austronats
-
నేడు సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
న్యూఢిల్లీ : భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకు సమయం ఆసన్నమైంది. భారత కాల మానం ప్రకారం ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి బోయింగ్ స్టార్‌లైనర్ రాకెట్లో ఈ రోజు రాత్రి 10 గంటల సమయంలో అంతరిక్షంలోకి బయలు దేరనున్నారు. అంతరిక్షంలో లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కి వ్యోమగాములను చేరవేసే ప్రాజెక్ట్‌పై బోయింగ్ స్టార్‌లైనర్ పనిచేస్తోంది.ప్రాజెక్ట్‌లో భాగంగా బోయింగ్ స్టార్‌లైన్ రాకెట్లో అంతరిక్షంలోకి వెళ్లే సునీతా విలియమ్స్‌తో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు ఐఎస్ఎస్కు చెందిన హార్మోనీ మాడ్యుల్ సబ్‌సిస్టమ్స్ పనితీరుపై వారం రోజుల పాటు పనిచేయనున్నారు. ఈ పర్యటన విజయవంతమైతే అంతరిక్ష కేంద్రానికి సిబ్బందితో కూడిన మిషన్ల కోసం స్టార్ లైనర్ను సర్టిఫై చేసే ప్రక్రియను నాసా ప్రారంభిస్తుంది. ఇప్పటివరకు ఎలోన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ నాసా సర్టిఫై అయింది. స్టార్ లైనర్ వ్యోమనౌక అంతరిక్ష యాత్ర కూడా విజయవంతమైతే స్పేస్ ఎక్స్ జాబితాలో చేరిపోనుంది.బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌక ప్రయోగం గత నెల 7న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆ రాకెట్‌ను నింగిలోకి పంపే రెండుగంటల ముందు వాల్వ్‌లో సమస్య తలెత్తడంతో.. కౌంట్‌డౌన్‌ను నిలిపివేశారు. దీంతో భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీతా, బుచ్ విల్ మోర్ల అంతరిక్షయానం వాయిదా పడింది. తాజాగా భారత కాలమానం ప్రకారం ఈ రోజు సాయంత్రం 10గంటలకు ప్రారంభం కానుంది. 2006లో సునీతా విలియమ్స్ తన తొలి రోదసి యాత్రను చేపట్టారు. ఆ తర్వాత 2012లో రెండో సారి అంతరిక్షంలోకి వెళ్లారు. తాజాగా మరోసారి వెళ్లేందుకు సన్నద్దం అవుతున్నారు. -
బంగారం.. నీ ప్రేమ కోసం అంతరిక్షం నుంచి భూమ్మీదకు వస్తా!
టోక్యో: ప్రేమ పేరుతో జపాన్ మహిళను మోసం చేశాడు ఓ వ్యక్తి. తాను రష్యా వ్యోమగామినని, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్సీ)లో పని చేస్తున్నాని చెప్పి నమ్మించి బురిడీ కొట్టించాడు. మహిళను తాను ప్రాణంగా ప్రేమిస్తున్నాని చెప్పాడు. అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీని ఖర్చుల కోసం ఆమె వద్ద నుంచి 4.4 మిలియన్ యెన్(రూ.25లక్షలు) వసూలు చేశాడు. అంతటితో ఆగకుండా పదే పదే డబ్బులు అడగడంతో ఆమెకు అనుమానం వచింది. ఆ తర్వాత అసలు విషయం తెలిసి కంగుతింది. ఈ జపాన్ మహిళ వయసు 65 ఏళ్లు. ఈమెకు ఇన్‌స్టాగ్రాంలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తాను ఐఎస్సీలో పనిచేస్తున్నట్లు చెప్పాడు. జూన్‌లో ఇందుకు సంబంధించి ఫోటోలు పెట్టాడు. ప్రొఫైల్ పిక్చర్ కూడా మార్చాడు. ఇవి చూసి అతడు నిజంగా వ్యోమగామి అని మహిళ నమ్మింది. ఇద్దరూ తరచూ చాట్ చేసుకున్నారు. ఆ తర్వాత వీరి సంభాషణ ఇన్స్టాగ్రాం నుంచి జపాన్ సోషల్ మీడియా యాప్ 'లైన్'కు మారింది. ఇందులోనే మహిళను ప్రాణంగా ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకొని జీవితాంతం తోడుగా ఉండాలని