attacks on Dalit
-
రేపు అంబేడ్కర్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో దళితులపై జరిగిన దాడులు, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ జరిగిన అకృత్యాలపై నిరసన తెలుపుతూ ఈ నెల 31న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అంబేడ్కర్ విగ్రహాలకు క్షీరాభిషేకం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లు ప్రకటించారు. అలాగే, సెప్టెంబర్ మొదటి వారంలో అన్ని జిల్లాలకు వెళ్లి దళిత మేధావులు ప్రజాసంఘాలు, సోషల్ ఆర్గనైజర్లతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. చంద్రబాబు పాలనలో దళితుల పట్ల అమానవీయంగా వ్యవహరించిన తీరు, దళితులపై జరిగిన దాడులు, సాంఘిక వెలివేతలు, రాజ్యాంగం కల్పించిన హక్కులను నీరుగార్చిన వైనంపై చర్చిస్తామని వారు చెప్పారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. పద్నాలుగేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు.. తన హయాంలో దళితులపట్ల అరాచకాలకు పాల్పడ్డారన్నారు. తమ పార్టీ ఆధ్వర్యంలో ‘దళితులూ వర్సెస్ చంద్రబాబు’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేపడతామన్నారు. వీరిరువురూ ఇంకా ఏమన్నారంటే.. ► దళితులకు, అణగారిన వర్గాలకు వైఎస్ జగన్ సర్కారు అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు చంద్రబాబు అకృత్యాలను ప్రజల ముందుంచుతాం. ► చంద్రబాబు తొలి నుంచీ దళిత వ్యతిరేకి. అధికారంలో ఉన్నపుడు దళితులపట్ల చులకనగా వ్యవహరించి, ఇప్పుడు వారిపై మొసలికన్నీరు కారుస్తున్నారు. ► చంద్రబాబు నాయుడు హయాంలో.. దళి తులపై అకృత్యాల విషయంలో ఏపీ నాలుగో స్థానంలో వుంది. ► తూర్పు గోదావరి, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో దళితులపై జరిగిన దాడుల్లో బాధ్యులపై సీఎం జగన్ కఠిన చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు ఏనాడైనా ఇలా స్పందించారా? ► రాష్ట్రంలో పేద వర్గాలకు జగన్ సంకల్పించిన మేలును అడ్డుకుంటున్న చంద్రబాబు దుష్ట ఆలోచనలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తాం. చంద్రబాబు తీరుపై ఆగ్రహం వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ జిల్లాల ఎస్సీ సెల్ అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సమావేశమై వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటివరకు దళితులకు, బడుగు, బలహీనవర్గాలకు అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు.. దళితులపై దాడులు జరుగుతున్నాయంటూ చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై చర్చించారు. దళిత వ్యతిరేకి అయిన చంద్రబాబు ఒక్కసారిగా దళితులపై ప్రేమను కనబరుస్తుండడంపై సమావేశంలో పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేలు కె. రక్షణనిధి, పి. జగన్మోహన్ రావు, కైలే అనిల్‌కుమార్, ఎలీజా, కంబాల జోగులు, కిలివేటి సంజీవయ్య, టీజేఆర్ సుధాకర్‌బాబు, తలారి వెంకట్రావు, ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ పెదపాటి అమ్మాజీ, ఎస్సీ సెల్ నాయకులు క్రిస్టీనా, కాలే పుల్లారావు, డేవిడ్ రాజు పాల్గొన్నారు. -
దళితులపై దాడికి మరోసారి నాని అనుచరుల యత్నం
తిరుపతి రూరల్: పులివర్తి నాని అనుచరులు దళితుడిపై దాడి చేసి మూడు రోజులు అవుతున్నా నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నాయకులు, దళితులు గురువారం తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీ ఓటేరులో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంబేడ్కరా.. నువ్వు రాసిన రాజ్యాంగాన్ని నువ్వే కాపాడు, దళితులకు రక్షణ కల్పించు అంటూ వేడుకున్నారు. ఆ సమయంలో పులివర్తి నాని అనుచరులు పలు వాహనాల్లో అక్కడికి చేరుకున్నారు. వినతి పత్రాలతో ఏం పీకుతారురా? ప్రభుత్వం మాదిరా.. మొన్న వాడిని తన్నినా మీకు బుద్ధిరాలేదా? మరో నిమిషం ఇక్కడే ఉంటే మిమ్మల్ని తరిమికొడతాం.. అంటూ హెచ్చరించారు. వినతి పత్రం అందించేందుకు వచ్చిన వారిపై పోలీసుల సమక్షంలోనే దాడికి యత్నించారు. శాంతియుతంగా కార్యక్రమం