జాడలేని అత్తార్, యామినీ
సాక్షి, అనంతపురం: సార్వత్రిక సంగ్రామంలో ఒక ఘట్టం ముగిసింది. వైఎస్సార్సీపీ, టీడీపీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అయితే ఇప్పటి వరకూ ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేదు. బుధవారం నాటికి అభ్యర్థులందరికీ భీ–ఫారంలు అందాయి. దీంతో ముహూర్తాలు చూసుకుని ఎవరికి వారు ఆర్భాటంగా నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆపై ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. టిక్కెట్లు దక్కిన వారు ఎన్నికల హడావుడిలో ఉంటే టిక్కెట్లు దక్కని వారు మాత్రం భవిష్యత్తు పరిణమాలపై ఆలోచిస్తున్నారు. మొత్తంగా ఎన్నికల సంగ్రామం ఇక మరింత వేడెక్కనుంది.
అభ్యర్థులంతా ఖరారు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచే పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులను ఒకేజాబితాలో ఆపార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. మరోవైపు రెండు విడతల్లో 9 మంది అసెంబ్లీ అభ్యర్థులను, మూడో విడతలో 5 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు.
13 రోజుల్లోనే టీడీపీకి గుప్తా బైబై
గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా ఏడాదిగా టీడీపీతో నడుస్తున్నారు. పార్టీలో చేరకపోయినా...టీడీపీ ముఖ్య కార్యక్రమాలన్నింటిలో పాల్గొంటున్నారు. ఎట్టకేలకు ఇటీవలే అమరావతిలో చంద్రబాబు చేత పచ్చకండువా వేయించుకున్నారు. ఎంపీ జేసీ సిఫార్సుతో గుంతకల్లు టిక్కెట్ తనకే వస్తుందనే ధీమాతో ఉన్నారు. ఈ మేరకే జేసీ దివాకర్‌రెడ్డి కూడా పావులు కదిపారు. శింగనమల, కళ్యాణదుర్గం, గుంతకల్లు సిట్టింగ్‌లను మారిస్తేనే పోటీచేస్తానని చంద్రబాబును బ్లాక్మెయిల్ చేశారు. దీంతో చంద్రబాబు ‘అనంత’ పార్లమెంట్‌లోని కీలక నేతలతో మాట్లాడారు.
జేసీతో తమకు రాజకీయ అవసరం లేదని, అవసరమైతే ఎంపీ టిక్కెట్ మార్చినా ఎలాంటి ఇబ్బంది లేదని వారు చెప్పారు. పైగా గుంతకల్లు సీటు మారిస్తే రాయదుర్గం మినహా అంతా అగ్రవర్ణాలే అవుతారని చెప్పారు. దీంతో జేసీ బ్లాక్ మెయిల్‌కు చంద్రబాబు గట్టిగానే స్పందించారు. గుంతకల్లులో సిట్టింగ్‌ను మార్చే ప్రసక్తే లేదని, ఇప్పటికే మీ సిఫార్సులను పరిగణలోకి తీసుకోవడంతో పార్టీకి నష్టం వాటిల్లిందని, ఆపై మీ ఇష్టం అని జేసీకి తేల్చి చెప్పారు. అంతేకాకుండా వెంటనే గౌడ్‌కు టిక్కెట్ కేటాయించారు. జేసీని నమ్ముకుని రాజకీయంగా ‘రాంగ్‌స్టెప్’ వేశానని గ్రహించిన గుప్తా.. హుటాహుటిన హైదరాబాద్‌కు వెళ్లి జనసేన పార్టీలో చేరారు. 13 రోజుల్లోనే టీడీపీని వీడిన గుప్తా జనసేన తరఫున పోటీ చేయనున్నారు.
రెండో రోజూ సురేంద్ర అనుచరులు ఆందోళన
కళ్యాణదుర్గం టిక్కెట్ ఆశించి భంగపడిన అమిలినేని సురేంద్రబాబు అనుచరులు రెండోరోజు ఆందోళన చేశారు. కళ్యాణదుర్గంలో డమ్మీ అభ్యర్థి ఉమాను పక్కనపెట్టి సురేంద్రకు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ నెల 22న ఉరవకొండ ఇండిపెండెంట్‌గా సురేంద్రతో నామినేషన్ వేయిస్తామని హెచ్చరించారు. ఇకపోతే అనంతపురంలో టీడీపీ కార్పొరేటర్లు లాలెప్ప, దుర్గేష్‌లతో పాటు వెంకట ప్రసాద్(ఇండిపెండెంట్) కూడా నేడు వైఎస్సార్సీపీలో చేరనున్నారు.
ప్రచార పర్వంలో అభ్యర్థులు
టిక్కెట్ దక్కించుకున్న నేతలు ప్రచారాన్ని ప్రారంభించారు. ఇప్పటికే వైఎస్సార్సీపీతో పాటు టీడీపీ నేతలు ప్రచారాన్ని సాగిస్తున్నారు. చంద్రబాబు చేసిన అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని టీడీపీ నేతలు అభ్యర్థిస్తుంటే, చంద్రబాబు రాష్ట్రానికి, జిల్లాకు చేసిన అన్యాయంపై తీర్పు ఇవ్వాలని... రాజన్న రాజ్యం రావాలంటే ‘ఫ్యాన్’ గుర్తుకు ఓటేయాలని వైఎస్సార్ సీపీ నేతలు అభ్యర్థిస్తున్నారు. ప్రచారానికి సమయం తక్కువగా ఉండటంతో నేతల సతీమణులు, పిల్లలు సకుటుంబసపరివారసమేతంగా ప్రచారం సాగిస్తున్నారు. మరో ఐదురోజుల్లో నామినేషన్ల పర్వం ముగియనుంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తించనున్నారు.
జాడలేని అత్తార్, యామినీ
టీడీపీ తరఫున టిక్కెట్లు దక్కని అత్తార్‌చాంద్‌బాషా, యామినీబాల అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మంత్రి పదవి ఆశచూపడంతో వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరానని, ఇప్పుడు టిక్కెట్ లేకుండా చంద్రబాబు మోసం చేశారని అత్తార్ తన అనుచరుల వద్ద బోరుమంటున్నారు. మోసం చేసిన టీడీపీని వీడాలని తన అనుచరులతో చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు యామినీబాలదీ ఇదే పరిస్థితి. దివాకర్‌రెడ్డి తమను మోసం చేశారని ఆమె విలపిస్తున్నారు.
తమపై చంద్రబాబుకు తప్పుడు సమాచారం ఇచ్చారని వాపోతున్నారు. శింగనమలలో శ్రావణికి తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదని, ఎన్నికల్లో ఆమె ఓటమి ఖాయమని తనకు ఫోన్ చేసిన వారితో చెబుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రఘువీరారెడ్డికి సాయం చేయడం కోసం డమ్మీ అభ్యర్థిగా ఉమాను బరిలోకి దింపి తనకు టిక్కెట్ ఇవ్వకపోవడంపై ‘ఉన్నం’ కూడా తీవ్రంగానే స్పందించారు. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన ‘ఉన్నం’ స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. చంద్రబాబు తనను మోసం చేశారని, తనను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.