ఉందని చెప్పాడు. దీంతో ఆమె అతడ్ని గుడ్డిగా నమ్మింది. అయితే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగి భూమ్మీదకు రావాలంటే ఖర్చవుతుందని రూ.25లక్షలు పంపాలని మహిళను అతను కోరాడు. అతడ్ని నమ్మిన ఆమె రూ.25లక్షలు ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 5 మధ్య ఐదు విడతల్లో పంపింది. అయినా అతను ఇంకా డబ్బు కావాలని అడిగాడు. దీంతో అనుమానం వచ్చిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతను వ్యోమగామి కాదని, మోసం చేశాడని తెలిసింది. పోలీసులు ఈ కేసును 'ఇంటర్నేషనల్ రోమాన్స్ స్కామ్'గా ట్రీట్ చేసి విచారణ చేపట్టారు. చదవండి: Viral Video: నడిరోడ్డుపై దిండు వేసుకుని పడుకుని హల్చల్ -
ఇన్స్పిరేషన్–4 ప్రయోగం సక్సెస్: అంతరిక్షం ఇక అందరిదీ
కేప్ కెనవెరాల్: మూడు రోజుల పాటు ముచ్చటగా సాగిన ప్రైవేటు వ్యక్తుల రోదసి యాత్ర విజయవంతంగా ముగిసింది. అపర కుబేరుడు జేర్డ్ ఐసాక్‌మ్యాన్ నేతృత్వంలో నలుగురు పర్యాటకులతో 3 రోజుల క్రితం అంతరిక్షంలోకి వెళ్లిన స్పేస్ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక సురక్షితంగా భూమికి చేరింది. ఫ్లోరిడా తీరంలోని అట్లాంటిక్ మహా సముద్రంలో శనివారం సాయంత్రం స్పేస్ఎక్స్ క్యాప్సుల్ సురక్షితంగా ల్యాండ్ అయింది. ఇన్స్పిరేషన్–4 పేరుతో నిపుణులైన వ్యోమగాములెవరూ లేకుండా సాధారణ పౌరులతో కూడిన ఈ యాత్ర విజయవంతం కావడంతో భవిష్యత్‌లో మరిన్ని పర్యాటక రోదసి యాత్రలకు బాటలు వేసినట్టయింది. ఈ యాత్రని స్పాన్సర్ చేసిన ఐసాక్ మ్యాన్ స్పేస్ఎక్స్కు ఎంత చెల్లించారో వెల్లడించలేదు. స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ తమ కంపెనీ రాకెట్ ద్వారా మొదటిసారి పర్యాటకుల్ని పంపిన ఘనతని సాధించారు. స్పేస్ఎక్స్ క్యాప్సుల్ సురక్షితంగా భూమ్మీదకి చేరగానే ‘‘మీ మిషన్‌తో అంతరిక్షం మన అందరిదీ’’అన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పినట్టయిందని స్పేస్ఎక్స్ మిషన్ కంట్రోల్ నినదించింది. ఈ ప్రయాణంలో వారు తినడానికి కోల్డ్ పిజ్జా, శాండ్విచెస్, పాస్తా, గొర్రె మాంసం తీసుకువెళ్లారు. పారాచ్యూట్ల సాయంతో నీటిపైకి దిగుతున్న క్యాప్సుల్ అంతరిక్షం ఓ అద్భుతం అమెరికాలోని ఫ్లోరిడాలో కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం రాత్రి స్పేస్ఎక్స్కు చెందిన వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లింది. 585 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ చక్కర్లు కొట్టింది. ఈ క్యాప్సుల్‌కి అతిపెద్ద బబుల్ ఆకారంలో ఉన్న కిటికీని అమర్చారు. ఈ గాజు కిటికీ ద్వారా అందులో ప్రయాణించిన జేర్డ్ ఐసాక్‌మ్యాన్, కేన్సర్ నుంచి కోలుకున్న హేలి అర్సెనాక్స్, డేటా ఇంజనీర్ క్రిస్ సెంబ్రోస్కీ, జియో సైంటిస్ట్ సియాన్ ఫ్రాక్టర్లు అంతరిక్షాన్ని తనివితీరా చూశారు. అలా అంతరిక్షాన్ని చూడడం ఒక అద్భుతమని ఐసాక్‌మ్యాన్ చెప్పారు. రోదసి యాత్ర ముగించుకొని తిరిగి వచ్చాక వారి ఆరోగ్యం బాగానే ఉందని స్పేస్ ఎక్స్ సీనియర్ డైరెక్టర్ బెంజి రీడ్ తెలిపారు. చదవండి: చరిత్ర సృష్టించనున్న ఎలన్ మస్క్..! క్రూ– 3 లేడీ ఇలా వచ్చి అలా వెళ్తోంది -
DNA నష్టాలను సరిచేసుకునే దిశగా తొలి అడుగు!
జన్యువులను మన అవసరానికి తగ్గట్టు కత్తిరించేందుకు, భాగాలను చేర్చేందుకు, తొలగించేందుకు క్రిస్పర్ టెక్నాలజీ ఉపయగపడుతుంది. కేన్సర్ సహా అనేక వ్యాధులకు క్రిస్పర్ టెక్నాలజీ చికిత్స కల్పించగలదని అంచనా. ఇలాంటి టెక్నాలజీని తొలిసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం శాస్త్రవేత్తలు అంతరిక్షంలోనూ విజయవంతంగా ఉపయోగించారు. ఈ కేంద్రంలో వ్యోమగాములకు వచ్చే కొన్ని ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఇప్పటివరకు ఎలాంటి మార్గమూ లేదు. రేడియో ధార్మికత, గుండెజబ్బులు, మతిమరుపు వ్యోమగాములకు వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ సమస్యలను అధిగమించేందుకు క్రిస్పర్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘జీన్స్ ఇన్ స్పేస్’ పేరుతో శాస్త్రవేత్తలు క్రిస్పర్ టెక్నాలజీపై ప్రయోగాలు మొదలుపెట్టారు. రేడియో ధార్మికత కారణంగా సంభవించే డీఎన్ఏ నష్టాన్ని క్రిస్పర్ సాయంతో అంతరిక్ష కేంద్రంలోని ఈస్ట్‌లో కలిగించారు. అప్పుడు వాటిల్లో కలిగే మార్పులను.. భూమ్మీద ఉంచిన ఈస్ట్‌లోని మార్పులతో పోల్చి చూశారు. డీఎన్ఏ నష్టం పూర్తిగా బాగైతే ఈస్ట్ సమూహం మొత్తం ఎర్రగా మారేలా క్రిస్పర్ కిట్‌లో ప్రత్యేక భాగాన్ని జత చేశారు. ప్రయోగం చేపట్టిన ఆరు రోజులకు అంతరిక్ష కేంద్రంలోని ఈస్ట్ సమూహాల్లో చాలా వరకు ఎర్రగా మారిపోయాయి. డీఎన్ఏ నష్టాలను సరిచేసుకునే దిశగా ఇది తొలి అడుగని శాస్త్రవేత్త సెబాస్టియన్ క్రేవ్స్ తెలిపారు. -
ఏ మహిళా వెళ్లని జలధి అగాధంలోకి..
