మంత్రి టీజీ వాహనంపై చెప్పుల దాడి
రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్‌కు సమైక్యాంద్ర ఉద్యమ సెగ తగిలింది. ఆయనను సమైక్యాంధ్ర ఉద్యమకారులు అడ్డుకున్నారు. ఆయన వాహనంపై చెప్పులు, రాళ్ల వర్షం కురిపించారు. కర్నూలులోని కృష్ణదేవరాయల విగ్రహం వద్ద ఓ ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్సవానికి మంత్రి టీజీ విచ్చేశారు. ఈ విషయం తెలుసుకున్న సమైక్యాంధ్ర ఉద్యమకారులు అక్కడికి చేరుకుని ఆయనను అడ్డుకున్నారు.
సమైక్య ఉద్యమకారులపై అక్రమకేసులకు నిరసనగా వారీ ఆందోళన చేపట్టారు. ఉద్యమకారులపై పెట్టిన కేసులను ప్రభుత్వం ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. మంత్రి పదవికి టీజీ రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని నినదించారు.
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన ఉద్యమం చేస్తున్న ఉద్యోగుస్తులంతా దొంగలేనని విమర్శించారు. సమైక్యవాదంతో పోరాడుతున్న నన్ను అడ్డుకుంటారా అంటూ మండిపడ్డారు. సీమాంధ్ర ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అక్కడి వెళ్లిపోతున్న టీజీ వెంకటేష్ వాహనంపై ఆందోళకారులు రాళ్లు, చెప్పులు విసిరారు. దీంతో పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.