అతుల్ వర్మకు కాంస్యం
భారత్ ఖాతాలో రెండో పతకం యూత్ ఒలింపిక్స్
నాన్జింగ్ : చైనాలో జరుగుతున్న యూత్ ఒలింపిక్స్‌లో భారత్ ఎట్టకేలకు మరో పతకం సాధించింది. వ్యక్తిగత రికర్వ్ ఆర్చరీ ఈవెంట్లో అతుల్ వర్మ కాంస్యం దక్కించుకున్నాడు. మంగళవారం హోరాహోరీగా జరిగిన ఈ పోటీలో వర్మ 6-4 తేడాతో టర్కీకి చెందిన మెటే గజోజ్ను ఓడించాడు. రెండో సీడ్ అతుల్ వర్మ తన తొలి ఆరు బాణాలతో ఐదుసార్లు 10 పాయింట్లు సాధించి 4-0 ఆధిక్యం సాధించాడు.
మూడో సెట్లో కాస్త ఏకాగ్రత కోల్పోయిన వర్మ మూడుసార్లు 9పాయింట్లు సాధించి స్కోరును సమం చేశాడు. చివరిదైన ఐదో సెట్లో గజోజ్ 29 పాయింట్లు సాధించి ఒత్తిడి పెంచినా తన చివరి బాణంతో వర్మ 10 పాయింట్లు సాధించి కాంస్యాన్ని నెగ్గాడు. దీంతో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. గత గురువారం తెలుగు తేజం రాగాల వెంకట్ రాహుల్ వెయిట్ లిఫ్టింగ్‌లో రజతం సాధించిన విషయం తెలిసిందే.
ఆర్మీ వెతికిపట్టింది..
ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన 17 ఏళ్ల అతుల్ యూత్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించాడు. తండ్రి వ్యవసాయదారుడు. చిన్నప్పటి నుంచీ విలు విద్యపై ఆసక్తి పెంచుకున్న అతుల్ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాడు. రెండేళ్ల క్రితం యూపీ తరఫున వారణాసిలో జాతీయ సబ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో అతుల్ పాల్గొన్నాడు. దేశవ్యాప్తంగా టాలెంట్ సెర్చ్ చేస్తున్న ఆర్మీ అధికారులు ఆ పోటీలకు వెళ్లారు. పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ (ఏఎస్ఐ) మిషన్ ఒలింపిక్స్ పేరుతో భారత్‌కు ఒలింపిక్స్‌లో పతకాలు పెంచాలనే ఉద్దేశంతో టాలెంట్ సెర్చ్ చేసింది.
ఆర్మీ అధికారులు దృష్టిలో పడటంతో అతుల్ కెరీర్ ఒక్కసారిగా వేగం పుంజుకుంది. ఏఎస్ఐలో స్పోర్ట్స్ క్యాడెట్‌గా చేరిన అతుల్‌కు అక్కడ స్కాలర్షిప్ ఇచ్చారు. ఆర్చరీ కోచ్ సుబేదార్ రవి శంకర్ శిక్షణతో మరింత రాటుదేలాడు. గత నెలలో చైనీస్ తైపీలో జరిగిన ఆసియా గ్రాండ్‌ప్రి ఈవెంట్లో రజతం సాధించి... ప్రస్తుత యూత్ ఒలింపిక్స్‌లో వ్యక్తిగత రికర్వ్ విభాగంలో బరిలోకి దిగాడు.
పతకం సాధించిన ఉత్సాహంతో ఉన్న అతుల్ రెండు నెలల అనంతరం ఆర్మీలోనే జూనియర్ కమిషన్ ఆఫీసర్‌గా ఉద్యోగం సంపాదించనున్నాడు. ‘అతుల్లో సహజ నైపుణ్యం ఉంది. ఏదైనా విషయాన్ని చాలా తొందరగా నేర్చుకుంటాడు. ఈ పతకం తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆర్మీలో ఉద్యోగం వల్ల జీవితం గురించి భయం, ఆందోళన ఉండవు. పూర్తిగా ఆట మీద ఏకాగ్రత పెట్టొచ్చు. భవిష్యత్‌లో ఒలింపిక్స్‌లో పతకం సాధించే స్థాయికి అతుల్ ఎదుగుతాడనే నమ్మకం ఉంది’ అని కోచ్ శంకర్ ‘సాక్షి’తో చెప్పారు.
-సాక్షి క్రీడా విభాగం