కలల నిర్మాణాన్ని కాంట్రాక్టుకివ్వొద్దంటారు క్యాథరీన్. ‘మనల్ని బాగు చేయనివ్వొద్దు.. పాడు చేయనివ్వొద్దు..’ క్యాథరీన్ ఎవరికైనా చెప్పే మాట! అంతరిక్షంలో నడిచిన ఈ తొలి అమెరికన్ మహిళ..నేడు కడలి ‘అడుగు’ను తాకివచ్చిన తొలి సాగరిక! భూ ఉపరితలాన, గగన వీధుల్లో, సముద్రపు లోతుల్లో... ఆమె కెరీర్ కలలన్నీ ఇష్టంగా ఆమె నిర్మించుకున్నవే. భూమి పుట్టి జ్ఞానమెరిగాక ఏ మహిళా వెళ్లని జలధి అగాధంలోకి వెళ్లి విజేతగా తిరిగి వచ్చారు క్యాథరీన్ సలవీన్! భూఉపరితలం నుంచి సముద్ర గర్భంలోకి ఏ ప్రాంతంలోనైతే లోతు ఎక్కువగా ఉంటుందో అంత అడుగుకూ వెళ్లగలిగారు క్యాథరీన్. కేవలం దీన్నొక సాహసంగా చూస్తే మాత్రం ఆమెను మనం తక్కువ చేసినట్లే. ‘దుస్సాహసం’ అనాలి. నింగిపైన భూకక్ష్య చుట్టూ తిరుగుతుండే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రూట్ మ్యాప్‌ను చూసుకుంటూ సముద్రం లోపలికి 35 వేల అడుగుల గమ్యస్థానానికి చేరుకోవడం అంటే మత్స్యయంత్రాన్ని కొట్టడమే! నీళ్లలో కాదు, శూన్యంలో ఈదడం అది. ముప్పైఏడేళ్ల క్రితమే అంతరిక్షంలో నడిచిన ఈ తొలి అమెరికన్ మహిళ ఇప్పుడు సముద్ర గర్భంలోని ‘ఛాలెంజర్ డీప్’ వరకు వెళ్లిన తొలి ప్రపంచ మహిళ అయ్యారు. జూన్ 7 ఆదివారం క్యాథరీన్ ఈ ఘనతను సాధించారు. నాడు ‘ఛాలెంజర్ మిషన్’లో నింగిలోకి. ‘ఛాలెంజర్ డీప్’ అనేది మారియానా అగాధంలో ఉండే ఒక సముద్ర కేంద్రం. అక్కడికి ‘లిమిటింగ్ ఫ్యాక్టర్’ అనే జలాంతర్నౌకలో చేరుకున్నారు క్యాథరీన్. అంత లోతులో నీటి పీడనం సముద్ర ఉపరితలం మీద ఉండేదాని కన్నా వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటుంది. అదొక్కటి చాలు బలంగా లేని జలాంతర్నౌక పేలిపోడానికి. ఇదే ప్రమాదం మనిషి వేసుకున్న రక్షణ కవచానికీ ఉంటుంది. ఇక పీడనం కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఉంటే శిఖరస్థాయి. లేకుంటే పాతాళం. సూక్ష్మక్రిములు మాత్రమే తట్టుకుని జీవించగల అస్థిరతలు అవి. పైగా చీకటి! క్యాథరీన్ సముద్ర విజ్ఞాన పరిశోధకురాలు కనుక తేలిగ్గా ఈదుకొచ్చేశారు. నాసా వ్యోమగామి కూడా అయిన క్యాథరీన్ గగన– సాగర అనుభవం జలాంతర్నౌక పైలట్ విక్టర్ వెస్కోవో పనిని సులభతరం చేసింది. లేకుంటే మారియానా అగాధం అతడిని తిప్పలుపెట్టి ఉండేదే. నేడు నీటిలోని ‘ఛాలెంజర్ డీప్’ లోనికి (లిమిటింగ్ ఫ్యాక్టర్ జలాంతర్నౌకలో క్యాథరీన్, పైలట్ విక్టర్ – ఆ చివర). మారియానా అగాధం పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలోని మారియానా దీవులకు తూర్పు వైపున ఉంటుంది. ప్రపంచపటంలో పైన ఉత్తరం నుంచి నుంచి.. కింద దక్షిణానికి జపాన్, చైనా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, ఆస్ట్రేలియాలను ఒక లెఫ్ట్ బ్రాకెట్లా అర్ధచంద్రాకారంలో పేర్చుకుంటూ వస్తే.. నెలవంక మధ్యలో నక్షత్రం