చేసుకుంటుంటే దౌర్జన్యానికి పాల్పడడం మంచిది కాదని పోలీసులు నిలదీశారు. నాని అనుచరులు పోలీసులతోనూ దురుసుగా ప్రవర్తించారు. మాకే నీతులు చెబుతారా? అంటూ దుర్భాషలాడారు. నిరసన తెలుపుతున్న వారిపై దాడికి యత్నించారు. చివరి నిమిషంలో పరిస్థితిని గమనించిన పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా వారు దాడికి తెగబడేవారే. నాని అనుచరుల వ్యవహార శైలిని చూసిన పోలీసులు, పరిస్థితి చేయి దాటుతుందని అప్రమత్తమయ్యారు. వారిని బలవంతంగా పక్కకు తీసుకెళ్లారు. దళితులు, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నాయకులపై నాని అనుచరులు దౌర్జన్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ఈ దౌర్జన్యాలు ఏమిటని అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు రాకపోతే మా పరిస్థితి ఏమిటి? దళితులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవా లని శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం. ఇంతలోనే నాని అనుచరులు మాపై దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించారు. కులం పేరుతో దూషించా రు. పోలీసులు లేకపోతే మాపైనా దాడి చేసేవారు. వీరి దౌర్జన్యాలు చూస్తుంటే అసలు ప్రజాస్వామ్యం లో ఉన్నామా? అని సందేహంగా ఉంది. ప్రశాంత చంద్రగిరిలో రౌడీ రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. దౌర్జన్యం చేసిన వారితోపాటు చేయిం చిన వారిపైనా చర్యలు తీసుకోవాలి. లేకుంటే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలను ఉద్ధృతం చేస్తాం. – దామినేటి కేశవులు, మల్లారపు వాసు,వెంకటరమణ, వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ నాయకులు అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు తిరుచానూరు: శాంతియుతంగా అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేస్తున్న తమపై దౌర్జన్యానికి పాల్పడి కులం పేరుతో దూషించిన పులిపర్తి నాని అనుచరులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు, జిల్లా దళిత నాయకుడు మల్లారపు వాసు పోలీసులను కోరారు. వారు గురువారం రాత్రి తిరుచానూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ చంద్రగిరి మండలంలోని మొరవపల్లికి చెందిన దళితుడు రవిని పులివర్తి నాని అనుచరులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని పేర్కొన్నారు. దీనికి నిరసనగా గురువారం ఉదయం తిరుపతి రూరల్ మండలం ఓటేరు గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి వినతి పత్రం అందజేసినట్టు తెలిపారు. ఆ సమయంలో పులివర్తి నాని అనుచరులు, టీడీపీ తిరుపతి రూరల్ అధ్యక్షుడు చెరుకుల జనార్దన్ యాదవ్, ఇస్మాయిల్‌తో పాటు మరికొందరు తమపైకి దూసుకొచ్చారని పేర్కొన్నారు. కులం పేరుతో దుర్భాషలాడారని తెలిపారు. మిమ్మల్ని చంపేస్తామంటూ బెదిరించారని వాపోయారు. అక్కడే ఉన్న పోలీసులు చొరవ తీసుకుని తమకు రక్షణ కల్పించి, వారిని అక్కడి నుంచి పంపించారని వివరించారు. పులివర్తి నాని అనుచరుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి న్యాయం చేయాలని కోరారు. -
జాలి చూపడం కాదు.. చర్యలు తీసుకోండి!
న్యూఢిల్లీ: దేశంలో దళితులపై జరుగుతున్న అకృత్యాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంటులో ఓ ప్రకటన చేయాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. దళితులపై దాడుల విషయమై ప్రధాని మోదీ వ్యాఖ్యలు కంటితుడుపు చర్యలేనని, రాజకీయంగా నష్టనివారణ చర్యల్లో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ఆమె తప్పుబట్టారు. గురువారం పార్లమెంటు వెలుపల మాయావతి విలేకరులతో మాట్లాడారు. వేముల రోహిత్ ఆత్మహత్య, ఉనాలో దళితులపై దాడి, ఇతర దాడుల నేపథ్యంలో బీజేపీపై రాజకీయంగా ప్రభావం పడే అవకాశం ఉండటంతోనే ప్రధాని మోదీ స్పందించారని మాయావతి అన్నారు. 'దళితుల విషయంలో జాలి చూపించడం కాదు. వారిపై అరాచకాలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవడంపై ప్రధాని దృష్టి సారించాలని బీఎస్పీ కోరుకుంటోంది' అని ఆమె పేర్కొన్నారు.