ఐటీ ఉచ్చులో మరో ఐఏఎస్ అధికారి
ముగ్గురు శేఖర్‌రెడ్డి అనుచరుల అరెస్ట్
చెన్నై: ఐటీ అధికారుల ఉచ్చులో మరో ఐఏఎస్ అధికారి పడిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పల్లవరంలో నివసిస్తున్న తమిళనాడు గోడౌన్స్ మేనేజింగ్ డైరెక్టర్ నాగరాజన్ ఇంటిపై 3 రోజుల క్రితం ఐటీ అధికారులు దాడులు నిర్వహించి లెక్కల్లో చూపని రూ.1.5 కోట్ల కొత్త కరెన్సీ, 6 కిలోల బంగారం ఆస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక మంత్రికి నాగరాజన్ సన్నిహితుడు కావడంతో ఆ మంత్రి సొమ్ము ఇంకా ఉండొచ్చని ఐటీ అధికారులు అనుమానిస్తున్నా రు.
కాగా, శేఖర్‌రెడ్డి బృందంలోని ఆడిటర్ ప్రేమ్ కుమార్ రెడ్డి, ఇసుక కాంట్రాక్టర్ దిండుగల్లు రత్నం, పుదుకోట్టై రామచంద్రన్‌లను సీబీఐ అధికారులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. శేఖర్‌రెడ్డి, శ్రీనివాసులను అరెస్ట్ చేసి ఎగ్మూరులోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరు పరచగా వచ్చేనెల 3వ తేదీ వరకు రిమాండ్ విధించింది. శేఖర్‌రెడ్డిని 15 రోజులు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగనుంది.