పోలీస్ ఆపరేషన్ లో 13మంది జిహాదీల అరెస్ట్
వియన్నా: తీవ్రవాద సంస్థలు తమ కార్యకలాపాల కోసం యువకులకు జిహాదీలో చేరేలా ప్రేరేపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్రవాద చర్యలను అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగం పెద్దఎత్తునా ఆపరేషన్ను మొదలుపెట్టింది. ఆస్ట్రియాలో జిహాదీలుగా అనుమానించిన 13మందిని ఆస్ట్రియన్ పోలీసు అధికారులు అరెస్ట్ చేశారు. సిరియా సరిహద్దు ప్రాంతంలో తీవ్రవాద సంస్థల వద్ద యువకులు జిహాదీ శిక్షణ తీసుకుంటున్నారనే అనుమానంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. జిహాదీలుగా అనుమానించిన 16మందిని లక్ష్యంగా పోలీసులు ఈ అపరేషన్ను మొదలుపెట్టారు. దీనిలో భాగంగా అనుమానిత ప్రాంతాల్లోని ఇళ్లలో సోదాలు జరిపారు.
ఈ ఆపరేషన్లో దాదాపు 900 మంది పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సూచించిన దానిప్రకారం.. అనేకమంది యువకులు జిహాదీలో చేరుతున్నట్టు సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు జరిపారు. సోదాలు చేసిన ఇళ్లలో ఉగ్రవాదుల సంబంధిత వస్తువులతోపాటు డేటా స్టోరేజ్ డివైజ్లు, నగదు, బ్రెస్ నక్లెస్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.