మీ వీపు దురద పుడితే.. మేం గోకం!
అమెరికా పర్యటనకు వెళ్లి, అక్కడి వాళ్లను పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానించి, ప్రభుత్వంతో కూడా విస్తృతస్థాయి చర్చలు జరిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సిరియాలో ఐఎస్ మీద దాడుల విషయంలో మాత్రం తన విధానాన్ని కుండ బద్దలుకొట్టినట్టు చెప్పేశారు. దాడులకు తాము ఎలాంటి సాయం చేయబోమని, అయితే ఉగ్రవాదం మీద పోరాటానికి మాత్రం తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
90 నిమిషాల పాటు సాగిన ద్వైపాక్షిక చర్చల్లో ఉగ్రవాదం వల్ల తలెత్తుతున్న సమస్యలపై కూడా మోదీ చర్చించారు. అంతర్జాతీయ అంశాల్లో చాలా సంక్లిష్టత ఉంటుందని, తాము ప్రస్తుతం దక్షిణాసియాతో పాటు పశ్చిమాసియాలో వస్తున్న ఉగ్రవాద సవాళ్లపై కూడా చర్చించామని ఆయన అన్నారు. ఉగ్రవాద, నేర నెట్వర్కుల స్వర్గధామాలను కూల్చేయడానికి సంయుక్తంగా ప్రయత్నాలు చేయడానికి అమెరికా, భారత్ అంగీకరించినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. సిరియా మీద దాడుల విషయంలో మాత్రం భారత్ కలగజేసుకోదని విదేశాంగ శాఖ సీనియర్ అధికారి విక్రమ్ దొరైస్వామి తెలిపారు.