మొబైల్ ఫోన్లతో ఆ ముప్పులేదు!
మెల్ బోర్న్: మొబైల్ ఫోన్స్ వాడితే చాలా రకాల సమస్యలు ఎదురవుతాయని యూజర్లు భావిస్తుంటారు. అయితే ఈ విషయంపై ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసి వాటి ఫలితాలను వెల్లడించారు. మొబైల్ ఫోన్లు వాడకానికి బ్రెయిన్ క్యాన్సర్ కు అసలు సంబంధమే లేదని తేల్చేశారు. ఫోన్లు వాడకం వల్లే బ్రెయిన్ క్యాన్సర్ రావడం లాంటివి జరగవని తెలిపారు. 20 వేల మంది పురుషులు, 14వేల మంది స్త్రీలను సంప్రదించి కొన్ని ప్రశ్నలు వేసి ఈ విషయాలను నిర్ధారించుకున్నారు.
1982-2012 మధ్య బ్రెయిన్ క్యాన్సర్ బారిన పడ్డ ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తుల వివరాలు, 1987-2012 మధ్య కాలంలో మొబైల్ ఫోన్లు వాడుతున్న వారి డేటాను సిడ్నీ రీసెర్చర్స్ సేకరించారు. ఈ డేటాను పరిశీలించగా ఫోన్ల వాడకం వల్ల బ్రెయిన్ క్యాన్సర్ పెరుగుతుందన్న సూచనలు తమకు కనిపించలేదని రీసెర్చ్ బృందం వెల్లడించింది. 60,70 ఏళ్ల వయసున్న వారిలో మాత్రమే బ్రెయిన్ క్యాన్సర్ లక్షణాలు కనిపించాయట. మొబైల్ ఫోన్ల వాడకం వల్ల చాలా తక్కువ శక్తి విడుదలవుతుందని దానివల్ల మనకు జరిగే నష్టమేంలేదని తాజా సర్వేలో వెల్లడైంది.