ఉన్నట్లు... ఆ మధ్య భాగంలో ఉంటుంది మారియానా అగాధం. మొత్తం భూగోళం మీదే అతి లోతైన సముద్ర గర్భం అది. లోపల 11 వేల మీటర్ల కింద ఉండే ప్రదేశమే.. ’ఛాలెంజర్ డీప్’. అక్కడికి చేరుకున్నారు క్యాథరీన్. ఇంతవరకు మహిళలెవరూ సాధించని విజయాన్ని ప్రపంచ మహిళావనికి సంపాదించి పెట్టారామె! ఇదంతా ఆమె అధ్యయంలో ఒక భాగం. క్యాథరీన్ అట్లాంటిక్ మహా సముద్రం పైన కూడా సాహసయాత్రలు చేశారు. భూగర్భశాస్త్రంలో పీహెచ్డీ చేశారు క్యాథరీన్. ‘యు.ఎస్.నేవల్ రిజర్వు’లో ఓషనోగ్రఫీ ఆఫీసర్‌గా పని చేశారు. తర్వాత ‘నాసా’కు వెళ్లిపోయారు. భూమి, సముద్రం, ఆకాశం! ‘నాసా’లో పదిహేనేళ్లు పరిశోధనలు చేసి రిటైర్ అయ్యాక అమెరికా ప్రభుత్వ సముద్ర వాణిజ్య, వాతావరణ శాఖ సలహాదారుగా పని చేశారు. కొత్త అధ్యక్షుడిగా ట్రంప్ రావడంతో ఆ పదవి వేరే వారితో భర్తీ అయింది. ‘‘నీ దారి నువ్వే వేసుకోవాలి’’ అంటారు క్యాథరీన్. ‘‘నీ జీవితాన్ని నీకు నిర్మించి ఇచ్చేందుకు ఎప్పుడూ కొందరు సిద్ధంగా ఉంటారు. వాళ్లకు అవకాశం ఇవ్వకు. ఇస్తే వారు చెప్పే సాకులను నువ్వు వినవలసి వస్తుంది. సాకులు వెదుక్కునే వాళ్ల నుంచి మనం ఏదీ నిర్మించుకోలేం. అలాంటి వారికి మన కలల్ని ఎందుకివ్వాలి?’’ అని కూడా ప్రశ్నిస్తారు. 37 ఏళ్ల క్రితం ముప్పై ఒక్కేళ్ల వయసులో తను చేసిన ‘స్పేస్ వాక్’కి గగన సోపానాలను నిర్మించకున్నదీ, ఇప్పుడీ 68 ఏళ్ల వయసులో సముద్రగర్భంలో తను వదలి వచ్చిన ‘అడుగు’ జాడలకు దారులు నిర్మించుకున్నది పూర్తిగా తనే. తన కెరీర్‌ను ఇంకొకర్ని బాగు చేయనివ్వలేదు. పాడు చేయనివ్వలేదు క్యాథరీన్. -
నివాసయోగ్య గ్రహం గుర్తింపు!
మెల్బోర్న్: ఆవాసానికి అనువైన వూల్ఫ్ 1061సీ అనే గ్రహాన్ని గుర్తించినట్లు ఆస్ట్రేలియా ఖగోళ పరిశోధకులు ప్రకటించారు. మన సౌర వ్యవస్థ నుండి కేవలం 14 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహం భూమి కంటే నాలుగు రెట్లు ద్రవ్యరాశి ఎక్కువగా ఉండి జీవులు నివసించడానికి అనువైన వాతావరణంతో ఉందని వెల్లడించారు. సౌర కుటుంబానికి దగ్గరలో ఉన్న రెడ్ డ్వార్ఫ్ స్టార్ అనే నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న మూడు గ్రహాలను కనుగొన్న పరిశోధకులు, మధ్యలో ఉన్నటువంటి 1061సీ గ్రహంలో నివాసానికి అనువైన పరిస్థితులు ఉన్నట్లు గుర్తించారు. ఈ గ్రహంలో నీటి జాడ కూడా ఉండే అవకాశాలు లేకపోలేదని న్యూ సౌత్‌వేల్స్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త డంకన్ రైట్ తెలిపారు. విశాలంగా ఉన్నటువంటి ఈ గ్రహం నివాసయోగ్యంగా ఉండటం, మన సౌరవ్యవస్థకు అత్యంత సమీపంలో దీనిని గుర్తించడం ఆసక్తిగా ఉందన్నారు. 1061సీ గ్రహం ఉపరితలం ఎక్కువ భాగం రాళ్లతో ఉన్నప్పటికీ, కొంత భాగంలో నివాసానికి అనుకూలమైన వాతావరణం ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.