ఆసీస్ కు మరో ఎదురుదెబ్బ
లండన్: ఇంగ్లండ్ లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆటకు దూరం కాగా, తాజాగా సీనియర్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్, ఫాస్ట్ బౌలర్ నాథన్ కౌల్టర్-నిలె కూడా గాయాలతో సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. వీరిద్దరి స్థానంలో పీటర్ హ్యాండ్స్ కొబ్, జాన్ హాస్టింగ్స్ లను జట్టులోకి తీసుకున్నారు.
ఐదు వన్డేల సిరీస్ లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్ ల్లోనూ నెగ్గి ఆసీస్ దూకుడు మీద ఉంది. ఇలాంటి సమయంలో కీలక ఆటగాళ్లు గాయాలబారిన పడడం ఆస్ట్రేలియా టీమ్ ను కలవరపరుస్తోంది. వార్నర్, వాట్సన్, కౌల్టర్ లేకపోవడం తమకు ప్రతికూలం అయినప్పటికీ ప్రతిభ ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేయడం ద్వారా వారి స్థానాన్ని భర్తీ చేశామని ఆసీస్ కోచ్ డారెన్ లెహమాన్ తెలిపారు. కాగా, టెస్టు క్రికెట్ కు వాట్సన్ ఆదివారం గుడ్ బై చెప్పాడు.