
మైండ్ గేమ్ ఆడుతున్నారు..!
*చివరి వరకు వైఎస్ జగన్ వెంటే ఉంటా..
*ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే అవాస్తవాల ప్రచారం
*కదిరి శాసన సభ్యుడు అత్తార్ చాంద్‌బాషా
కదిరి : 'ఓటమిని జీర్ణించుకోలేని కొందరు నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారు. లేనిపోని కథనాలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. నేను టీడీపీలో చేరబోతున్నానంటూ మంగళవారం ఓ దినపత్రిలో కథనం ప్రచురించడం కూడా ఇందులో భాగమే. ఈ కథనం పూర్తిగా వాస్తవ విరుద్ధం’ అంటూ కదిరి శాసన సభ్యులు అత్తార్ చాంద్‌బాషా ఖండించారు. అత్తార్ రెసిడెన్సీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ప్రజా సేవ లక్ష్యంతో టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిన తనను నమ్మి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు టికెట్ ఇచ్చారని, ప్రజలు సైతం తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించారన్నారు. వారి నమ్మకాన్ని ఎన్నటికీ వమ్ము చేయనన్నారు. రాజకీయాల్లో ఉన్నంతవరకు జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటానని, కదిరి నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేశారు. మంత్రి పదవుల కంటే వ్యక్తిత్వమే తనకు ముఖ్యమన్నారు.
చేతనైతే అభివృద్ధి విషయంలో తనతో కలసిరావాలి కానీ, అవాస్తవాల ప్రచారంతో చిల్లర రాజకీయాలు చేయడం తగదన్నారు. ఇలాంటి విషయాలను పట్టించుకునేది లేదన్నారు. అందరి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ప్రస్తుతం తనముందున్న కర్తవ్యమన్నారు.