కోర్టు ధిక్కారం
- హైకోర్టులో హాజరైన కలెక్టర్ వీరపాండ్యన్
- తదుపరి విచారణకూ రావాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్ : కోర్టు ధిక్కార కేసులో అనంతపురం జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ శుక్రవారం హైకోర్టుకు హాజరయ్యారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఉండగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పూర్తిగా అమలు చేయకపోవడంతో ది ఇండియన్ ఫ్యామ్ ఫైప్ కోల్ లిమిటెడ్ అనే కంపెనీ దాఖలు చేసిన కోర్టు ధిక్కార కేసులో ఆయన న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు ఎదుట హాజరయ్యారు. తాను విజయవాడ కార్పొరేషన్ కమిషనర్‌గా ఉండగా కోర్టు ఆదేశాల మేరకు కొంత మేర బిల్లు మంజూరు చేశామని, ప్రస్తుతం అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ఉన్నందున తాజా పరిస్థితిని విజయవాడ కార్పొరేషన్ కమిషనర్‌తో మాట్లాడి కోర్టుకు తెలియజేస్తానని ఆయన తరపున ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కోర్టుకు తెలిపారు. స్వయంగా కోర్టుకు హాజరుకావాలన్న ఉత్తర్వులను రద్దు చేయాలని ఆయన చేసిన అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. జూలై 6న జరిగే తదుపరి విచారణకు కూడా స్వయంగా కలెక్టర్ కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు. గత ఆదేశాలు అమలు కాకపోవడానికి కారణాలు తెలియజేయాలని, పూర్తి వివరాలతో విచారణకు హాజరుకావాలన్నారు.