలపై ఆర్బీఐ తాజా మాట!
త్వరలోనే విత్డ్రా ఆంక్షలు ఎత్తివేత
ముంబై: నగదు ఉపసంహరణలకు సంబంధించి సాధారణ ప్రజలకు, చిన్న వ్యాపారులకు ఊరటనిచ్చే కొన్ని నిర్ణయాలను ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కరెంటు ఖాతాల నుంచి విత్డ్రాయిల్ పరిమితుల్ని పూర్తిగా ఎత్తివేసిన ఆర్బీఐ.. తాజాగా పొదుపు ఖాతాల నగదు ఉపసంహరణపై ఉన్న ఆంక్షలను కూడా త్వరలోనే ఎత్తివేస్తామని ప్రకటించింది. సేవింగ్ అకౌంట్స్ విత్డ్రా ఆంక్షలను త్వరలో ఎత్తివేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ తాజాగా తెలిపారు. బ్యాంకుల నుంచి నగదు విత్డ్రాయిల్పై ఉన్న ఆంక్షలు గురించి వివరాలు మరోసారి మీ కోసం..
♦ సేవింగ్స్ అకౌంట్కు సంబంధించి ఒకేరోజు ఖాతాదారు రూ.24,000 విత్డ్రా చేసుకోవచ్చు. అయితే వారం పరిమితి (రూ.24,000)లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. తాజా నిర్ణయం ఫిబ్రవరి 1వ తేదీ నుంచీ అమల్లోకి వస్తుంది. ఇప్పటివరకూ రోజువారీ విత్డ్రాయిల్ పరిమితి రూ. 10,000 మాత్రమే. సేవింగ్స్ ఖాతాల వారం విత్డ్రాయిల్ పరిమితుల సడలింపుపై తదుపరి రోజుల్లో సమీక్షిస్తామని ఆర్బీఐ గతంలో తెలిపింది. అతి త్వరలోనే ఈ ఆంక్షలను కూడా ఎత్తివేస్తామని తాజాగా వెల్లడించింది.
♦ ఒకేరోజు విత్డ్రాయిల్ పరిమితులను తొలగించినా... ఇందుకు సంబంధించి తగిన పరిమితులను స్థిరీకరించుకునే వెసులుబాటును బ్యాంకులకు కల్పించడం జరిగింది.
♦ ఇక కరెంట్ అకౌంట్లు, క్యాష్ క్రెడిట్ అకౌంట్లు, ఓవర్డ్రాఫ్ట్ అకౌంట్ల నుంచి నగదు ఉపసంహరణ పరిమితులను అన్నింటినీ ఆర్బీఐ తొలగించింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది. ఇప్పటివరకూ కరెంటు ఖాతాల నుంచి వారానికి రూ. 1 లక్ష మాత్రమే విత్డ్రా చేసుకోవాలనే పరిమితి వుండగా, ఇకనుంచి ఈ ఖాతాల ద్వారా ఎంతైనా తీసుకోవొచ్చు.
♦ పేమెంట్ల విషయంలో డిజిటలైజేషన్వైపు కస్టమరు నడిచేలా బ్యాంకులు తగిన ప్రయత్నాలు చేయాలని బ్యాంకుల్ని ఆర్బీఐ ఆదేశించింది.